ఏటా ప్రకృతి విపత్తులు(Natural Disasters) పెద్ద సంఖ్యలో ప్రజల ప్రాణాల్ని హరిస్తున్నా వాటిని ఎదుర్కొనే విషయంలో ప్రభుత్వాలు, అధికార యంత్రాంగాల తీరుమాత్రం మారడం లేదు. విపత్తులకు సంబంధించి సరైన రీతిలో సంసిద్ధత ఉండటంలేదు. ముందస్తు హెచ్చరికలు జారీ చేసే వ్యవస్థల అభివృద్ధి జరగలేదు. విపత్తు వేళ సమర్థంగా స్పందించి సహాయ చర్యలు, పునరావాసం, మౌలిక సదుపాయాల పునరుద్ధరణ వంటి అంశాల్లో గత అనుభవాల నుంచి పాఠాలు నేర్చుకొనే ప్రక్రియపై సరిగ్గా దృష్టిసారించడంలేదు.
పట్టణాలు, నగరాలను భారీ వర్షాలతో ముంచెత్తుతున్న వరదలను ఎదుర్కొనేందుకు, వరద నీటిని దారిమళ్లించేందుకు చేపట్టాల్సిన నిర్మాణాలు(Disaster Management) నత్తనడకన సాగుతుండటం యంత్రాంగం ఉదాసీనతకు నిదర్శనంగా నిలుస్తోంది. ఇలాంటి వ్యవహార శైలికి తోడు సమస్య ఒకచోట ఉంటే పరిష్కారం ఇంకోచోట చూపుతూ, అవసరం తక్కువుండే చోట అధిక మోతాదుల్లో నిధులు గుమ్మరించే ప్రభుత్వాల తీరు కూడా సమస్యకు సరైన పరిష్కారం దక్కనీయడం లేదు.
తీవ్రస్థాయిలో కుండపోతగా వర్షాలు కురవడం, ఆకస్మిక వరదలు ముంచెత్తడం(Floods in India), కొండచరియలు విరిగిపడటం(Landslides) వంటి ఘటనలు ప్రజల ప్రాణాల్ని బలిగొనడం సర్వసాధారణంగా మారింది. గత మూడేళ్లలో దేశంలో సుమారు 6,800 మంది ఈ తరహా ప్రకృతి విపత్తుల కారణంగా ప్రాణాలు విడిచినట్లు ఇటీవల కేంద్ర హోంశాఖ లోక్‌సభకు వెల్లడించింది. 2018-19లో 2,400, 2019-20లో 2,422 2020-21లో 1,986 మరణాలు నమోదయ్యాయి. అత్యధిక మరణాల్లో పశ్చిమ్‌బంగ అగ్రస్థానంలో నిలిచింది. ఆ రాష్ట్రంలో మూడేళ్లలో 964 మరణాలు చోటు చేసుకొన్నాయి. ఆ తరవాత మధ్యప్రదేశ్‌లో 833, కేరళలో 708 మరణాలు నమోదయ్యాయి. ఈ రెండు రాష్ట్రాల్లో వరదల కారణంగా ప్రాణనష్టం పెరిగింది. పశ్చిమ్‌బంగలో వరసగా మూడేళ్లుగా ప్రకృతి విపత్తుల కారణంగా అధిక మరణాలు చోటుచేసుకున్నాయి.
బంగాల్లో తీవ్ర నష్టం..
కొండచరియలు విరిగిపడటం, తుపానులు, వరదలు వంటివి శాపంగా పరిణమిస్తున్నాయి. ప్రకృతి విపత్తుల కారణంగా నష్టతీవ్రత పశ్చిమ్‌బంగలో అధికంగా ఉండగా, నిధుల కేటాయింపులో పరిస్థితి మరోలా ఉంది. రాష్ట్ర విపత్తు ప్రతిస్పందన నిధుల కింద- మహారాష్ట్రకు రూ.1,288 కోట్లు, ఉత్తర్‌ప్రదేశ్‌కు రూ.773.20 కోట్లు, మధ్యప్రదేశ్‌కు రూ.728 కోట్లు కేంద్రం కేటాయించింది. పశ్చిమ్‌బంగకు కేటాయించిన నిధులు రూ.404.40 కోట్లు మాత్రమే కావడం గమనార్హం. దీన్నిబట్టి చూస్తే, అత్యధికంగా మరణాలు నమోదవుతూ, గత అయిదేళ్లలో నాలుగు తుపాన్లు ఎదుర్కొన్న పశ్చిమ్ బంగకు నిధులు మాత్రం తక్కువగా అందినట్లు స్పష్టమవుతోంది.