తెలంగాణ

telangana

ETV Bharat / opinion

అమ్మభాషతోనే స్వావలంబన: వెంకయ్య - ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు అప్డేట్స్​

ప్రాచీన కాలం నుంచి భాష, సంస్కృతిలో భారత్​ ముందుంది. ఏళ్లతరబడి వందలాది భాషలు, మాండలికాలతో మనదేశం ఘనమైన చరిత్రను కలిగి ఉంది. భాష అనేది ఒక వ్యక్తి లేదా సామాజిక వర్గ సాంస్కృతిక గుర్తింపుతో ముడిపడి ఉంటుంది. ఈ నేపథ్యంలో మాతృభాషను ప్రోత్సహించే విధానాలను రూపొందించడంలో ప్రభుత్వాలదే బాధ్యత. అన్ని భాషలను ప్రోత్సహించి ప్రపంచం మొత్తాన్ని ఒక్కటిగా ముందుకు తీసుకువెళ్లడం ద్వారా సుస్థిరాభివృద్ధి లక్ష్యాలను సాధించడమనే అంశాన్ని 2021 అంతర్జాతీయ మాతృభాషా దినోత్సవ ఇతివృత్తం స్పష్టం చేస్తోంది.

Interntional Mother tounge day
అమ్మభాషతోనే స్వావలంబన

By

Published : Feb 21, 2021, 6:39 AM IST

నాతన కాలం నుంచి భారతదేశం భాష, సాంస్కృతిక వైవిధ్యానికి చుక్కాని. శతాబ్దాలుగా మన దేశం వందలాది భాషలు, మాండలికాల ఘనమైన సంపదకు చిరునామాగా నిలిచింది. ఆయా భాషలు భారతీయ సాంస్కృతిక విభవంలో శక్తిమంతమైన పాత్రను పోషించాయి. నిజానికి ఒకరి మాతృభాష, ప్రాథమిక భావ ప్రసారానికి మించినది అనే విషయాన్ని మనం ఎట్టి పరిస్థితుల్లోను విస్మరించరాదు. అది ఒక వ్యక్తి లేదా సామాజిక వర్గ సాంస్కృతిక గుర్తింపుతో ముడివడి ఉంటుంది. ఈ నేపథ్యంలో మాతృభాషను ప్రోత్సహించే విధానాలను రూపొందించడం ప్రభుత్వాల బాధ్యత. ఈ మార్గదర్శకాలను రూపొందించడమే కాకుండా, క్షేత్రస్థాయిలో అమలు చేసే దిశగా చొరవ తీసుకోవడం అత్యంత కీలకం. అన్ని భాషలను ప్రోత్సహించి ప్రపంచం మొత్తాన్ని ఒక్కటిగా ముందుకు తీసుకువెళ్లడం ద్వారా సుస్థిరాభివృద్ధి లక్ష్యాలను సాధించడమనే అంశాన్ని 2021 అంతర్జాతీయ మాతృభాషా దినోత్సవ ఇతివృత్తం స్పష్టం చేస్తోంది. ముఖ్యంగా భారతదేశంలో అంతర్జాతీయ మాతృభాషా దినోత్సవం మరింత ప్రత్యేకమైనది. 'విద్యావంతులం మాతృభాషా సమస్యతో సతమతమైతే మనం కలలుగనే స్వేచ్ఛాయుత భారతావనిని సాధించలేమని నా భయం' అని మహాత్మా గాంధీ ఏనాడో హెచ్చరించారు. అదే సమయంలో అన్ని స్థాయుల్లో పాలనా భాషగా, బోధనా భాషగా మాతృభాషను కొనసాగించాలనీ దిశా నిర్దేశం చేశారు.

సృజనాత్మకతకు మార్గం

అమ్మ భాషకు, ఆలోచించే ధోరణికి మధ్య సన్నిహిత సంబంధం ఉంది. అందుకే మాతృభాషలో విద్యను అందించడం పిల్లలకు తమ జాతి, సంస్కృతుల్ని కూడా చెప్పడమేననేది భాషా శాస్త్రవేత్తల మాట. పిల్లల్లో ఆత్మవిశ్వాసాన్ని, సృజనాత్మకతను పెంపొందించడానికి, వారు మరింత మెరుగ్గా విజ్ఞాన సముపార్జన చేయడానికి, విద్యార్థులకు బోధనా భాషగా మాతృభాష ఉండాలని అనేక అధ్యయనాలు వెల్లడించాయి. నల్లజాతి సూరీడు, దక్షిణాఫ్రికా మాజీ అధ్యక్షుడు, భారతరత్న గౌరవాన్ని అందుకున్న నెల్సన్‌ మండేలా 'ఒక వ్యక్తితో ఒక భాషలో మాట్లాడితే అది అతని మస్తిష్కాన్ని మాత్రమే చేరుతుంది. అదే అతని 'మాతృభాష'లో మాట్లాడితే అది అతని హృదయాన్ని హత్తుకుంటుంది' అంటూ మాతృభాష ప్రాధాన్యం గురించి చెప్పిన మాటలు అక్షర సత్యాలు. మాతృభాష అనే వ్యక్తీకరణ, తొలినాళ్ల నుంచి ఒక వాతావరణానికి దగ్గరగా ఉన్న భాష సన్నిహిత అమరికను సూచిస్తుంది. యునెస్కో మాజీ డైరెక్టర్‌ జనరల్‌ కొయిచిరో మత్సురా ఈ విషయాన్ని సంక్షిప్తంగా క్రోడీకరించారు. 'మాతృ గర్భం నుంచి మనం నేర్చుకునే భాషలు, మన అంతరంగిక ఆలోచనలకు బీజం వంటివి. ప్రతి భాష 'విలక్షణమైన ప్రతి మానవ జీవితం వలే విలువైనది, విశిష్టమైనది' అని అభివర్ణించారు.

రెండు భాషలపై ఆధారపడి..

ప్రపంచంలోని చాలా ప్రాంతాల్లోని పిల్లలు తరచూ తమ దైనందిన జీవితంలో కనీసం రెండు భాషల మీద ఆధారపడుతూ తమ గమ్యం దిశగా సజావుగా ముందుకు సాగాల్సి ఉంటుంది. ఇటువంటి బహు భాషా, బహుళ సాంస్కృతిక వాతావరణం మన దేశంలోని అనేక రాష్ట్రాల్లో రోజువారీ అనుభవాల్లో ఒక భాగం. ఈ మెరుగైన భాషా నైపుణ్యాలను పెంపొందించడం పిల్లల్లో మెరుగైన మేధా వికాసానికి దోహదం చేస్తుందని అధ్యయనాలు నిరూపిస్తున్నాయి. మాతృభాషతో పాటు ఇతర భాషల్లో నైపుణ్యాన్ని పెంచుకోవడమనేది బలమైన సాంస్కృతిక వారధుల్ని నిర్మించడానికి సహాయం చేస్తుంది. అంతేగాక నూతన అనుభవాల ప్రపంచానికి వినూత్న మార్గాలను తెరుస్తుంది. భారత మాజీ రాష్ట్రపతి కలాం మాటల్లో చెప్పాలంటే- 'పసి మెదళ్లలో సుడులు తిరిగే ఆలోచనలకు ఆలంబన అమ్మభాషే. అయితే మిగిలిన ప్రపంచంతో అనుసంధానం కావడానికి మాత్రమే ఆంగ్లం వంటి మరో భాష కావాలి.'
ప్రతి భాష తనదైన అమూల్య సాహితీ సంపద, మేధో వారసత్వం, జానపద కథలు, సామెతలు, సూక్తులు, సూత్రాలు, నిండైన పదజాలాలతో నిండి ఉంది. 2018లో భాషా ప్రాతిపదికన సాగిన జనాభా లెక్కల ప్రకారం ఎన్నో కీలకమైన అంశాలు వెలుగులోకి వచ్చాయి. దీని ప్రకారం భారతదేశం మొత్తం 19,500 భాషలు, మాండలికాలకు నిలయంగా ఉంది. మన దేశంలో 10 వేలకు మించి ప్రజలు మాట్లాడే భాషలు 121 వరకూ ఉన్నాయి. 'అంతరించిపోతున్న' వర్గంలోకి వచ్చే 196 భారతీయ భాషలను పునరుద్ధరించాల్సిన అవసరం ఉంది. వాటి పునరుజ్జీవనానికి ఆయా భాషలకు చెందిన వారు నడుం బిగించాలి.

బహుభాషా విధానంతో ముందడుగు

బహుళ మార్గాల్లో సాగే పరిపాలనా క్రమంలో మనం ఎక్కువగా మాతృభాషల మీద ఆధారపడాల్సి ఉంటుందనేది నా ప్రగాఢ విశ్వాసం. ప్రజల భాషలోనే పరిపాలన ముందుకు సాగాలన్నదే నా ఆకాంక్ష. సామాన్యులు సైతం అర్థం చేసుకోగల భాషలో వారితో ఉత్తర ప్రత్యుత్తరాలు జరపడం సుపరిపాలనను ప్రతి గడపకూ తీసుకువెళుతుందని నేను విశ్వసిస్తాను. ప్రాంతీయ భాషలు లేదా రాష్ట్రాల అధికారిక భాషల్లో పరీక్షలు నిర్వహించే దిశగా భారత ప్రభుత్వ వివిధ విభాగాలు ప్రవేశపెట్టిన అనేక కార్యక్రమాలను నేను హృదయపూర్వకంగా స్వాగతిస్తున్నాను. అధికారికంగా గుర్తించిన 22 భాషల్లో రాజ్యసభ సభ్యులు, సభలో మాట్లాడేందుకు అవకాశం కల్పించడమే కాకుండా, ఇందుకు తగినట్లుగా ప్రత్యేక ఏర్పాట్లు చేయడం కూడా జరిగింది. సుప్రీంకోర్టు సైతం తమ తీర్పులను 22 అధికారిక భాషలకుగాను ప్రాథమికంగా ఆరు భాషల్లో అనువాదం చేసి ప్రజలకు అందుబాటులోకి తీసుకొచ్చే దిశగా తీసుకున్న నిర్ణయం బహుభాషా విధానం దిశగా ఓ కీలకమైన ముందడుగుగా చెప్పుకోవాలి.

కీలక చిహ్నం..

ప్రతి భాష, తనకంటూ ప్రత్యేకమైన విలువలు, ఆచారాలు, సంప్రదాయాలు, అభ్యాసాలు, కథలు, ప్రవర్తనలు, నిబంధనలతో సాంస్కృతిక భాండాగారంగా ఉంటుందనే విషయాన్ని పునరుద్ఘాటిస్తున్నాను. ఏదైనా సంస్కృతిలో మమేకం కావడానికి, దాని సారాన్ని అర్ధం చేసుకోవడానికి ఆయా సంస్కృతులకు చెందిన భాషలను పూర్తిగా అవగతం చేసుకోవాలి. భాష, సంస్కృతి, చరిత్ర... ఈ మూడు ప్రతిదానితో మరొకటి బలమైన సంబంధాన్ని కలిగి ఉన్నాయి. సంస్కృతికి కీలకమైన చిహ్నంగా భాష నిలబడి ఉంటుంది. సామాజిక లేదా జాతి సమూహాలకు మాతృభాషలే ద్వారాలు అని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. మనది బహుభాషా, బహుళ సాంస్కృతిక సమాజం. ఎంతో శక్తిమంతమైన నాగరికత ప్రవాహంలో వ్యక్తిగత, ప్రాంతీయ, జాతీయ గుర్తింపులతో ముడివడి ఉన్న విస్తారమైన భాషా సంపదను బలోపేతం చేసుకునే దిశగా, మాతృభాషా పునరుజ్జీవనానికి ప్రతి ఒక్కరూ కంకణబద్ధులు కావాలని ఆకాంక్షిస్తున్నాను.

- ముప్పవరపు వెంకయ్యనాయుడు, ఉపరాష్ట్రపతి

ఇదీ చదవండి:'కరోనా తొలగిపోతుందని భావిస్తే పొరబడినట్లే'

ABOUT THE AUTHOR

...view details