గడచిన మూడు దశాబ్దాల్లో ప్రపంచీకరణవల్ల సిద్ధించిన లాభాలెన్నో కరోనా దెబ్బకు మంటగలసిపోతున్నాయి. ప్రపంచీకరణ ప్రయోజనాల్లో ప్రధానమైనవి- భూగోళం మీద దాదాపు 200కోట్ల మంది పేదరికం నుంచి విముక్తులు కావడం, 1990లో 27లక్షల కోట్ల డాలర్లుగా ఉన్న ప్రపంచ ఆర్థిక వ్యవస్థ పరిమాణం 90లక్షల కోట్ల డాలర్లకు పెరగడం. అదే సమయంలో ప్రపంచంలో ఆర్థిక అసమానతలు పెరిగాయన్నదీ నిజమే. కరోనా వైరస్ వల్ల ఇప్పుడు జరుగుతున్న నష్టం 2008 ఆర్థిక సంక్షోభంవల్ల వాటిల్లినదానికన్నా ఎన్నో రెట్లు హెచ్ఛు ఆ సంక్షోభం నుంచి బయటపడటానికి ప్రపంచ దేశాలు తీసుకున్న చర్యలు ఇప్పుడు ఏ మేరకు పనిచేస్తాయో చెప్పలేం. అసలు కరోనా సంక్షోభం వంటిది మానవజాతికి పూర్తిగా కొత్త కాబట్టి, దాన్ని ఎలా ఎదుర్కోవాలో ఎవరికీ అంతుబట్టడం లేదు. కరోనా వైరస్‌కు ఇంతవరకు మందులు కానీ, టీకాలు కానీ అందుబాటులోకి రాలేదు. ప్రపంచం ఈ గండం నుంచి గట్టెక్కడానికి చాలా కాలమే పట్టనుంది. కరోనా సంక్షోభం సమసిపోయిన తరవాత అంతర్జాతీయ ఆర్థిక వ్యవస్థ స్వరూపస్వభావాలు సమూలంగా మారిపోవడం ఖాయం.
పరిష్కారమేమిటి?
కరోనా సంక్షోభాన్ని భారతదేశం సైతం తప్పించుకోలేదు. భారత్ నుంచి పాదరక్షలు, నగలు, క్రీడా వస్తువులు, తివాచీలు, ఇతర వినియోగ వస్తువులు విదేశాలకు ఎగుమతి అవుతుంటాయి. ఈ రంగాల్లో అయిదు కోట్ల మంది ఉపాధి పొందుతున్నారు. వీరిపై కరోనా ప్రభావం చాలా తీవ్రంగా ఉండబోతోంది. 330 కోట్ల ప్రపంచ కార్మిక బలగంలో 81శాతం (267కోట్ల మంది) ప్రత్యక్షంగానో, పరోక్షంగానో కరోనా ప్రభావానికి లోనవుతారని అంతర్జాతీయ కార్మిక సంస్థ (ఐఎల్‌ఓ) హెచ్చరించింది. వీరిలో దాదాపు సగం మంది చిల్లర వర్తకం, హోటళ్లు, ఆహార వ్యాపారం, పారిశ్రామికోత్పత్తి రంగాల్లో పనిచేస్తున్నారు. ప్రపంచంలో ఇప్పటికే 19.5కోట్ల పని గంటలు నష్టమయ్యాయని, కరోనా సంక్షోభం కొనసాగినంత కాలం ఈ నష్టం మరింత పెరుగుతుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. కరోనా వైరస్ కట్టడికి మందులో, వ్యాక్సినో వేగంగా అందుబాటులోకి రావాలి. అదే జరిగితే ప్రాణ నష్టం లేకుండా జనం పనిపాటల్ని పునఃప్రారంభించ గలుగుతారు. అది ఆలస్యమైనంత కాలం ఆర్థిక నష్టం పెరుగుతూనే ఉంటుంది. మొదట అంతర్జాతీయ పెట్టుబడి ప్రవాహాలు తీవ్ర ఒడుదొడుకులకు లోనవుతాయి. వ్యాపారాలు బంద్ కావడం వల్ల ప్రైవేటు లాభాలు ఆవిరైపోయి నగదుకు కటకట ఏర్పడుతుంది.
వినూత్న పరిష్కారాలే మార్గం
ఇప్పటికే తీవ్ర రుణ భారంతో కుంగిపోతున్న ప్రైవేటు కంపెనీలు వినూత్న పరిష్కారాలతో, నవ కల్పనలతో ముందుకువస్తే తప్ప నిలదొక్కుకోవడం కష్టం. కేంద్ర బ్యాంకులు భారీగా ఉద్దీపన నిధులు ప్రవహింపజేసి ప్రభుత్వాలకు, వ్యాపారాలకు గుక్కతిప్పుకొనే వ్యవధి ఇచ్చాయి. తమ దేశంలో కౌంటీ (జిల్లా) స్థాయి నుంచి బాండ్లు కొనుగోలు చేయాలని అమెరికా ఫెడరల్ రిజర్వు (కేంద్ర బ్యాంకు) నిశ్చయించింది. దీనివల్ల జిల్లా, మునిసిపల్, రాష్ట్ర ప్రభుత్వాలకు నిధులు విడుదల అవుతాయి. మొత్తంమీద అమెరికా ఫెడ్ రిజర్వు నిరంతరం బాండ్లను కొనుగోలు చేయడం ద్వారా ఆర్థిక వ్యవస్థలోకి తొమ్మిది లక్షల కోట్ల డాలర్లను ప్రవహింపజేసింది. ఇది ఆ దేశ జీడీపీలో దాదాపు సగానికి సమానం. ఇతర దేశాల కేంద్ర బ్యాంకులూ ఏమైనా సరే ఆర్థిక వ్యవస్థను నిలబెడతామని ప్రకటించాయి. మహా మాంద్యాన్ని నివారించడానికి ఏది అవసరమైతే అది చేస్తామంటున్నాయి.
నిధులకు కటకట...