తెలంగాణ

telangana

ETV Bharat / opinion

ఈసీ అడ్డగోలు వాదనలు - సుప్రీంకోర్టు మొట్టికాయలు - మద్రాస్​ హైకోర్టు వర్సెస్​ ఎలక్షన్​ కమిషన్​

మద్రాసు హైకోర్టు కఠిన వ్యాఖ్యలపై అభ్యంతరం వ్యక్తం చేసింది ఎన్నికల సంఘం. న్యాయమూర్తుల మౌఖిక వ్యాఖ్యలను నిరోధించడానికి, న్యాయస్థానాల్లో జరిగే వాదోపవాదాల గురించి మాట్లాడకుండా మీడియాను కట్టడి చేయడానికి చేసిన ప్రయత్నంతో ఈసీ వాదన వీగిపోయింది. ఈ విచారణంలో ఎన్నికల సంఘం వేసిన పిటిషన్‌ను సుప్రీంకోర్టు తిరస్కరించింది. ఈ సందర్భంగా.. సుప్రీం ధర్మాసనం అభిప్రాయపడినట్లు.. ప్రజాస్వామ్యం మనగలగాలంటే వ్యవస్థలు బలంగా, ప్రభావశీలంగా ఉండాల్సిందే. ఇందులో రెండో అభిప్రాయానికి తావులేదు!

Election Commission of India, EC of India
ఎన్నికల సంఘం, ఎలక్షన్​ కమిషన్​

By

Published : May 11, 2021, 6:46 AM IST

మద్రాసు హైకోర్టు కఠిన వ్యాఖ్యలపై అభ్యంతరం వ్యక్తం చేయడానికి కేంద్ర ఎన్నికల సంఘానికి న్యాయమైన కారణాలే ఉండవచ్చు. కానీ, న్యాయమూర్తుల మౌఖిక వ్యాఖ్యలను నిరోధించడానికి, న్యాయస్థానాల్లో జరిగే వాదోపవాదాల గురించి మాట్లాడకుండా మీడియాను కట్టడి చేయడానికి చేసిన ప్రయత్నంతో ఈసీ వాదన వీగిపోయింది. విచారణలో భాగంగా హైకోర్టు చేసిన వ్యాఖ్యలను రికార్డుల నుంచి తొలగించాలని, వాటిపై మీడియాలో వార్తలు రాకుండా చూడాలంటూ ఎన్నికల సంఘం వేసిన పిటిషన్‌ను సుప్రీంకోర్టు తిరస్కరించింది. న్యాయస్థానాలు అందరికీ అందుబాటులో ఉండటం 'రాజ్యాంగబద్ధమైన స్వేచ్ఛకు మూలస్తంభం' అని ఈ సందర్భంగా జస్టిస్‌ డి.వై.చంద్రచూడ్‌ స్పష్టం చేశారు.

ఇదేం పద్ధతి?

కొవిడ్‌ మార్గదర్శకాలను పాటించకుండా ఎన్నికల ప్రచారం చేయడానికి రాజకీయ పార్టీలను ఎందుకు అనుమతించారని ఈసీ అధికారులను మద్రాసు హైకోర్టు ప్రశ్నించింది. ఎన్నికల సంఘాన్ని బాధ్యతారహిత వ్యవస్థగా అభివర్ణించిన న్యాయమూర్తులు, అధికారులపై హత్యాభియోగాలు నమోదు చేయవచ్చని వ్యాఖ్యానించారు. దీనితో నొచ్చుకున్న ఈసీ వెంటనే సుప్రీంకోర్టును ఆశ్రయించింది. కానీ, ఈ విషయంలో స్పందించి తాము హైకోర్టుల నైతిక స్థైర్యాన్ని దెబ్బతీయాలనుకోవడం లేదని సుప్రీం న్యాయమూర్తులు పేర్కొన్నారు. మద్రాసు హైకోర్టు వ్యాఖ్యలు కొంత పరుషంగా ఉన్న మాట వాస్తవం. కొంత సంయమనమూ అవసరం. మీడియా విషయానికొస్తే ఎన్నికల సంఘం వాదనలో ఎలాంటి పస లేదని న్యాయస్థానం తేల్చింది. ఎన్నికలప్పుడు పాలనను ఈసీ తన చేతుల్లోకి తీసుకోదని దాని తరఫు న్యాయవాదులు వాదించారు. తాము మార్గదర్శకాలను మాత్రమే విడుదల చేస్తామని, రాష్ట్రాలు వాటిని అమలు చేయాల్సి ఉంటుందన్నారు. అవి అమలు కాకపోతే ఈసీని బాధ్యత వహించాలనడం సరికాదన్నారు. ఈ వాదన పూర్తిగా అవాస్తవమైనది.

ఎన్నికల సమయంలో ఆయా రాష్ట్రాల్లోని సీనియర్‌ అధికారులను ఈసీ బదిలీ చేస్తూంటుంది. మార్చి తొమ్మిదో తేదీన బంగాల్​ డీజీపీ స్థానంలో మరొకరిని నియమిస్తూ ఆదేశాలిచ్చింది. కానీ, సుప్రీంకోర్టులో మాత్రం అందుకు విరుద్ధంగా చెప్పింది. ఎన్నికల తేదీలను నిర్ణయించే ఈసీకి అనుకోని అవాంతరాలు ఎదురైతే ఎన్నికలను వాయిదా వేసే అధికారమూ ఉంది. ఎన్నికల ప్రకటనను జారీ చేసిన మరుక్షణం నుంచే రాష్ట్ర ప్రభుత్వాల పనితీరును ఈసీ వేయికళ్లతో గమనిస్తూ ఉంటుంది. అలాంటిది తన మార్గదర్శకాలను అవి పాటించకపోతే తానేమీ చేయలేనని నమ్మబలుకుతోంది! స్వేచ్ఛాయుతమైన వాతావరణంలో విశ్వసనీయ పద్ధతిలో ఎన్నికల నిర్వహణకు ఈ దేశ ప్రజలకు రాజ్యాంగం పూచీ పడుతోంది. ఎన్నికల సంఘం ప్రవర్తన, సుప్రీంకోర్టు ముందు అది చేసిన అనుమానాస్పద వాదనలు, మీడియా నోరు కట్టేయడానికి చేసిన ప్రయత్నం మన రాజ్యాంగ నిర్మాతల ఆశయాలకు విరుద్ధమైనవి. ప్రధాన ఎన్నికల కమిషనర్‌కు సుప్రీంకోర్టు న్యాయమూర్తితో సమాన హోదా కల్పించి తద్వారా పౌరుల ఎన్నికల హక్కుల సంరక్షణ, ప్రజాస్వామ్య పరిరక్షణలో వారు నిర్భయంగా, చురుగ్గా బాధ్యతలు నిర్వర్తించడానికి 324(5) అధికరణ అవకాశం కల్పిస్తోంది.

హైకోర్టులకు అధికారముంది..

పోలింగ్‌ తేదీలు, దశలు, కేంద్ర బలగాల మోహరింపునకు సంబంధించి ప్రతి ప్రభుత్వానికీ తనదైన ఆకాంక్షలు ఉంటాయి. అయితే, అంతిమంగా వాటిని నిర్ణయించేటప్పుడు ప్రభుత్వం సూచనలు మాత్రమే చేయగలుగుతుంది. ఎన్నికలను సమర్థంగా నిర్వహించేందుకు తనదైన మార్గాన్ని ఈసీయే ఎంచుకోవాల్సి ఉంటుంది. ఈ సమతౌల్యం దెబ్బతింటే ప్రజలకు ఎన్నికల సంఘమే జవాబు చెప్పుకోవాల్సి ఉంటుంది. మిగిలిన రాష్ట్రాల్లోని 444 శాసనసభ స్థానాల ఎన్నికలను ఒక్కరోజులో నిర్వహించిన ఈసీ, పశ్చిమ్‌ బంగలోని 294 స్థానాలకు మాత్రం ఎనిమిది దశలు తీసుకుంది. వివాదాస్పదమైన ఈ నిర్ణయాన్ని ఎలా సమర్థించుకుంటారు? దేశంలో రోజువారీ కొవిడ్‌ కేసులు ఏప్రిల్‌ మొదటి వారంలోనే లక్ష దాటాయి. ముంచుకొస్తున్న ప్రమాదాన్ని గుర్తించడానికి అప్పట్లో ఈసీ నిరాకరించింది.

మద్రాసు హైకోర్టు మొట్టికాయలు వేశాక అన్యమనస్కంగా ఏవో కంటితుడుపు చర్యలు ప్రకటించింది. అయినప్పటికీ తన లాంటి రాజ్యాంగబద్ధమైన సంస్థపై హైకోర్టు అలాంటి వ్యాఖ్యలు చేసి ఉండకూడదన్నది ఈసీ వాదనలోని మరో లోపం. ఎన్నికల సంఘంతో సహా అన్ని అధికార వ్యవస్థలపై వ్యాజ్యాల స్వీకరణకు హైకోర్టుకు రాజ్యాంగ బద్ధమైన అధికారం ఉంది. కాబట్టి, హైకోర్టుల న్యాయ సమీక్షాధికారాన్ని ఈసీ గుర్తించి గౌరవించాలి. ప్రజాస్వామ్య బాధ్యతలను నిర్వర్తించడానికి ఏర్పాటైన ఓ ప్రధాన రాజ్యాంగ సంస్థ తన పనితీరుపై చర్చ జరగకూడదని భావించడం ఆశ్చర్యకరం. విచారణలో సుప్రీంకోర్టు ధర్మాసనం అభిప్రాయపడినట్లు- ప్రజాస్వామ్యం మనగలగాలంటే వ్యవస్థలు బలంగా, ప్రభావశీలంగా ఉండాల్సిందే. ఇందులో రెండో అభిప్రాయానికి తావులేదు!

- ఏ.సూర్యప్రకాశ్​, రచయిత - ప్రసార భారతి ఛైర్మన్​

ఇదీ చదవండి:'సైలెంట్ మోడ్​లోకి వెళ్లిన మోదీ, షా'

ABOUT THE AUTHOR

...view details