వందేళ్లకు పైగా చరిత్ర కలిగిన పార్టీ అది. అనేకానేక రాజకీయ యుద్ధాల్లో ఆరితేరిన నాయకులెందరో ఆ పార్టీలోనే ఉన్నారు. అయినా ఇప్పుడు దేశం మొత్తమ్మీద కాంగ్రెస్ పార్టీ సొంతంగా అధికారంలో ఉన్నది కేవలం రెండు రాష్ట్రాల్లోనే. వాటిలో ఒకటి ఛత్తీస్‌గఢ్, మరొకటి పంజాబ్. ఇవి కాక ఝార్ఖండ్, మహారాష్ట్ర, రాజస్థాన్, తమిళనాడులలో మిత్రపక్షాలతో కలిసి అధికారం పంచుకుంటోంది. వీటిలోనూ రాజస్థాన్‌లోనే రాష్ట్రీయ లోక్‌దళ్ మద్దతుతో కాంగ్రెస్ ముఖ్యమంత్రి ఉన్నారు. మహారాష్ట్రలో భాజపాను గద్దె దించేందుకే శివసేన, నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీలకు మద్దతుగా నిలిచి, వాటితో కలిసి అధికారం పంచుకుంది. ఝార్ఖండ్‌లో అక్కడి ప్రాంతీయ పార్టీ అయిన ఝార్ఖండ్ ముక్తిమోర్చా ప్రభుత్వానికి మద్దతుగా నిలబడింది. వచ్చే సంవత్సరం శాసనసభ ఎన్నికలు జరిగే రాష్ట్రాల్లో పంజాబ్ ఒకటి. మిగిలిన ఆరూ భాజపా పాలిత రాష్ట్రాలే. ఈ ఎన్నికల్లో పంజాబ్‌లో అధికారం నిలబెట్టుకోవడం కాంగ్రెస్‌పార్టీ ముందున్న అతిపెద్ద సవాలు. ఎన్నికలు ముంగిట్లోకి వస్తున్న తరుణంలో ఇన్నాళ్లూ ముఖ్యమంత్రి కెప్టెన్ అమరీందర్‌సింగ్‌పై అంతర్లీనంగా ఉన్న అసమ్మతి ఒక్కసారిగా బట్టబయలయింది.
సీఎంపై విమర్శలు
ముఖ్యమంత్రికి, మాజీమంత్రి నవజ్యోత్‌సింగ్ సిద్ధూకు(Amarinder vs Sidhu) మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమంటోంది. సిద్ధూ బహిరంగంగానే ముఖ్యమంత్రిపై ఎడతెగని విమర్శల వర్షం కురిపిస్తున్నారు. ఆయన లక్ష్యం ముఖ్యమంత్రి పీఠమా, పార్టీ మీద పెత్తనమా, మరేదైనానా అన్న విషయం కచ్చితంగా తెలియకపోయినా- ప్రస్తుత తరుణంలో ఈ వ్యవహారం కాంగ్రెస్ పార్టీకి తలబొప్పి కట్టించేలాగే కనిపిస్తోంది. విద్యుత్ కొనుగోలు ఒప్పందాల (పీపీఏ) విషయంలో ప్రభుత్వ చేతగానితనం వల్లే రాష్ట్ర ప్రజల మీద వేలకోట్ల రూపాయల భారం పడటం సహా కోతలు అధికమయ్యాయని ఆయన మండిపడుతున్నారు. మొదట భాజపాలో చేరిన సిద్ధూ- ఆ తరవాత ఆ పార్టీకి రాజీనామా చేసి కాంగ్రెస్‌లోకి వెళ్ళారు. రాష్ట్రంలో పార్టీ అధికారంలోకి వచ్చిన తరవాత మంత్రిపదవిలో ఉండి, కొన్నాళ్లకు ముఖ్యమంత్రితో విభేదాలతో రాజీనామా చేశారు. తొలుత క్రికెటర్‌గా రాణించిన సిద్ధూ- ఆ తరవాత క్రీడా వ్యాఖ్యాతగా మారి, అనంతరం రాజకీయాల్లోకి ప్రవేశించారు.
తనతో తీవ్రంగా విభేదించి, రచ్చకెక్కిన సిద్ధూను ఉప ముఖ్యమంత్రిగా గానీ, పీసీసీ అధ్యక్షుడిగా గానీ అంగీకరించే ప్రసక్తే లేదని త్రిసభ్య కమిటీ ముందు ముఖ్యమంత్రి కెప్టెన్ అమరీందర్‌సింగ్ కుండ బద్దలుకొట్టారు. ఆయనకు చెక్ పెట్టడానికి అధిష్ఠానం పెద్దలను కలిసి తన విషయం చెప్పుకోవడానికి సిద్ధూ దిల్లీ వెళ్లారు. ముందుగా ప్రియాంకను, తరవాత రాహుల్‌ను కలిశారు. తొలుత అసలు సిద్ధూతో సమావేశమే లేదన్న రాహుల్- ఆ తరవాత కలిశారంటేనే దిల్లీలో సిద్ధూకు ఉన్న పట్టేమిటో తెలుస్తుంది. మరోవైపు ముఖ్యమంత్రి అమరీందర్‌సింగ్ సైతం దిల్లీ వెళ్ళినా- సోనియాగాంధీని కలిసి తిరిగొచ్చేశారు. సిద్ధూ కాంగ్రెస్‌లో చేరినప్పటి నుంచి రాహుల్, ప్రియాంకలతో సన్నిహితంగా ఉన్నారు. రాష్ట్రంలోని ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఇతర నాయకులనూ కలిసే రాహుల్- అమరీందర్‌ను కలవకపోవడానికి కారణం లేకపోలేదు. 2017లో అసెంబ్లీ ఎన్నికల ప్రచారానికి రాహుల్ వచ్చినప్పుడు తనను ముఖ్యమంత్రి అభ్యర్థిగా ప్రకటించాలని అమరీందర్ బలవంతపెట్టారని, దాంతో అలా చెప్పక తప్పలేదని అంటారు. తరవాత ఈ నాలుగున్నరేళ్లలో సామాన్య కార్యకర్తల నుంచి ఒక స్థాయి నాయకుల వరకూ ఎవరికీ కెప్టెన్ అందుబాటులో లేకుండా పోయారని, అందువల్ల ఈసారి ఆయనను ముందుపెట్టి 2022 అసెంబ్లీ ఎన్నికలకు వెళ్లే అవకాశమే లేదని పార్టీవర్గాలు అంటున్నాయి.