తెలంగాణ

telangana

ETV Bharat / opinion

అధ్యక్షుడిగా బైడెన్​ ముందున్న సవాళ్లు ఇవే.. - బైడెన్ వార్తలు

పిన్న వయస్కుడైన సెనేటర్‌గా రాజకీయ ప్రస్థానం ఆరంభించి 48 ఏళ్ల తరవాత అత్యంత వయోధిక అధ్యక్షుడిగా కొలువు తీరనున్న బైడెన్‌.. తక్షణ ప్రాథమ్యాలుగా కొవిడ్‌ సంక్షోభంతోపాటు ఆర్థిక మాంద్యమూ నిలుస్తోంది. బ్లూ, రెడ్‌ స్టేట్స్‌ అన్న వైరుధ్యాల్ని తోసిపుచ్చి 'యునైటెడ్‌ స్టేట్స్‌'గా అమెరికాను కదం తొక్కించినప్పుడే- బైడెన్‌ హారిస్‌ ద్వయానికి అసలైన విజయం దక్కినట్లు!

biden
బైడెన్

By

Published : Nov 9, 2020, 7:21 AM IST

కిందపడ్డా పైచేయి తనదేనంటూ డొనాల్డ్‌ ట్రంప్‌ ఎంత గింజుకొంటున్నా అమెరికా 46వ అధ్యక్షుడు జో బైడెనేనని ఎన్నికల ఫలితాలు ధ్రువీకరిస్తున్నాయి. నెవాడా పెన్సిల్వేనియా రాష్ట్రాలు డెమొక్రాట్లవైపు మొగ్గడంతో మూన్నాళ్లుగా ముసురేసిన అనిశ్చితికి తెరపడి, మరికొన్ని ఫలితాల వెల్లడికి ముందే బైడెన్‌ విజయం ఖరారైపోయింది. శతాబ్దకాలంలో ఎన్నడూ లేనివిధంగా 67శాతం (16 కోట్లమంది) ఓటర్లు పోలింగ్‌ ప్రక్రియలో పాల్పంచుకోగా ఏకంగా పదికోట్ల ఓట్లు మెయిల్‌ ద్వారా వచ్చిన చరిత్రాత్మక ఎన్నికల్లో- గెలిచిన బైడెన్‌కు, ఓడిన ట్రంప్‌కూ పడిన ఓట్లు రికార్డు సృష్టించాయి.

అమెరికాలో మహిళలకు ఓటుహక్కు దఖలుపడిన వందేళ్లకు ఒక స్త్రీ, అందునా దక్షిణ భారత మూలాలుగల కమలా హారిస్‌ అగ్రరాజ్యానికి ఉపాధ్యక్షురాలిగా ఎన్నికైన చారిత్రక ఘడియలివి. ట్రంప్‌ కంటే బైడెన్‌ ఎనిమిదిశాతం ఆధిక్యం కనబరుస్తారన్న సర్వేక్షకుల అంచనాలన్నీ తప్పుల తడకలైపోగా, నేటికీ సంపూర్ణంగా ఫలితాలు వెలువడలేని స్థాయిలో ట్రంప్‌ ఇచ్చిన పోటీ అమెరికా సమాజం ఎంతగా చీలిపోయిందో కళ్లకు కడుతోంది. గత ఎన్నికల్లో తన కొమ్ముకాసిన రాష్ట్రాలూ అత్యల్ప మెజారిటీతో చేజారిపోవడం జీర్ణించుకోలేని ట్రంప్‌ న్యాయ పోరాటాలకు తెరతీస్తున్న నేపథ్యంలో- కొవిడ్‌ మహమ్మారి కట్టడికి, సౌభాగ్య సాధనకు, ఆరోగ్య భద్రత కల్పించేందుకు, వ్యవస్థీకృత జాత్యహంకారాన్ని తుడిచి పెట్టేందుకు సమరం సాగించాలని బైడెన్‌ పిలుపిస్తున్నారు.

‘అమెరికాకే తొలి ప్రాధాన్యం’ అంటూ అధికారానికి వచ్చిన ట్రంప్‌- అగ్రరాజ్యాన్ని ఏకాకిగా మార్చేశారన్న డెమొక్రాట్ల ఆరోపణలో ఏ మాత్రం అతిశయోక్తి లేదు. నాలుగేళ్ల నిరవధిక ట్రంపరితనం- అమెరికాతోపాటు అంతర్జాతీయ సమాజాన్నీ అవస్థల పాలుచేసింది. ఆ గాయాలను మాన్పడమే బైడెన్‌ దక్షతకు తొలి పరీక్ష కానుంది!

48 ఏళ్ల తర్వాత..

పిన్న వయస్కుడైన సెనేటర్‌గా రాజకీయ ప్రస్థానం ఆరంభించి 48 ఏళ్ల తరవాత అత్యంత వయోధిక అధ్యక్షుడిగా కొలువు తీరనున్న బైడెన్‌ తక్షణ ప్రాథమ్యాలుగా కొవిడ్‌ సంక్షోభంతోపాటు ఆర్థిక మాంద్యమూ నిలుస్తోంది. కోటికి చేరువైన కేసులు, 2.3 లక్షల మరణాలతో కుంగుతున్న అమెరికాను సాంత్వనపరచే పటుతర వ్యూహాన్ని సిద్ధం చేస్తున్నానన్న బైడెన్‌కు- వనరుల సమీకరణలో రిపబ్లికన్ల తోడ్పాటు తప్పనిసరి.

ట్రంప్‌ మాదిరిగానే అమెరికాలో తయారీని ప్రోత్సహిస్తామని వాగ్దానం చేసిన బైడెన్‌- అమెరికన్‌ వస్తూత్పాదనల కొనుగోలు ఆంక్షలకు కట్టుబడితే అంతర్జాతీయంగా వాణిజ్య స్పర్థలు తప్పకపోవచ్చు. అమెరికాతో తొలి దశ వాణిజ్య ఒప్పందం దరిమిలా పదినెలల్లో ద్వైపాక్షిక వాణిజ్యం 3.9శాతం పెరిగిందంటున్న బీజింగ్‌- శ్వేత సౌధం ఎవరికి దక్కినా ఉభయ దేశాల సంబంధాల్లో పెద్దగా మార్పులుండబోవని భావిస్తోంది. రష్యా, సిరియా, ఉత్తర కొరియా, ఇండో పసిఫిక్‌, తైవాన్‌, హాంకాంగ్‌, 5జి వంటి సున్నిత అంశాలపై బైడెన్‌ ప్రభుత్వ ధోరణి ప్రపంచ పరిణామాల్ని ప్రభావితం చేయనుంది.

భారత్​తో సంబంధాలు..

భారత్‌ అమెరికా సంబంధాలు వ్యూహాత్మక కక్ష్యకు చేరినందున పెద్దగా ఒడుదొడుకులకు లోనయ్యే అవకాశం లేదన్న విశ్లేషణలు వినవస్తున్నాయి. అమెరికన్ల అవకాశాల్ని తన్నుకుపోతున్నారంటూ హెచ్‌1బి వీసాల విషయంలో ట్రంప్‌ దుందుడుకుతనం ఐటీ పరిశ్రమలతోపాటు లక్షలమంది ఔత్సాహికుల ఆశలపై నీళ్లు చల్లడం తెలిసిందే. మేధావలసలకు ఎర్ర తివాచీ పరిచేలా ఉన్న డెమొక్రాట్ల విధానం అవకాశాల స్వర్గానికి నిచ్చెనలు వేసేదే! వర్ణ విచక్షణ బలంగా వేరూనుకొన్న సమాజంలో 'అమెరికన్‌ ఆత్మ'ను పరిరక్షించే విధంగా ఐకమత్యాన్ని సాధించడమే బైడెన్‌కు తొలి సవాలు. బ్లూ (డెమొక్రాట్‌), రెడ్‌ (రిపబ్లికన్‌) స్టేట్స్‌ అన్న వైరుధ్యాల్ని తోసిపుచ్చి 'యునైటెడ్‌ స్టేట్స్‌'గా అమెరికాను కదం తొక్కించినప్పుడే- బైడెన్‌ హారిస్‌ ద్వయానికి అసలైన విజయం దక్కినట్లు!

ఇదీ చూడండి:ఇవి దోచుకున్న ఎన్నికలు: డొనాల్డ్​ ట్రంప్​

ABOUT THE AUTHOR

...view details