'గడచిన నాలుగేళ్లలో ప్రపంచవ్యాప్తంగా 84 లక్షల మంది చిన్నారులు కూలీలుగా మారారు. దీంతో మొత్తం బాలకార్మికుల సంఖ్య 16 కోట్లకు చేరింది. కరోనా మహమ్మారి ప్రభావంతో మరో 90 లక్షల మంది పిల్లలు 2022 చివరికల్లా కార్మికులుగా మారబోతున్నారు. భారత్‌లో వీరి సంఖ్య ఇప్పటికే కోటి దాటింది. పేదరికం, కుటుంబాల దుర్భర పరిస్థితులు, అవసరాలు, స్థానిక పరిస్థితుల కారణంగా 5-14 ఏళ్ల మధ్య పిల్లలు ప్రమాదకర వృత్తుల్లో మగ్గుతున్నారు...' బాలకార్మిక వ్యవస్థ వ్యతిరేక దినాన్ని పురస్కరించుకొని అంతర్జాతీయ కార్మిక సంస్థ (ఐఎల్‌ఓ), ఐక్యరాజ్య సమితి బాలల నిధి (యునిసెఫ్) విడుదల చేసిన అధ్యయన నివేదిక వెల్లడించిన కఠోరవాస్తవమిది. ఆడుతూ పాడుతూ చదువుకొంటూ ఆనందంగా ఎదగాల్సిన భావి పౌరుల దీనస్థితికి ఈ నివేదిక అద్దం పడుతోంది. గ్రామాలు, పట్టణాలు అనే తేడా లేకుండా పసివారిపై శ్రమభారం వైరస్ కంటే ఎక్కువ నష్టం కలగజేస్తోంది. కరోనా వ్యాప్తి- తల్లిదండ్రులతో పాటు పిల్లలూ పనులకు వెళ్లాల్సిన దుస్థితిని కొనితెచ్చింది. వారి హక్కులను హరించింది. బాల కార్మిక వ్యవస్థను మానసికంగా, శారీరకంగా, సామాజికంగా, నైతికంగా ప్రమాదకరమైనదిగా పరిగణించి నివారణ చర్యలు చేపట్టడం ప్రభుత్వాల తక్షణ కర్తవ్యం.
చిరుప్రాయం నుంచే...
యునిసెఫ్ మార్గదర్శకాల మేరకు 18 ఏళ్ల వరకు పిల్లలపై ఎలాంటి ఒత్తిళ్లూ ఉండరాదు. వారు విధిగా చదువును అభ్యసిస్తూ స్వేచ్ఛగా జీవించాలి. వ్యవసాయం, వ్యాపారాల్లో కుటుంబ సభ్యులకు సహాయకారులుగా ఉండాలే తప్ప- కార్మికుల్లో ఒకరుగా మారకూడదు. కానీ, వాస్తవ పరిస్థితులు అందుకు భిన్నంగా ఉన్నాయి. కోట్ల మంది బాలబాలికలు అయిదేళ్ల చిరుప్రాయం నుంచే పుట్టెడు పనులు చేయాల్సి వస్తోంది. మిగిలిన దేశాలతో పోలిస్తే భారత్‌లో ఈ ప్రభావం ఎక్కువగా ఉంది. వ్యవసాయాధారిత దేశం కావడంతో పిల్లలు తల్లిదండ్రులతో పాటు పొలం పనులకు వెళ్తున్నారు. ఇది వారి విద్యపై ప్రభావం చూపుతోంది. స్వాతంత్య్రం సిద్ధించి ఏడున్నర దశాబ్దాలు కావస్తున్నా- ఇప్పటికీ దేశంలో 23శాతం ప్రజలు నిరక్షరాస్యులే. బడి ఈడు చిన్నారులు ఇందులో సగానికిపైనే ఉన్నారు. పేదరికం పిల్లలకు శాపంగా మారుతోంది. తల్లిదండ్రులు నిత్యం పనులకు వెళ్తూ అదనపు ఆదాయం కోసం పిల్లలనూ వెంట తీసుకెళ్తున్నారు. సంచార జాతులు, వలస కార్మికుల కుటుంబాల్లో ఎక్కువగా ఈ పరిస్థితి కనిపిస్తోంది.
వేతనాలు తక్కువనే ఉద్దేశంతో..
కుటీర, చిన్నతరహా పరిశ్రమల్లో పెద్దసంఖ్యలో చిన్నారులు పనుల్లో పాలు పంచుకొంటున్నారు. వేతనాలు తక్కువనే ఉద్దేశంతో యజమానులు బాల కార్మికులను ప్రోత్సహిస్తున్నారు. పిల్లల శ్రమ దోపిడి కోసం వారి అక్రమ రవాణా సాగుతోంది. దేశంలో ప్రతినెలా రెండువేలకు పైగా పిల్లల అక్రమ రవాణా కేసులు నమోదవుతున్నాయి. బాల కార్మికుల్లో అధికశాతం అనారోగ్యం పాలవుతున్నారు. వయసుకు తగ్గ పెరుగుదల లేదు. కరోనా సమయంలోనూ పనులకు వెళ్లడం వల్ల వైరస్ నుంచి రక్షణ కొరవడింది. వివిధ నిర్మాణ పనులు, గాజులు, రంగులు, రసాయనాల పరిశ్రమలు, గనులు, క్వారీలు, ఇటుకబట్టీలు, గ్రానైట్ల వంటి వాటిలో చిన్నారులు పనులు చేస్తున్నారు. తమిళనాడు వంటి రాష్ట్రాల్లో బాణసంచా తయారీ పరిశ్రమల్లోనూ బాల కార్మికులు పనులు చేస్తూ ప్రమాదాలకు గురవుతున్నారు. బాలికలు విపత్కర పరిస్థితులను ఎదుర్కొంటున్నారు. యాజమాన్యాల వేధింపులతో పాటు పలువురిపై లైంగికదాడులు జరుగుతున్నాయి. ఉభయ తెలుగు రాష్ట్రాల్లో ఆరు లక్షల మందికి పైగా బాలకార్మికులున్నారు. వీరిలో 90శాతం బలహీనవర్గాలకు చెందినవారు. తెలంగాణలో ప్రాథమిక స్థాయిలో 2.9శాతం, ప్రాథమికోన్నత స్థాయిలో 1.9శాతం, సెకండరీ విద్యలో 17.1శాతం విద్యార్థులు మధ్యలో చదువు మానేస్తున్నారు. ఆంధ్రప్రదేశ్‌లో ప్రాథమిక స్థాయిలో 9.68శాతం, మాధ్యమిక స్థాయిలో 22.9శాతం చదువు మానేస్తున్నారు. హైదరాబాద్‌లో బాలకార్మికులతో అత్యంత ప్రమాదకరమైన గాజుల పరిశ్రమల్లో పనులు చేయిస్తున్నారు. ఏటా తెలుగు రాష్ట్రాలకు వచ్చే వలస కార్మికుల సంఖ్య 14 లక్షలకు పైమాటే.