తెలంగాణ

telangana

ETV Bharat / opinion

నిరుద్యోగ సమస్య తీరాలంటే కావాలీ పట్టణ ఉపాధి హామీ - కరోనా నిరుద్యోగం

కరోనాతో కుదేలైన ఆర్థిక వ్యవస్థను గాడిలో పెట్టేందుకు ప్రపంచ దేశాలు కృషి చేస్తున్నాయి. ఇందుకోసం ఉద్దీపన పథకాలను ప్రవేశపెట్టాయి. కానీ దీని వల్ల ఎటువంటి ప్రయోజనం కనిపించటం లేదు. ఈ మహమ్మారి వల్ల ఎంతో మంది ఉద్యోగాలు కోల్పోయారు. తద్వారా నిరుద్యోగ సమస్య ఎక్కువైంది. ఈ పరిస్థితుల్లో కేంద్ర ప్రభుత్వం పట్టణ ఉపాధి హామీ పథకంపై దృష్టి సారించాలని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. దీని వల్ల ఎంతో మందికి ఉపాధి చేకూరుతుందని చెబుతున్నారు.

Time for an Urban Employment Guarantee Programme
నిరుద్యోగ సమస్య తీరాలంటే కావాలి పట్టణ ఉపాధి హామీ

By

Published : Jun 18, 2020, 11:01 AM IST

కొవిడ్‌ మహమ్మారి పరిశ్రమలు, వ్యాపారాలను మూతవేయించి ఉద్యోగాలను ఊడగొట్టింది. ప్రజల కొనుగోలు శక్తి అడుగంటి వస్తుసేవలకు గిరాకీ పడిపోయి ఉత్పత్తి కుదేలైంది. ఆర్థిక వ్యవస్థకు కొత్త ఊపు తీసుకురావాలని ప్రపంచ దేశాలు అంతర్జాతీయ జీడీపీలో 10 శాతాన్ని ఉద్దీపన పథకాలకు వెచ్చించినా వినియోగం, పెట్టుబడులు ఊపందుకునే అవకాశాలు ఇప్పట్లో లేవని ఐక్యరాజ్య సమితి ఆర్థిక, సామాజిక వ్యవహారాల విభాగం భావిస్తోంది.

గ్రామాలకే ప్రాధాన్యం

భారత్‌ ఇటీవల ప్రకటించిన రూ.20 లక్షల కోట్ల ఉద్దీపన ప్యాకేజి చిన్న పరిశ్రమలు, వ్యవసాయం మీద దృష్టిపెట్టినా, ఉపాధి అవకాశాలు వెల్లువెత్తుతాయని ఎవరూ పెద్దగా ఆశలు పెట్టుకోవడం లేదు. పైగా గ్రామాలకే ఉద్దీపన ఎక్కువ ప్రాధాన్యమిచ్చింది. మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం, వలస కూలీలకు ఉచిత ఆహార ధాన్యాలు, గ్రామాల్లో ప్రభుత్వ వ్యయాల పెంపు వంటివి ఉద్దీపన ప్యాకేజీలో ముఖ్య భాగాలు. పట్టణాల మీద, అక్కడ ఉపాధి కల్పన మీద ఇదే స్థాయిలో శ్రద్ధాసక్తులు కనబరచలేదు. ఈ ఏడాది గ్రామీణ భారతంలో పంటలు బాగా పండగా, పట్టణాల్లో మూతబడిన అంగళ్లు, మాల్స్‌, థియేటర్లు, కార్యాలయాలు, పరిశ్రమలు నిరాశావహ దృశ్యాన్ని ఆవిష్కరించాయి. జీవనోపాధి కోల్పోయి కోట్లమంది వీధినపడ్డారు. భారతదేశానికి పారిశ్రామికంగా ఆయువుపట్టులైన ముంబయి, అహ్మదాబాద్‌, చెన్నై, దిల్లీ, కోల్‌కతాలు రెడ్‌ జోన్లుగా ప్రకటితం కావడంతో ఉత్పత్తి, సరఫరాలు స్తంభించిపోయి, దాని దుష్ప్రభావం దేశమంతటా పడింది.

ఉద్దీపన ప్యాకేజీలో సూక్ష్మ, చిన్న, మధ్యతరహా పరిశ్రమలకు, బ్యాంకింగేతర ఫైనాన్స్‌ సంస్థలకు నేరుగా అందిన నిధులంటూ ఏవీ లేవనే చెప్పాలి. ప్రస్తుత క్లిష్టకాలంలో వ్యాపారాలకు ప్రత్యక్ష నగదు సహాయం అందిస్తే తప్ప ఉపాధి అవకాశాలు పెరగవు, సరఫరా గొలుసులు గాడిన పడవు. ఈ పరిస్థితిలో కరోనా వల్ల స్వగ్రామాలకు తరలిపోయిన వలస కూలీలు మళ్ళీ పట్టణాలకు తిరిగిరావడం కష్టమైపోతోంది. అందుకే లాక్‌డౌన్‌ లేనిచోట్ల స్థిరాస్తి రంగం, భవన నిర్మాణం, చిన్న పరిశ్రమలు, సరకుల సరఫరా రంగాలకు ఇప్పటికే కార్మికుల కొరత ఏర్పడింది. వ్యాపారాలు, ఉపాధి అవకాశాలు ఊపందుకోలేకపోతున్నాయి. ఈ పరిస్థితిని చక్కదిద్దకపోతే రేపు కొవిడ్‌ పీడ విరగడైన తరవాతా ఆర్థిక రథం ముందుకు కదలలేక, ఉన్నచోటే దిగబడిపోతుంది. స్థిరాస్తి, భవన నిర్మాణం, సరకుల సరఫరా రంగాల్లో వ్యాపారాలకు తగు పరిమాణంలో నిధులు అందిస్తే, ఈ కష్టకాలంలో అవి మూతబడకుండా నిలదొక్కుకుని, అనుకూల వాతావరణం ఏర్పడినప్పుడు విజృంభించగలుగుతాయి. పట్టణాల్లో ఉపాధి అవకాశాలు మళ్ళీ వెల్లువెత్తుతాయి. వస్తుసేవలకు గిరాకీ పెరిగి ఉత్పత్తి తిరిగి ఊపందుకొంటుంది.

పట్టణ ఉపాధి హామీ పథకం

ఏదిఏమైనా నిరుద్యోగ సమస్యకు కొత్త దృక్కోణంతో కొత్త పరిష్కారం కనుగొనడం ఆవశ్యకం. ఆర్థికవేత్తలు కొంతకాలం నుంచి చేస్తున్న ఒక ప్రతిపాదన ఇప్పుడు ప్రాధాన్యం సంతరించుకొంటోంది. జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం నమూనాలో జాతీయ పట్టణ ఉపాధి హామీ పథకాన్ని తీసుకురావాలని ఆ ప్రతిపాదన సారాంశం. భారత్‌లో 2012 నుంచి ఉపాధి విపణిలోకి వస్తున్న యువతీయువకుల సంఖ్య ఏటా పెరుగుతుండగా, ఉపాధి అవకాశాలు వివిధ కారణాల వల్ల తరిగిపోతున్నాయి. ఇంతలో పులిమీద పుట్రలా కొవిడ్‌ వచ్చి పడి ఉన్న కాస్త ఉద్యోగాలకూ మంగళం పాడుతోంది. ఈ పరిస్థితిని చక్కదిద్దడానికి పట్టణ ఉపాధి హామీ పథకం కీలకమవుతుంది.

మధ్యప్రదేశ్‌లో 2019లో అప్పటి కాంగ్రెస్‌ ప్రభుత్వం ఈ పథకాన్ని ప్రవేశపెట్టడం గమనార్హం. ఈ పథకం కింద మహానగరాల్లోనే కాకుండా చిన్న పట్టణాల్లోనూ ఉపాధి అవకాశాలకు ప్రాధాన్యమిస్తారు. 2011 జనగణన ప్రకారం భారతదేశంలో పురపాలక సంఘాలు, నగర పంచాయతీల పాలనలో ఉన్న చిన్న, మధ్యతరహా పట్టణాల సంఖ్య 4,041. అక్కడ నిరుద్యోగమే కాదు, విద్యార్హతలకన్నా తక్కువ స్థాయి ఉద్యోగాలు చేయడం సర్వసాధారణం. పట్టణ ఉపాధి హామీ పథకం కింద ప్రభుత్వం అదనపు నిధులు కేటాయిస్తే చిన్న పట్టణాల్లో మౌలిక వసతులు, సేవలను మెరుగుపరచవచ్ఛు స్థానిక యువతకు నైపుణ్యాలను అలవరచవచ్ఛు పట్టణ పరిపాలనా సంస్థల ఆర్థిక, నిర్వహణ సామర్థ్యాలను పెంపొందించడానికి వీరిని నియోగించడం ద్వారా ఉపాధి అవకాశాలు పెంచవచ్చని అజీమ్‌ ప్రేమ్‌ జీ విశ్వవిద్యాలయానికి చెందిన ఆర్థికవేత్తలు గతేడాది అధ్యయన పత్రం వెలువరించారు. వారి ప్రతిపాదనలో ఆసక్తికరమైన, ఆచరణీయమైన అంశాలెన్నో ఉన్నాయి.

ప్రజోపయోగ ఆస్తుల నిర్మాణం

పట్టణ ఉపాధి హామీ పథకం ఇంటర్మీడియట్‌, ఆలోపు విద్యార్హతలు ఉన్న స్థానిక యువతకు ప్రయోజనం కలిగిస్తుంది. రోడ్లు, ఫుట్‌పాత్‌లు, కాలి వంతెనల నిర్మాణానికి వీరిని నియోగించవచ్ఛు రోజుకు రూ.500 వేతనంపై ఏటా 100 రోజులపాటు నికరంగా ఉపాధి కల్పించడమే లక్ష్యంగా పట్టణ ఉపాధి హామీ పథకం పని చేయాలి. పట్టణ ఉద్యానవనాలు, చెరువులు, బంజరు భూముల సక్రమ నిర్వహణకు ఈ పథకం కింద సిబ్బందిని నియోగించాలి. పట్టణాల్లో బాలలు, వృద్ధులు, దివ్యాంగుల ఆలనాపాలనా చూసుకునే విధుల్లోనూ స్థానిక యువతను నియమించవచ్చని అజీమ్‌ ప్రేమ్‌ జీ వర్సిటీ ఆర్థికవేత్తలు సూచిస్తున్నారు.

ఇంటర్‌ అంతకన్నా ఎక్కువ విద్యార్హతలు ఉన్న పట్టణ యువతీయువకులకు అప్రెంటిస్‌లుగా శిక్షణ ఇచ్చి పురపాలక సంఘ కార్యాలయాల్లో సిబ్బందికి తోడ్పాటుగా నియోగించవచ్చని ప్రతిపాదించారు. అయిదు నెలలపాటు రూ. 13,000 చొప్పున నెలసరి భృతిపై అప్రెంటిస్‌ శిక్షణ ఇవ్వాలని సూచించారు. ఈ విధంగా ఇంటర్మీడియట్‌ లోపు, ఆపై విద్యార్హతలు ఉన్న యువతీయువకులను రెండు శ్రేణులుగా విభజించి ఉపాధి చూపవచ్ఛు పట్టణాభివృద్ధి పథకానికి మన స్థూల దేశీయోత్పత్తి (జీడీపీ)లో ఏటా 1.7 నుంచి 2.7 శాతం వరకు నిధులు వెచ్చిస్తే, 3 నుంచి 5 కోట్ల మందికి ప్రయోజనం కలుగుతుంది. పథకానికి అయ్యే ఖర్చులో 80 శాతాన్ని కేంద్రం, 20 శాతాన్ని రాష్ట్రాలు భరించాలి. దాని అమలు బాధ్యతను పట్టణ స్వపరిపాలనా సంస్థలకు (యూఎల్‌సీ) అప్పగించాలి. అవి 74వ రాజ్యాంగ సవరణ కింద వార్డు కమిటీలతో కలిసి ఈ పథకాన్ని అమలు చేయవచ్ఛు కొవిడ్‌ వల్ల ప్రభుత్వాలకు పన్నుల ఆదాయం తగ్గిపోయిన మాట నిజమే కానీ, నిరుద్యోగమూ కట్టలు తెంచుకుందని మరచిపోకూడదు. గాయమైనప్పుడు కట్టుకట్టడం కాకుండా, శాశ్వత ప్రాతిపదికపై పరిష్కారం సాధించడానికి గ్రామీణ, పట్టణ ఉపాధి హామీ పథకాలు రెండూ ఎంతో ఉపయోగపడతాయి.

వలసలకూ అడ్డుకట్ట

పట్టణ ఉపాధి హామీ

పౌరులకు జీవించే హక్కును 21వ రాజ్యాంగ అధికరణ ప్రాథమిక హక్కుగా గుర్తించింది. ఇది సక్రమంగా అమలు కావాలంటే, పౌరులకు జీవనోపాధి ఉండాలి. పట్టణ ఉపాధి హామీ పథకం కింద పట్టణ పౌరులకు పనిచేసే హక్కును చట్టబద్ధ హక్కుగా గుర్తించాలి. ప్రతి ఆర్థిక సంవత్సరం ఆరంభంలోనే కేంద, రాష్ట్ర ప్రభుత్వాలు పట్టణ ఉపాధి హామీ పథకం అమలు కోసం పురపాలక సంస్థలకు, నగర పంచాయతీలకు నిధులు కేటాయించాలి. 10 లక్షల వరకు జనాభా ఉన్న పట్టణ స్వపరిపాలనా సంస్థలకు ఈ పథకాన్ని వర్తింపజేస్తే, మహానగరాలకు వలసలూ తగ్గుతాయని అజీమ్‌ ప్రేమ్‌ జీ విశ్వవిద్యాలయానికి చెందిన సుస్థిర ఉపాధి కేంద్ర విధాన పత్రం పేర్కొంటోంది. పట్టణ, గ్రామీణ ఉపాధి హామీ పథకాలను చెట్టపట్టాల్‌గా అమలుచేయడం వల్ల రెండు ప్రాంతాలూ అభివృద్ధి చెందుతాయి.

- వరప్రసాద్‌

ABOUT THE AUTHOR

...view details