తెలంగాణ

telangana

ETV Bharat / opinion

సాంకేతిక పరిజ్ఞానంతో మారుతున్న 'యుద్ధతంత్రం'

ఒకప్పుడు దేశాల మధ్య సంప్రదాయ యుద్ధాలు జరిగాయి. ఇప్పుడు సాంకేతిక పరిజ్ఞానం రాకతో అనేక మార్పులు వచ్చాయి. ప్రపంచ కూటముల ప్రాధాన్యం పెరిగింది. భూతల, వాయు, జల యుద్ధాలతోపాటు సైబర్‌, వాణిజ్య, అణు, జీవ రసాయన ఆయుధాలు కీలకంగా మారాయి. వీటితో పాటు దౌత్య సంబంధాలూ కీలక పాత్ర పోషిస్తున్నాయి. అందుకే భారత్​కు రెండు ప్రధాన శత్రు దేశాలైన పాక్​, చైనాలతో పోరాడేందుకు ఈ​ అధునాతన ఆయుధాలకు సర్కార్​ మరింత ప్రాధాన్యం ఇవ్వాల్సిందే.

Changing war strategy
మారుతున్న యుద్ధతంత్రం

By

Published : Oct 5, 2020, 7:24 AM IST

అంతర్జాతీయంగా భారతదేశానికి రెండు ప్రధాన శత్రుదేశాలు ఉన్నాయి. ఒకటి చైనా, రెండు పాకిస్థాన్‌. ఈ రెండు దేశాలతో భారతదేశానికి ఉన్న సమస్య మూలాలు, నేపథ్యాలు, వ్యూహాలు వేర్వేరు. స్వాతంత్య్రం వచ్చినప్పటి నుంచి ఇప్పటివరకు భారతదేశం, చైనాతో రెండు యుద్ధాలు, పాక్‌తో నాలుగు యుద్ధాలు చేసింది.

1962లో లద్దాఖ్‌ వద్ద చూఘాల్‌ సెక్టార్‌లో జరిగిన ఇండో-చైనా యుద్ధంలో భారత్‌ ఘోర పరాభవం పొందింది. దాంతో 'స్టేటస్‌ కో ఆంటే బెల్లమ్‌' పాటించాల్సి వచ్చింది. దీనర్థం లాటిన్‌ భాషలో ఇరుదేశాలు యుద్ధానికి ముందున్న స్థితిని అంగీకరించడం.

1967 సెప్టెంబర్‌, అక్టోబర్‌ నెలల్లో నాధులా, ఛోలా పాస్‌లు (సిక్కిం) వద్ద జరిగిన యుద్ధంలో చైనాకు భారత్‌ గట్టిగా బుద్ధిచెప్పింది. ఫలితంగా నాధులాలో కాల్పులను విరమించిన చైనా, ఛోలా నుంచి బలగాలను వెనక్కు పిలిపించింది. అప్పటినుంచి చైనా తన తీరును మార్చుకోలేదు. దురాక్రమణలకు ప్రయత్నిస్తూనే ఉంది.

ఇటీవల లదాఖ్‌లో గాల్వన్‌ లోయ ఉత్తర దక్షిణ ప్రాంతాలు, చుఘాల్‌ మోల్డో, పాంగాంగ్‌ సరస్సు ప్రాంతాల్లో చైనాకు దీటుగా భారత్‌ ప్రతిస్పందించింది. చాలా సందర్భాల్లో ముందుగా స్పందించి చైనా ఎత్తుగడలను పసిగట్టి ఎత్తయిన ప్రాంతాలను భారత్‌ ఆక్రమించగలిగింది. దీనితో వ్యూహపరంగా భారత్‌కు ప్రయోజనం కలిగింది.

పెరిగిన సాంకేతికత

ఒకప్పుడు సంప్రదాయ యుద్ధాలు జరిగాయి. ఇప్పుడు అనేక మార్పులు వచ్చాయి. సాంకేతిక పరిజ్ఞానం పాత్ర పెరిగింది. ప్రపంచ కూటముల ప్రాధాన్యం పెరిగింది. భూతల, వాయు, జల యుద్ధాలతోపాటు సైబర్‌, వాణిజ్య, అణు, జీవ రసాయన ఆయుధాలు కీలకంగా మారాయి. వీటితో పాటు దౌత్య సంబంధాలూ కీలక పాత్ర పోషిస్తున్నాయి.

సామ్రాజ్యవాదం, విస్తరణవాదంతో పేట్రేగిపోతున్న దేశాలకు మిత్రదేశాలు దౌత్య, వాణిజ్య యుద్ధాలతో బుద్ధి చెబుతున్నాయి. యుద్ధం చేయకుండానే శత్రువును ఓడించడం, వారి మానసిక సామర్థ్యాలను దెబ్బతీయడం వంటి యుద్ధతంత్రాలు కీలక పాత్ర పోషిస్తున్నాయి.

హిందూ మహాసముద్రంలో భారత్‌, ఆస్ట్రేలియాతో కలిసి ఓ భారీ మిలిటరీ ఆపరేషన్‌ ప్రారంభించింది. ఇందులో తామూ పాల్గొంటామని జపాన్‌ కొత్త ప్రధానమంత్రి యొషిహిదే సుగా పేర్కొన్నారు. దాంతో హిందూ మహాసముద్రంలో భారత్‌ తన ఆధిపత్యం చూపినట్లయింది.

లద్ధాఖ్‌లో జరిగిన భారీ సైనిక కార్యక్రమంలో భీష్మ ఆర్మర్డ్‌ ట్యాంకులు, టీ-72, టీ-60 ట్యాంకులు వినియోగించి మైనస్‌ 40 డిగ్రీల శీతల ఉష్ణోగ్రత వద్ద మనం ఎలా పోరాడగలమో చైనాకు నిరూపిస్తున్నాం. వారి మానసిక బలాలపై ప్రభావం చూపిస్తున్నాం.

ప్రస్తుతం పరిస్థితులు ఏ క్షణంలోనైనా యుద్ధానికి దారితీయవచ్చు. యుద్ధతంత్రాల్లో మార్పుల దృష్ట్యా ఎవరు నెగ్గుతారనే అంశంకన్నా, యుద్ధం తరవాత ఎవరు త్వరగా కోలుకుంటారనేది అత్యంత కీలకం. హిరోషిమా, నాగసాకిలపై అణుబాంబు ప్రయోగించిన తరవాత జపాన్‌ చాలా త్వరగా కోలుకొని అభివృద్ధి చెందడం ప్రస్తుత దేశాలకు ఆదర్శప్రాయం కావాలి. ఒక విషయం సుస్పష్టం. ప్రస్తుత పరిస్థితుల్లో భారత్‌కు ప్రపంచ దేశాల మద్దతు లభిస్తోంది. ముఖ్యంగా చైనా వ్యతిరేక దేశాలు ఒక తాటిపైకి వస్తున్నాయి. అధునాతన యుద్ధసామగ్రిని, సాంకేతిక పరిజ్ఞానాన్ని భారత్‌కు అందజేస్తున్నాయి. ఈ విషయాన్ని అంచనా వేయడంలో జింగ్‌పింగ్‌ ప్రభుత్వం ఘోరంగా విఫలమైంది.

అనేక దేశాలు ఇప్పుడు భారత్‌ను చైనాకు ప్రత్యామ్నాయ శక్తిగా, ఆర్థిక వనరుగా, మానవ వనరులను అందించే దేశంగా చూస్తున్నాయి. అంతేకాదు, భారత్‌ శాంతికాముక దేశం. ఏ దేశంపైనా ముందస్తు దాడి చేసిన చరిత్ర లేదు.

పటిష్ఠ వ్యూహరచన

నమ్మించి మోసం చేయడం చైనా యుద్ధనీతిలో ప్రధాన అంశం. గతంలో జరిగిన చైనా యుద్ధాల్లో దీన్ని చవిచూశాం. పంచశీల ఒప్పందం నుంచి భారత-చైనా విదేశాంగ మంత్రుల పంచసూత్రాల ఒప్పందం వరకు భారత్‌ను చైనా వంచనకు గురి చేస్తూనే ఉంది. ఉల్లంఘనలకు పాల్పడుతోంది.

గతంలో భారత్‌ ఎదుర్కొన్న చైనా, పాకిస్థాన్‌ యుద్ధాలు శీతకాలంలోనే ఎక్కువ జరిగాయి. అందుకే రానున్న ఈ శీతకాలం భారత్‌కు చాలా కీలకం. దౌత్యపరంగా భారత్‌ తన విజయ పరంపరను కొనసాగిస్తూ వివిధ దేశాల మద్దతు కూడగట్టుకోవాలి. అధునాతన ఆయుధాలు సమకూర్చుకోవాలి. చైనాతో ఉన్న సుదీర్ఘ భూసరిహద్దు వివాదాన్ని పరిష్కరించడం కోసం దీర్ఘకాల ప్రణాళిక సిద్ధం చేసుకోవాలి. ఐక్యరాజ్య సమితిలో భారత్‌ బలపడాలి. శాశ్వత సభ్యత్వ దిశగా ప్రయత్నించాలి.

చైనా దిగుమతులపై ఎక్కువ ఆధారపడకుండా స్వదేశీ ఉత్పత్తుల్లో పురోభివృద్ధి సాధించాలి. ఒక్క సంప్రదాయ యుద్ధంలోనే కాకుండా- అణు, జీవ రసాయన ఆయుధాలలో, సమాచార యుద్ధతంత్రం, వాణిజ్య యుద్ధం, సైబర్‌ సమరం, దౌత్యవ్యూహాలు, మానసిక పోరాటాల్లో పైచేయి సాధించాలి. ఆత్మరక్షణ స్థాయి నుంచి దీటుగా స్పందించగల స్థాయికి ఎదగాలి. దేశ సమగ్రతకు, సార్వభౌమత్వానికి భంగం వాటిల్లితే దోషులకు గట్టిగా బుద్ధిచెప్పాలి. ఆసియా దేశాలకు, ప్రపంచ దేశాలకు భారత్‌ వ్యూహం ఒక ఆదర్శం కావాలి!

- మేజర్‌ శ్రీనివాస్‌

ఇదీ చూడండి: ఎవరికో కొమ్ము కాస్తూ.. సంస్కారానికి నిప్పు పెట్టేశారే!

ABOUT THE AUTHOR

...view details