ప్రపంచంలో ఎన్నో సంప్రదాయ పద్ధతుల్ని కొవిడ్ సమూలంగా మార్చేసింది. కొన్ని ఉద్యోగాల తీరుతెన్నులే మారిపోయాయి. రోజూ కార్యాలయానికి వెళ్లి రావాల్సిన అవసరం లేకుండా- ఇంటి నుంచే పనిచేసే 'వర్క్ ఫ్రం హోం', ఎక్కడి నుంచైనా పనిచేసే 'రిమోట్ వర్క్' వంటి నూతన పద్ధతులకు ఆదరణ పెరిగింది. కొత్త పద్ధతుల్లో యాజమాన్యాలకు కార్యాలయ నిర్వహణ భారం, రవాణా వ్యయాలు తగ్గి, ఇతరత్రా వెసులుబాట్లూ సమకూరాయి. ఉద్యోగులకు తమ కుటుంబ సభ్యులతో అధిక సమయం గడిపే అవకాశం పెరగడం, ప్రయాణ భారం తగ్గడం వంటి ప్రయోజనాలు సమకూరాయి. ఇలాంటి పద్ధతులు సుదీర్ఘ కాలంపాటు చక్కని వాతావరణంలో పకడ్బందీగా కొనసాగడానికి స్పష్టమైన విధివిధానాలు అవసరం. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఇప్పటివరకు ఎలాంటి నిబంధనలు, చట్టాలు రూపొందించకపోవడం గమనార్హం.
ఆదరణ పెరిగింది..
ప్రపంచవ్యాప్తంగా ఐటీ పరిశ్రమలో 2018 నాటికే 70శాతం ఉద్యోగులు వారానికోరోజు ఇంటివద్దే విధులు నిర్వర్తిస్తుండగా, 53శాతం వారంలో సగం రోజులు ఈ అవకాశం వినియోగించుకుంటున్నారు. మన దేశంలో ఐటీ, ఐటీ ఆధారిత సేవల (ఐటీఈఎస్) రంగంలో ప్రస్తుతం 40.36 లక్షల మంది ఉద్యోగులు ఉండగా, కొవిడ్ ప్రభావంతో 85శాతం ఇళ్లకే పరిమితమై విధులు నిర్వర్తించారు. గూగుల్, ఫేస్‌బుక్, సేల్స్‌ఫోర్స్, అడోబ్ సంస్థలు తమ ఉద్యోగులకు 2020లో పూర్తిగా ఇంటి నుంచే పని చేసే వెసులుబాటు ఇచ్చాయి. ట్విటర్ మరో అడుగు ముందుకేసి శాశ్వతంగా ఇంటి వద్దే విధులు చేపట్టవచ్చని పేర్కొంది. టీసీఎస్ 2025 నాటికి తన ఉద్యోగుల్లో 75 శాతాన్ని కార్యాలయానికి రప్పించాల్సిన అవసరం లేకుండా ప్రణాళికలు సిద్ధం చేస్తోంది.
ఆ భారం తగ్గుతోంది..
రాబోయే మూడు నుంచి అయిదేళ్లలో ఐటీలో 60శాతం, ఐటీఈఎస్‌లో 40శాతం ఉద్యోగులు ఇంటి నుంచి పని చేసే అవకాశం ఉందని నాస్కామ్ వెల్లడించింది. దశాబ్దం కిందటే మన దేశంలో ఇలాంటి పద్ధతులు అందుబాటులో ఉన్నా, కొవిడ్ సంక్షోభం తరవాతే చాలా కంపెనీలు ఆన్‌లైన్ పనులబాట పట్టాయి. కార్యాలయాలకు వెళ్ళాల్సిన అవసరం లేకపోవడంతో దిల్లీలో ఉండే ఓ ఉద్యోగికి నెలకు రూ.ఆరు వేలదాకా రుసుముల భారం తగ్గడంతోపాటు, రోజుకు 1.45గంటల సమయం కలిసి వస్తున్నట్లు ఐస్టాక్ సంస్థ విశ్లేషించింది.
ఎన్నెన్నో ఇబ్బందులు..
మరోవైపు- ఇంటి నుంచే పని కారణంగా సుదీర్ఘ పని గంటలు, ఒత్తిడి, తక్కువ విరామం, కంప్యూటర్ తెరముందు ఎక్కువసేపు గడపాల్సి రావడం వంటి సమస్యలున్నాయి. ఓ ఆన్‌లైన్ సంస్థ నిర్వహించిన సర్వే ప్రకారం- 55శాతం ఉద్యోగులు సామాజిక ఒంటరితనానికి లోనవుతున్నట్లు తేలింది. కుటుంబ అవసరాల్ని సమన్వయం చేసుకోలేకపోతున్నట్లు 44శాతం, సహోద్యోగులతో ఆన్‌లైన్ చర్చల్లో పాల్గొనేందుకు ఇబ్బందిగా ఉందని 40శాతం, అంతర్జాల వేగం అవరోధంగా ఉందని 41శాతం వెల్లడించారు. చాలామంది ఇళ్లలో ప్రత్యేక కార్యస్థలాన్ని సమకూర్చుకోలేకపోతున్నారు. సంస్థలకు 20 నుంచి 25శాతం ఉత్పాదకత పెరిగింది.