తెలంగాణ

telangana

ETV Bharat / opinion

US Afghanistan: అఫ్గానిస్థాన్​లో ముగిసిన అగ్రరాజ్య అధ్యాయం

జంట భవనాలపై దాడి దరిమిలా ప్రతీకారేచ్ఛతో రగిలిపోతూ అఫ్గాన్‌ గడ్డపై అడుగుపెట్టిన అమెరికా(US Afghanistan)- రెండు దశాబ్దాల్లో కోటీ అరవైఎనిమిది లక్షల కోట్ల రూపాయలను అక్కడ ధారపోసింది. దాదాపు రెండున్నర లక్షల మంది ప్రాణాలను, అంతకు ఎన్నో రెట్ల మంది అవయవాలను కోల్పోయి జీవచ్ఛవాలయ్యాక- అఫ్గాన్‌ను తిరిగి తాలిబన్లకు(Afghanistan Taliban) సమర్పించి వెనుదిరిగింది. ఆఖరి ఘట్టంలో అసమర్థతతో అమెరికాను అవమానాల పాల్జేశారంటూ జో బైడెన్‌పై(Joe Biden) మాజీ అధ్యక్షులు డొనాల్డ్‌ ట్రంప్‌(Donald Ttump) దుమ్మెత్తిపోస్తున్నారు.

withdrawal of US troops from Afghanistan
అఫ్గానిస్థాన్​

By

Published : Sep 2, 2021, 4:56 AM IST

Updated : Sep 2, 2021, 9:48 AM IST

రణరక్త ప్రవాహ సిక్తమైన అగ్రరాజ్య చరిత్రలో మరో అధ్యాయం ముగిసింది. రేపు అన్నది ఎలా ఉంటుందో ఊహించనలవి కాని అనిశ్చితిలో అఫ్గానిస్థాన్‌(Afghanistan latest news) మిగిలిపోయింది. జంట భవనాలపై దాడి దరిమిలా ప్రతీకారేచ్ఛతో రగిలిపోతూ అఫ్గాన్‌ గడ్డపై అడుగుపెట్టిన అమెరికా(US Afghanistan)- రెండు దశాబ్దాల్లో కోటీ అరవైఎనిమిది లక్షల కోట్ల రూపాయలను అక్కడ ధారపోసింది. దాదాపు రెండున్నర లక్షల మంది ప్రాణాలను, అంతకు ఎన్నో రెట్ల మంది అవయవాలను కోల్పోయి జీవచ్ఛవాలయ్యాక- అఫ్గాన్‌ను తిరిగి తాలిబన్లకు (Afghanistan Taliban) సమర్పించి వెనుదిరిగింది.

అధ్యక్షుని పాత్రపై విమర్శలు..

ఆఖరి ఘట్టంలో అసమర్థతతో అమెరికాను అవమానాల పాల్జేశారంటూ జో బైడెన్‌పై(Joe Biden) మాజీ అధ్యక్షులు డొనాల్డ్‌ ట్రంప్‌(Donald Trump) దుమ్మెత్తిపోస్తున్నారు. సరైన సమయంలో సముచిత నిర్ణయాలే తీసుకొన్నామంటూ తమ వైఖరిని బైడెన్‌ సమర్థించుకొంటున్నారు. ఉగ్రవాదాన్ని తుదముట్టించడానికి అంటూ సుదూర దేశంలో సమర శంఖం పూరించిన అగ్రరాజ్యం చివరికి సాధించిందేమిటి? ప్రజాభద్రతకు పరమ ప్రమాదకర దేశంగా అఫ్గానిస్థాన్‌ను(Afghanistan news) నిరుడు ఐరాస మానవ హక్కుల వేదిక అభివర్ణించింది! అదే సమయంలో విదేశాల దన్నుతో ఆర్థికంగా మాత్రం ఆ దేశం సత్ఫలితాలే సాధించింది. ఇరవై ఏళ్లలో జీడీపీలో అయిదు రెట్లకు పైగా వృద్ధిని నమోదు చేసింది. అతివల్లో అక్షరాస్యత అయిదు శాతం నుంచి ముప్ఫై శాతానికి చేరింది. ఇప్పుడు సంక్షుభిత వాతావరణంలో పారిశ్రామిక ప్రగతి పడకేయడంతో కుటుంబ ఆదాయాలు తెగ్గోసుకుపోయాయి. కరవుతో వ్యవసాయమూ అతలాకుతలమై ఆర్థిక సంక్షోభం పెచ్చరిల్లుతోంది. రూ.65 వేల కోట్ల మేరకు అఫ్గాన్‌ సెంట్రల్‌ బ్యాంకు సొత్తును అమెరికా బిగపట్టడంతో- తాలిబన్లకు పాలన కత్తిమీదసాము కాబోతోంది. పౌరహక్కులకు భంగం వాటిల్లబోనివ్వమన్న వాగ్దానాలను వారు నిలబెట్టుకొంటేనే- అఫ్గానిస్థాన్‌కు ఆపన్నహస్తం అందించడానికి అంతర్జాతీయ సమాజం ముందుకొచ్చే అవకాశముంది!

అమెరికా బలగాలు

తూటా చప్పుళ్లతో భయానక వాతావరణం..

సామ్రాజ్యవాద, ఛాందసవాద శక్తుల సంకుల సమరంలో అఫ్గాన్‌ సమాజం కొన్ని తరాలుగా తల్లడిల్లుతోంది. వృత్తినిపుణులు, సామాజిక కార్యకర్తలు, సామాన్యులపై కొన్నాళ్లుగా పేలుతున్న తాలిబన్‌ తూటాలతో దేశమంతా భీతావహ వాతావరణం నెలకొంది. అవకాశం చిక్కిన వారు పుట్టినగడ్డతో పేగుబంధం తెంచుకొని పరదేశాలకు తరలిపోయారు. యుద్ధభూమిలో చేదోడువాదోడైన తమను తాలిబన్ల దయకు వదిలేసి అమెరికా మరలిపోయిందంటూ వేలాది అఫ్గానీలు ఇంకా కన్నీటిపర్యంతమవుతున్నారు. అమెరికన్‌ దళాల(Afghanistan US Troops) నిష్క్రమణను స్వాగతించిన అల్‌ఖైదా- కశ్మీర్‌తో సహా యెమెన్‌, సోమాలియా తదితరాలకూ 'స్వేచ్ఛ' సాధించాల్సి ఉందని తాజాగా నోరు పారేసుకుంది.

భయాందోళనలో ప్రపంచ దేశాలు- నిక్షేపాలపై చైనా కన్ను..

కరడుగట్టిన ఈ ముష్కరమూకతో పాటు ఐసిస్‌ ముఠాలకూ(ISIS Afghanistan) అఫ్గానిస్థాన్‌ స్వర్గధామం కానుందన్న కథనాలతో ప్రపంచ దేశాలు భయాందోళనలకు గురవుతున్నాయి. అఫ్గాన్‌ సార్వభౌమత్వాన్ని గుర్తిస్తున్నట్లు ప్రకటించిన ఐరాస భద్రతామండలి- ఉగ్రవాదులకు ఆశ్రయమివ్వరాదని తాలిబన్లను హెచ్చరించింది. తన గడ్డ మీది ఉగ్రతండాలను తాలిబన్ల అండలోకి తరలించాలని పాక్‌ తలపోస్తోంది. అఫ్గాన్‌ సహజ వనరులను గుప్పిట పట్టడానికి చైనా కుయుక్తులు పన్నుతోంది. దోహా వేదికగా తొలిసారి తాలిబన్‌ వర్గాలతో అధికారిక చర్చలు జరిపిన ఇండియా- అఫ్గాన్‌లోని తన పౌరుల రక్షణ గురించి ప్రస్తావించింది. బాధ్యతాయుత పాలకులుగా తాలిబన్లు తమను తాము నిరూపించుకొంటే- వారితో దౌత్య సంబంధాలు నెలకొల్పుకోవచ్చని మాజీ విదేశాంగ మంత్రి నట్వర్‌ సింగ్‌ సూచిస్తున్నారు. అఫ్గాన్‌ పరిణామాలను ఇటీవల అఖిల పక్షానికి వివరించిన అమాత్యులు జైశంకర్‌- వేచి చూసే ధోరణే ప్రస్తుత విధానంగా స్పష్టంచేశారు. అంతర్గత భద్రతతో పాటు అంతర్జాతీయ ప్రయోజనాల పరిరక్షణే పరమావధిగా అఫ్గాన్‌పై ఇండియా ఆచితూచి ముందడుగేయాలి. మిత్రదేశాలు, భాగస్వామ్య పక్షాలతో సంప్రదింపులను కొనసాగిస్తూ వ్యూహాత్మకంగా వ్యవహరించాలి. ఆ మేరకు పటిష్ఠ విదేశాంగ విధానం పదునుతేలాల్సిన పరీక్షా ఘట్టమిది!

ఇదీ చూడండి:US Military: అఫ్గాన్​ 'అస్త్రాలను' పేల్చేసిన అగ్రరాజ్యం

Last Updated : Sep 2, 2021, 9:48 AM IST

ABOUT THE AUTHOR

...view details