క్షణికావేశంలోనో, ఇతరత్రా కారణాల వల్ల నేరాలకు పాల్పడేవారిలో మానసిక పరివర్తన తేవడమే జైలు శిక్షల అసలు లక్ష్యం. కిక్కిరిసిన ఖైదీలు, సిబ్బంది లేమి వంటి సమస్యలతో ఇండియాలోని కారాగారాలు నరకాలకు నకళ్లుగా నిలుస్తున్నాయి. తీవ్ర నిరాశ, నిస్పృహలకు లోనైన ఖైదీల వల్ల జైళ్లలో తరచూ చోటుచేసుకుంటున్న హింసాత్మక ఘటనలు శిక్షల ప్రక్రియను అపహాస్యం చేస్తున్నాయి. తాజాగా ఉత్తర్ ప్రదేశ్‌లోని ఫరూఖాబాద్ జిల్లా జైలులో సరైన వైద్యం అందక ఒక ఖైదీ మరణించాడంటూ తోటి ఖైదీలు కారాగారానికి నిప్పు పెట్టారు. గతేడాది కరోనా విజృంభణ సమయంలో కోల్‌కతాలోని డండం కేంద్ర కారాగారంలో కుటుంబ సభ్యులతో మిలాఖత్‌లను నిలిపివేయడంతో ఆగ్రహించిన విచారణ ఖైదీలు జైలు సిబ్బందిపై దాడికి పాల్పడ్డారు. అది కాల్పుల వరకూ వెళ్ళింది.
సామర్థ్యానికి మించి ఖైదీలను జైళ్లలో కుక్కడం భారత్‌లో ప్రధాన సమస్య. దేశంలో అన్నీ కలిపి దాదాపు 1350 జైళ్లు ఉన్నాయి. వాటి సామర్థ్యం 4.03 లక్షలు. జాతీయ నేర గణాంక సంస్థ (ఎన్‌సీఆర్‌బీ) నివేదిక ప్రకారం 2019 చివరి నాటికి వాటిలో 4.78 లక్షల మంది ఖైదీలు ఉన్నారు. వారిలో 69శాతం విచారణ దశలో ఉన్నవారే! అన్ని జైళ్లలో ఉండాల్సిన వారికన్నా ఖైదీలు సగటున 118శాతం అధికంగా ఉన్నారు. విచారణ ఖైదీలు బెయిల్ దొరికేలోపు అయిదు నెలల నుంచి అయిదేళ్ల దాకా జైళ్లలోనే మగ్గిపోతుండటం మన న్యాయవ్యవస్థలోని లోపాలను కళ్లకు కడుతుంది. చాలా మంది చేసిన నేరానికి పడే శిక్షకన్నా ఎక్కువ కాలం జైళ్లలోనే ఉండిపోవలసి వస్తోంది. ఖైదీల సంఖ్య పరంగా కేంద్ర కారాగారాల పరిస్థితి మరింత ఘోరంగా ఉంది. జిల్లా జైళ్లలోనూ పరిస్థితి అలాగే ఉంది.
ఛత్తీస్‌గఢ్, ఉత్తర్ ప్రదేశ్, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, సిక్కిం, ఉత్తరాఖండ్ రాష్ట్రాల్లోని జైళ్లలో ఖైదీల సంఖ్య 150శాతాన్ని దాటిపోయింది. జైళ్లకు కేటాయిస్తున్న నిధులు, చేస్తున్న ఖర్చులకూ చాలా వ్యత్యాసం ఉంటోంది. దేశంలోని అన్ని జైళ్లలో 3,320 మంది ఆరోగ్య సిబ్బంది ఉండాలి. అది అరవై శాతమూ దాటడంలేదని పలు అధ్యయనాలు చాటుతున్నాయి. మహిళా వైద్యాధికారుల సంఖ్య మరీ తక్కువగా ఉంటోంది. సరైన వైద్య సౌకర్యాల లేమి, కిక్కిరిసిన గదులు, శారీరక, లైంగిక దాడుల వంటివి ఖైదీల మానసిక సమస్యలను పెంచుతాయని ప్రపంచ ఆరోగ్య సంస్థ, రెడ్ క్రాస్‌లు పేర్కొంటున్నాయి.
2019లో..