తెలంగాణ

telangana

ETV Bharat / opinion

థియేటర్ల కొరత- సమస్యకు తెర పడేదెప్పుడు? - theatres in india

2020లో కరోనా దెబ్బకు తొమ్మిది నెలలు పాటు తీవ్రంగా నష్టపోయారు దేశంలోని థియేటర్ల యజమానులు. లాక్‌డౌన్‌కు ముందు వరకు దేశంలో ఒకే తెర (సింగిల్‌ స్క్రీన్‌) థియేటర్లు 6,327 ఉండగా, కరోనా దెబ్బకు వీటిలో 1,500 వరకు మూత పడ్డాయని అంచనా. థియేటర్లపై పన్నుల భారం ఎక్కువగా ఉందని.. నిర్మాతలు, పంపిణీదారులు థియేటర్‌ యజమానుల మధ్య లాభాల పంపిణీ విధానం సహేతుకంగా లేదని ఇటీవల చాలామంది వాదిస్తున్నారు. కొవిడ్‌ నిబంధనల నేపథ్యంలో నిర్వహణ భారం ఎక్కువ అవుతోందని యజమానులు చెబుతున్నారు.

theatres  shutdown in india due to lack of profit and high taxes
మూతపడుతున్న థియేటర్లు -సమస్యకు తెర పడేదెప్పుడు?

By

Published : Feb 21, 2021, 6:48 AM IST

సినిమా థియేటర్లు ఎందుకు మూతపడుతున్నాయి? కొత్త సినిమాలు నాలుగైదు ఒకేసారి విడుదలైతే... థియేటర్లు సరిపోవడం లేదనే అసంతృప్త గళాలు ఎందుకు వినిపిస్తున్నాయి? ఏడాది ముందుగానే నిర్మాతలు ఎందుకు తమ సినిమాల విడుదల తేదీలను ప్రకటిస్తున్నారు? విడుదల తేదీల నిర్ణయాల విషయంలో నిర్మాతల మధ్య గొడవలేమిటి? ‘మా సినిమా తేదీని ముందుగా ప్రకటించాం. మీరు వాయిదా వేసుకోండి..అని కొందరు నిర్మాతలు బహిరంగ చర్చను లేవదీస్తున్నారెందుకు? అసలు సమస్య ఏమిటి?

వసూళ్లు ఎలా?

ప్రస్తుత పరిస్థితుల్లో పెద్ద బడ్జెట్‌ సినిమాలకు ప్రారంభ వసూళ్లు చాలా ముఖ్యం. మొదటి రెండు మూడురోజుల్లోనే బాక్సాఫీసు వద్ద గరిష్ఠ వసూళ్లు జరగాలి. ఆ తరవాత పైరసీల బెడద, సినిమా సమీక్షలు బయటికి రావడం వంటి కారణాలతో కలెక్షన్లు తగ్గిపోయే అవకాశాలు ఎక్కువ. అనుకున్న స్థాయిలో వసూళ్లు జరగాలంటే ఎక్కువ థియేటర్లలో సినిమా విడుదల చేయాలి. అందుకోసం సినిమా హాళ్లు అందుబాటులో ఉండాలి. ఒకేసారి రెండు మూడు పెద్ద బడ్జెట్‌, బడా నటుల చిత్రాలు విడుదలైతే ఆ మేరకు థియేటర్లను పంచుకోవాల్సి వస్తుంది. అప్పుడు సాధారణంగానే వసూళ్లు తగ్గిపోతాయి. దీంతో నష్టాలు తప్పవనేది నిర్మాతల భావన. ఇలాంటి సమయంలో థియేటర్ల కొరత సమస్య ప్రధానాంశమవుతోంది. ‘విడుదలలు ఉంటే పండగ, లేదంటే ఎండగ’- ఇదీ సినిమా థియేటర్ల పరిస్థితి. 2020లో కరోనా దెబ్బకు తొమ్మిది నెలలు మూత పడటంతో తీవ్రంగా నష్టపోయారు వాటి యజమానులు. కొందరు ఇప్పటికే థియేటర్లను వేరే అవసరాలకు అనుగుణంగా మార్చుకొన్నారు.

లాక్‌డౌన్‌కు ముందు వరకు దేశంలో ఒకే తెర (సింగిల్‌ స్క్రీన్‌) థియేటర్లు 6,327 ఉండగా, మల్టీప్లెక్సులు 3,200దాకా ఉన్నాయి. కరోనా దెబ్బకు వీటిలో 1,500 వరకు మూత పడ్డాయని అంచనా. అంటే మిగిలింది 8,000 థియేటర్లే. భారత్‌లో ఏటా అన్ని భాషల్లోనూ 1,300-1,500 వరకు చిత్రాలు విడుదలవుతాయి. ఉన్న థియేటర్లు వీటన్నింటికీ సరిపోవు. అందుకే చిన్న సినిమాల నిర్మాతలు తమకు థియేటర్లు దొరకడం లేదని అప్పుడప్పుడూ మీడియా ముందుకొస్తుంటారు. ప్రస్తుతం థియేటర్ల సంఖ్య మరింత తగ్గడం, విడుదల తేదీలు దగ్గరగా ఉండటంతో ఈ సమస్య పెద్ద నిర్మాతలకు సైతం ఎదురవుతోంది. ఈ సమస్య పరిష్కారానికి థియేటర్ల సంఖ్య పెరగడం ఒక్కటే మార్గం. చైనాలో 60,000, అమెరికాలో 42,000 తెరలున్నాయి. మన దేశంలో అటూఇటుగా 8,000 ఉన్నాయి. ఇక్కడ ప్రతి పది లక్షల మందికి తొమ్మిది తెరలు అందుబాటులో ఉంటే, చైనాలో 60, అమెరికాలో 125 చొప్పున ఉన్నాయి. థియేటర్లపై పన్నుల భారం ఎక్కువగా ఉందని; నిర్మాతలు, పంపిణీదారులు థియేటర్‌ యజమానుల మధ్య లాభాల పంపిణీ విధానం సహేతుకంగా లేదని ఇటీవల చాలామంది వాదిస్తున్నారు. కొవిడ్‌ నిబంధనల నేపథ్యంలో నిర్వహణ భారం ఎక్కువ అవుతోందని యజమానులు చెబుతున్నారు. ఇప్పటికే ‘ఓవర్‌ ది టాప్‌ (ఓటీటీ)’ వేదికలు థియేటర్లకు పోటీగా పరిణమించాయి. సినిమా విడుదలైన 20 నుంచి 25 రోజుల్లోపే ఓటీటీలో అందుబాటులోకి వస్తుండటంతో థియేటర్లకు ప్రేక్షకులు మరింత దూరమవుతున్నారు. సినిమా విడుదలైన 35 రోజుల తరవాతే ఓటీటీకి అనుమతి ఇవ్వాలని, లేకుంటే థియేటర్లలో ప్రదర్శనలకు ఒప్పుకోబోమని వీటి యజమానులు చెబుతున్నారు. ఇలా అనేక సమస్యలు, సందేహాలు నివృత్తి కాకుండా మిగిలిపోతుండటంతో అనేక మంది థియేటర్లను మూసివేస్తున్నారు. దీనికి పరిష్కారంగా మొబైల్‌ థియేటర్లు ఏర్పాటు చేసుకోవడమే మేలంటున్నాయి స్టార్టప్‌ కంపెనీలు. డీటీఎస్‌ సౌండ్‌, నాణ్యమైన తెరలు, ఏసీ సదుపాయం తదితర సేవలతో ఈ మొబైల్‌ థియేటర్లు ఉంటాయని చెబుతున్నారు. ఇప్పటికే ఉత్తరాదిలో నడుస్తున్న ఈ విధానం దక్షిణాదిలోనూ త్వరలోనే పరిచయం కానుంది. అమెరికా, ఐరోపా దేశాల్లో తెరల సంఖ్య అధికంగా ఉండటానికి కారణం మల్టీప్లెక్సులే. వాటిలో కొనుగోళ్లతోపాటు, ఆన్‌లైన్‌ ఆటలు, ఆహారం... ఇలా ఎన్నో వసతులూ అందుబాటులో ఉంటాయి. ఇక్కడ అలాంటి పరిస్థితులు తక్కువ. అక్కడ ఒక థియేటర్‌లో ఒకే సినిమా రోజంతా ఆడదు. వేర్వేరు చిత్రాలు ప్రదర్శితమవుతాయి. ఇలాంటి కొన్ని వ్యూహాలతో మన దేశంలోనూ థియేటర్లను లాభసాటిగా నడపవచ్చనేది కొందరి భావన.

తెలుగు రాష్ట్రాల్లో పరిస్థితి

ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణ రాష్ట్రాల్లో 1,600కు పైగా థియేటర్లు ఉన్నాయి. ప్రస్తుతం వీటిలోనూ ఇంకా కొన్ని తెరుచుకోలేదు. ఇప్పుడు మరో సమస్య వచ్చింది. తెలుగు రాష్ట్రాల్లో ఒకే తెర ఉన్న థియేటర్‌ యజమానులు- మల్టీప్లెక్సులకు ఇస్తున్నట్లు తమకూ కలెక్షన్లలో భాగం ఇవ్వాలని నిర్మాతలను కోరుతున్నారు. లేదంటే థియేటర్లను మార్చి నుంచి మూసివేస్తామని హెచ్చరిస్తున్నారు. నిర్మాతలు, మల్టీప్లెక్స్‌ల యాజమాన్యాల మధ్య మొదటి వారం 55:45, రెండో వారం 45:55, మూడో వారం 40:60, నాలుగో వారం 35:65... ఇలా ఆదాయ పంపిణీ జరిగేది. ఇటీవల కరోనాతో వడ్డీల భారం అధికమైందని నిర్మాతలు తమ వాటా పెరగాలని డిమాండ్‌ చేశారు. ఇది కొలిక్కి రాక ముందే ఒకే తెర థియేటర్‌ యజమానులు తమ వాటానూ పెంచాలని పట్టుపడుతున్నారు. ఇన్ని సంక్లిష్టతల తరుణంలో త్వరలో జరుగనున్న చర్చల్లో ఏం తేలుతుందో వేచిచూడాల్సిందే!

- వీరా కోగటం

ABOUT THE AUTHOR

...view details