తెలంగాణ

telangana

ETV Bharat / opinion

నామమాత్రం పింఛన్లతో దక్కని ఊరట! - భారతీయ పింఛన్ విధానం

ఒంటరి తనం.. వృద్ధాప్యానికి పెను శాపం. నిరుపేద పండుటాకులు అనారోగ్యం బారినపడితే.. ఆ అవస్థ మరీ దుర్భరంగా ఉంటుంది. జాతీయ కుటుంబ సంక్షేమ శాఖ, అంతర్జాతీయ జనాభా శాస్త్ర అధ్యయన కేంద్రం సంయుక్తంగా నిర్వహించిన ఓ సర్వేలో ఇలాంటి వాస్తవాలెన్నో బయటపడ్డాయి. రోజు గడవని స్థితిలో.. అరవై ఏళ్లు నిండిన వారిలో 40శాతానికిపైగా పొట్టకూటి కోసం ఏదో ఒక పని చేస్తున్నవారే. వీరితో పాటు పేదరికంలో మగ్గుతున్న వితంతువులు, దివ్యాంగుల పింఛన్లను ఉదారంగా పెంచదలచామని గ్రామీణాభివృద్ధి మంత్రిత్వశాఖ రెండేళ్లుగా చెబుతున్నా.. ఇప్పటిదాకా ఆయా ప్రతిపాదనలేవీ కార్యరూపం దాల్చలేదు.

The poor do not deserve with a Nominal pension
నామమాత్రం పింఛన్లు

By

Published : Mar 11, 2021, 6:36 AM IST

సర్వోన్నత న్యాయస్థానం లోగడ ఒక తీర్పులో స్పష్టీకరించినట్లు- పేదలు, బలహీనులు, నిస్సహాయులైన ప్రజల్ని ఆదుకోవడం కన్నా ప్రభుత్వానికి మరేదీ ముఖ్యం కాదు. వాస్తవిక కార్యాచరణలో ఆ సంక్షేమ స్ఫూర్తికి సరైన మన్నన దక్కడం లేదనేందుకు గ్రామీణాభివృద్ధిపై పార్లమెంటరీ స్థాయీ సంఘం తాజా నివేదికే రుజువు. కొన్నేళ్లుగా ఎదుగూ బొదుగూ లేని జాతీయ సామాజిక ఆసరా పింఛన్ల తీరుతెన్నులపై స్థాయీ సంఘం ఘాటు విమర్శలు గుప్పించింది. గాలిలో దీపంలాంటి ఎన్నో బతుకులకు తోడ్పాటుగా నిలుస్తాయని, అక్కరకొస్తాయని ఉద్దేశించిన పింఛన్లు- స్థాయీసంఘం మాటల్లో, అరకొర!

ఊరటేదీ.?

దారిద్య్రరేఖ దిగువన అలమటిస్తున్న నిరుపేద కుటుంబాల్లోని వయోధికులకు విదుపుతున్న వృద్ధాప్య పింఛన్లు నెలకు రూ.200-రూ.500. నలభైఏళ్లు పైబడిన బీద వితంతువులకు అనుగ్రహిస్తున్నది రూ.300-రూ.500. అంగవైకల్యంతో బాధపడుతున్న 18-79 సంవత్సరాల పేదలకిస్తున్న పింఛన్‌ మూడువందల రూపాయలు. ఈ స్వల్ప మొత్తాలతో ఎవరికైనా కొద్దిపాటి ఊరట అయినా దక్కుతుందా? ఈ నామమాత్రం వృద్ధాప్య, వితంతు, వికలాంగ పింఛన్లను సహేతుక స్థాయికి పెంచాలని ఇప్పటికే రెండు పర్యాయాలు సూచించినా పట్టించుకోని గ్రామీణాభివృద్ధి మంత్రిత్వశాఖ, ఈసారైనా పెద్ద మనసుతో వ్యవహరించాలన్నది స్థాయీసంఘం నివేదిక సారాంశం. నిస్సహాయులపట్ల స్వీయ బాధ్యతను కేంద్రం గుర్తెరిగి మసలాలంటూ పార్లమెంటరీ కమిటీ పొందుపరచింది, శిరోధార్యమనదగ్గ మేలిమి సిఫార్సు. ఆకలి మంటల్లో కమిలిపోతున్న వయోవృద్ధులు, జీవితాంతం అండగా ఉండాల్సిన తోడును కోల్పోయి ఒంటరి పక్షుల్లా మిగిలిన అభాగినులు, సొంతకాళ్లపై నిలబడలేని వికలాంగుల విషయంలో నిరాదరణ- సంక్షేమ రాజ్య భావనకే గొడ్డలిపెట్టు!

పెరుగుతున్న వృద్ధులు

ఒంటరితనం వృద్ధాప్యానికి పెనుశాపం. నిరుపేద పండుటాకులకు అనారోగ్యం దాపురిస్తే- ఆ అవస్థ మరింత దుర్భరం. జాతీయ కుటుంబ సంక్షేమశాఖ, అంతర్జాతీయ జనాభా శాస్త్ర అధ్యయన కేంద్రం సంయుక్తంగా నిర్వహించిన ఇటీవల సర్వేలో చేదునిజాలెన్నో వెలుగుచూశాయి. రోజు గడవని స్థితిలో, అరవైఏళ్లు మించినవారిలో 40 శాతానికిపైగా ఏదో ఒక పని చేసి పొట్ట పోసుకుంటున్నవారే. 2011 జనాభా లెక్కల ప్రకారం దేశ జనాభాలో 10.3 కోట్లుగా తేలిన వృద్ధుల సంఖ్య ఏటా మూడుశాతం చొప్పున పెరుగుతోంది. ఆరు పదుల వయసు దాటినవారిలో సగం మందికిపైగా దీర్ఘకాలిక వ్యాధులతో సతమతమవుతున్నవారేనని, గ్రామీణ ఉపాధి హామీ పనులకు హాజరవుతున్నవారిలో 20శాతం దాకా వృద్ధులేనని, నిరుపేద వయోజనుల్లో మూడోవంతు కన్నా తక్కువ మందే పింఛన్‌కు నోచుకుంటున్నట్లు గణాంకాలు చాటుతున్నాయి.

కార్యరూపం దాల్చని ప్రతిపాదనలు

మలివయసులోని వారితోపాటు, కొవిడ్‌ సంక్షోభం వేళ కోట్లాది వలస శ్రామికులకు భుక్తినిచ్చిన ఉపాధి హామీ పథకంలో వేతనాలు రాష్ట్రానికో తీరుగా ఉండటం అసంబద్ధమని స్థాయీసంఘం సూటిగా తప్పుపట్టింది. ఛత్తీస్‌గఢ్‌లో రూ.190, తెలుగు రాష్ట్రాల్లో రూ.237, హరియాణాలో రూ.309... ఇలా ఎక్కడికక్కడ వేర్వేరు వేతనాలనే కాదు- చెల్లింపుల్లో జాప్యాలనూ కమిటీ వేలెత్తిచూపింది. ఉపాధి హామీ పథకం మౌలిక లక్ష్యాలకే తూట్లు పొడుస్తున్న ఇటువంటి లోటుపాట్లను సరిదిద్దడం, సామాజిక ఆసరాను అర్థవంతంగా ప్రక్షాళించడంపై ప్రభుత్వం తక్షణం దృష్టి కేంద్రీకరించాలి. పేదరికంలో మగ్గుతున్న సుమారు మూడుకోట్ల మంది వయోవృద్ధులు, వితంతువులు, అంగవికలుర పింఛన్లను ఉదారంగా పెంచదలచామని గ్రామీణాభివృద్ధి మంత్రిత్వశాఖ రెండేళ్లుగా సందడి చేస్తున్నా- ఇప్పటిదాకా ఆయా ప్రతిపాదనలేవీ కార్యరూపం దాల్చనే లేదు. ప్రధాని నరేంద్ర మోదీ గతంలో చెప్పినట్లు- ప్రగతి ఫలాలు నిరుపేదలకు అందనంతవరకు అభివృద్ధి సంపూర్ణం కాదు!

ఇదీ చదవండి:'మోదీ సర్కారు ముగిసేదాకా పోరు ఆగదు'

ABOUT THE AUTHOR

...view details