పశ్చిమాసియా దేశం ఇజ్రాయెల్ రెండేళ్లుగా రాజకీయ సంక్షోభంలో కొట్టుమిట్టాడుతోంది. ప్రజా సంక్షేమం కంటే స్వప్రయోజనాలకే రాజకీయ పార్టీలు పెద్దపీట వేస్తుండటంతో అక్కడ సుస్థిర ప్రభుత్వం ఏర్పాటుకావడం లేదు. పర్యవసానంగా ప్రజాస్వామ్యం అపహాస్యం పాలవుతోంది!
ఇజ్రాయెల్ పార్లమెంటులో మొత్తం 120 సీట్లు ఉన్నాయి. ప్రభుత్వాన్ని ఏర్పాటుచేయాలంటే 61 మంది ఎంపీల మద్దతు అవసరం. ఈ ఏడాది మార్చిలో నిర్వహించిన సార్వత్రిక ఎన్నికల్లో ఏ పార్టీకీ స్పష్టమైన మెజారిటీ దక్కలేదు. ప్రధానిగా కొనసాగుతున్న నెతన్యాహు నేతృత్వంలోని మితవాద పార్టీ 'లికుడ్' 30 స్థానాలు గెలుచుకొని ఏకైక అతిపెద్ద పార్టీగా అవతరించింది. దాని మిత్రపక్షాలకు 22 సీట్లు వచ్చాయి. దీంతో సంకీర్ణ ప్రభుత్వాన్ని ఏర్పాటుచేసేందుకు నెతన్యాహును దేశాధ్యక్షుడు రివ్లిన్ ఆహ్వానించారు. కానీ అవసరమైన మద్దతును కూడగట్టడంలో ప్రధాని విఫలమయ్యారు. అనంతరం ప్రతిపక్ష నేత, యష్‌ఆటిడ్ పార్టీ అధినేత యయిర్ లిపిడ్‌కు దేశాధ్యక్షుడు ఆహ్వానం పంపారు. ప్రభుత్వ ఏర్పాటుకు నాలుగు వారాల గడువిచ్చారు.
యెష్ అటిడ్‌కు గత ఎన్నికల్లో కేవలం 17 స్థానాలు దక్కాయి. మిత్రపక్షాలను కలుపుకొంటే తనకు 56 మంది ఎంపీల మద్దతుందని లిపిడ్ చెబుతున్నారు. త్వరలోనే మరికొందరు ఎంపీలనూ తనవైపు తిప్పుకొని ప్రభుత్వాన్ని ఏర్పాటుచేస్తానని ధీమా వ్యక్తం చేస్తున్నారు. ఇజ్రాయెల్ రాజకీయాలను పుష్కర కాలంగా 71 ఏళ్ల నెతన్యాహు శాసిస్తున్నారు. 2009 నుంచి ప్రధానిగా కొనసాగుతున్నారు. నెతన్యాహు నాయకత్వంలో ఇజ్రాయెల్ అభివృద్ధి పథంలో బాగానే దూసుకెళ్లింది. కరోనా కట్టడిలోనూ విజయవంతమైందనే చెప్పుకోవచ్చు. దేశవ్యాప్తంగా టీకా పంపిణీని ఆయన ప్రభుత్వం వేగంగా పూర్తిచేసింది. అయితే అవినీతి ఆరోపణలపై విచారణ ఎదుర్కొంటుండటంతో నెతన్యాహు ప్రతిష్ఠ కొంతకాలంగా మసకబారింది. సుదీర్ఘ పాలన కారణంగా ప్రభుత్వంపై సహజంగానే పుట్టుకొచ్చే వ్యతిరేకత కూడా తోడవడంతో ఎన్నికల్లో స్పష్టమైన మెజారిటీని సాధించడంలో ఆయన విఫలమయ్యారు. అయినప్పటికీ సంకీర్ణ ప్రభుత్వం ఏర్పాటు చేసేందుకు అనేక హామీలను ఇతర పార్టీల ముందు ఉంచారు. ప్రధాని పదవిని రొటేషన్ విధానంలో పంచుకుందామనీ ప్రతిపాదించారు. అయినా అవసరమైన సంఖ్యాబలాన్ని కూడగట్టడంలో విఫలం కావడంతో- తాను ప్రభుత్వాన్ని ఏర్పాటుచేయలేనంటూ దేశాధ్యక్షుడి ముందు అశక్తత వ్యక్తం చేశారు. ఇజ్రాయెల్‌లో నెతన్యాహు శకం ముగిసిందని చెప్పేందుకు ఇది సంకేతమని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.
నెతన్యాహు పాలనలో భారత్, ఇజ్రాయెల్ సంబంధాలు గణనీయంగా మెరుగయ్యాయి. ముఖ్యంగా రక్షణ రంగంలో వ్యూహాత్మక సహకారం పెరిగింది. ఇజ్రాయెల్ నుంచి అత్యధిక స్థాయిలో రక్షణ ఉత్పత్తులను దిగుమతి చేసుకొంటున్నది ఇండియానే. ప్రధాని మోదీ, నెతన్యాహు మధ్య స్నేహం ద్వైపాక్షిక సంబంధాల మెరుగుదలకు తోడ్పడింది. ఒకప్పుడు ఇజ్రాయెల్‌తో సంబంధాలను అరబ్-ఇజ్రాయెలీ ఘర్షణ కోణం నుంచే భారత్ ఎక్కువగా చూసేది. 2017లో మోదీ ఇజ్రాయెల్‌లో పర్యటించిన తరవాత- పరిస్థితిలో మార్పు వచ్చింది. ఆ తరవాతి ఏడాదే నెతన్యాహు మన దేశంలో పర్యటించారు. 'భారత్-ఇజ్రాయెల్ మధ్య సంబంధాలకు ఆకాశమే హద్దు' అని ఓ సందర్భంలో ఆయన వ్యాఖ్యానించారు. ప్రస్తుతం ఆయన పదవీచ్యుతుడు కావడం ఖాయంగా కనిపిస్తున్న నేపథ్యంలో ద్వైపాక్షిక సహకారం ప్రస్తుతం ఉన్నంత పటిష్ఠంగా భవిష్యత్తులో కొనసాగడంపై నీలినీడలు కమ్ముకొంటున్నాయి.
ఇజ్రాయెల్ రాజకీయాల్లో పలు చీలిక వర్గాలున్నాయి. అరబ్బులు, సంప్రదాయ, లౌకిక, జాతీయ వాదులు ఆయా వర్గాల ప్రజలకు ప్రాతినిధ్యం వహిస్తున్నారు. ప్రజలు అభ్యర్థుల సత్తాను చూసి కాకుండా... వారు తమ వర్గం వారేనా అనే దాన్నే పరిగణనలోకి తీసుకొని ఓటేస్తున్నారు. ఫలితంగా చిన్న పార్టీలకు చెప్పుకోదగిన సంఖ్యలో సీట్లు వస్తున్నాయి. కానీ ప్రభుత్వ ఏర్పాటు విషయంలో అవి పట్టువిడుపులు ప్రదర్శించడం లేదు. పెద్ద డిమాండ్లతో... సంకీర్ణ రాజకీయాలను సంక్లిష్టంగా మార్చేస్తున్నాయి. ప్రస్తుతం ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడంలో లిపిడ్ కూడా విఫలమైతే ఇజ్రాయెల్‌లో అనిశ్చితి మరింత ముదిరే అవకాశముంది. మళ్లీ ఎన్నికలు నిర్వహించక తప్పని పరిస్థితులు ఏర్పడతాయి. గత రెండేళ్లలో నాలుగు సార్లు సార్వత్రిక సమరం జరగడంతో ఇప్పటికే అక్కడి ప్రజలు విసుగెత్తిపోయారు. మళ్లీ ఎన్నికలు నిర్వహించినా ఏదో ఒక పార్టీకి స్పష్టమైన మెజారిటీ లభిస్తుందన్న గ్యారంటీ లేదు. ఈ నేపథ్యంలో రాజకీయ పార్టీలు తమ పంతాలను, సైద్ధాంతిక విభేదాలను పక్కన పెట్టి ప్రజాప్రయోజనాలే పరమావధిగా చేతులు కలుపుతాయా అన్నదే సందేహం. పదేపదే ఎన్నికల పేరుతో ప్రజాధనాన్ని, విలువైన కాలాన్ని వృథా చేయడం ఎంతమాత్రమూ సమంజసం కాదన్నది పలువురి అభిప్రాయం. పరిస్థితులు ఇలాగే కొనసాగితే ప్రజలు ప్రజాస్వామ్య వ్యవస్థపైనే విశ్వాసం కోల్పోయే ముప్పుంది.