నేడు ప్రపంచంలో ఎక్కడ చూసినా ఘర్షణ వాతావరణమే కనిపిస్తోంది. కులాలు, మతాలు, ప్రాంతాలు, జాతి వైరాలతో సమాజంలో హింసాప్రవృత్తి తాండవిస్తోంది. అమానుషాలు, అకృత్యాలు ప్రబలిపోయాయి. ఆధునికత మాటున సంప్రదాయాలు, ఆధ్యాత్మిక భావనలకు చోటు తగ్గిపోతోంది. మనిషి జీవితాన్ని ఈ పరిణామాలు అల్లకల్లోలం చేస్తున్నాయి. దీంతో మళ్ళీ మూలాల్లోకి వెళ్లాల్సిన ఆవశక్యత ఉరుముతోంది. గాంధీజీ ప్రవచించిన సిద్ధాంతాలవైపు యువత దృష్టి మళ్లుతోంది. జీవితంలో సత్యసంధత విలువల పట్ల గ్రహింపు అధికమవుతోంది. గాంధీజీ జీవిత భావాలను, చేసిన కృషిని, సాధించిన విజయాలను తలచుకుంటే- మానవజాతి భవితపై కమ్ముకున్న కారుచీకట్ల మధ్య మెరిసిన కాంతికిరణం జాతిపిత అనిపిస్తుంది.
గాంధీ ఓ పరిపూర్ణ వ్యక్తి. సత్యాన్వేషణలో తన జీవితాన్ని ప్రయోగశాలగా మలచుకున్న గొప్ప శక్తి. బిడ్డగా, తండ్రిగా, భర్తగా, ఉద్యోగిగా, నాయకుడిగా విలువల వెలుగులు పంచారు. అపనమ్మకాలు, విశ్వాస ఘాతుక చర్యలు, స్వార్థం, అర్థంలేని వస్తువ్యామోహం.. ఇలా ఆధునిక సమాజం ఎదుర్కొంటున్న అనేక సమస్యలకు గాంధీజీ ఆత్మకథలో అనేక పరిష్కారాలు చూపారు. విద్యార్హతలు, హోదా, సంపాదన, ఆస్తిపాస్తులు.. మనిషిని గౌరవించడానికి ఇవి ఏవీ కొలమానాలు కావంటారు గాంధీ. ఎదుటి మనిషిని ఆత్మరూపంగా, సత్యరూపంగా చూడమంటారు. ఆ ఆధ్యాత్మిక, నైతిక దృష్టికోణాన్ని అలవరచుకోగలిగితే మానవ సంబంధాలతో ముడివడిన 90 శాతం సమస్యలు పరిష్కారమైనట్లేనని గాంధీ మార్గం సూచిస్తుంది. ఎంత చదివినా, ఎంత సంపాదించినా ఆధునిక జీవితం సమస్యాత్మకమే అవుతోంది. నెలకు వేలు, లక్షలు సంపాదించేవారిలోనూ ఏదో అసంతృప్తి, ఆవేదన కనిపిస్తున్నాయి. వాస్తవానికి గాంధీ సైతం ఒక దశలో అలాంటి ఆలోచనల్లో పడినవారే. అప్పుడే ఆయన సత్యశోధన అంకురించింది. తాను వెళ్తున్న మార్గం ఎంత తప్పో గ్రహించారు. వస్తువ్యామోహం విడిచిపెట్టారు. రెండు గదుల ఇంటి నుంచి ఒంటి గదికి మారారు. హోటల్ భోజనం నుంచి స్వయంపాకానికి మారారు. సరళ జీవితం సమయాన్ని ఆదా చేసింది. అప్పుడే తన జీవితం సత్యమైనదన్న గ్రహింపు కలిగి మనసు ఆత్మసంతృప్తితో నిండిందంటారు గాంధీజీ!
ఇదీ చూడండి:ఆచరణాత్మక ఆదర్శవాది 'బాపూ'
ప్రయోగశీలి
ఆయన దృష్టిలో సత్యమంటే మాటకు సంబంధించింది మాత్రమే కాదు- అది ఆలోచన, ఆచరణలతో ముడివడింది కూడా. బ్రహ్మచర్యం నుంచి భోజనం వరకు గాంధీజీ అన్ని విషయాల్లో ప్రయోగాలు చేశారు. వైఫల్యాలను సమీక్షించుకుంటూ లోపాలను అధిగమిస్తూ ముందుకెళ్ళారు. సత్యం ఆత్మదృష్టిని ప్రసాదిస్తుంది. దీనివల్ల బుద్ధి వికసిస్తుంది, ఆలోచనలు విస్తృతమవుతాయి. గాంధీ మార్గంలో మరో అడుగు పశ్చాతాపం. నీటితో బురదను కడుక్కున్నట్లు పశ్చాత్తాపంతో పాపాల్ని, లోపాల్ని శుభ్రపరచుకోవచ్చని నిరూపించారు గాంధీజీ. అపరాధం చేశానని భావించిన ప్రతిసారీ ఉత్తరాల రూపంలో క్షమాపణ కోరేవారు. జీవితంలో చాలా తప్పులు చేస్తుంటాం.. భార్య, పిల్లలు, స్నేహితులు, సహోద్యోగుల విషయంలో అసత్య భారాన్ని ఎంతకాలమని మోస్తాం? ఉపవాసాన్ని ఓ బలమైన ప్రాయశ్చిత్త మార్గంగా గాంధీ భావించారు. గాంధీ మార్గంలో మరో మజిలీ- అహింస. ప్రస్తుత సమాజంలో ఎక్కడ చూసినా హింస తాండవిస్తోంది. అయినవారే పరస్పరం కత్తులు దూసుకొంటున్నారు. హతమార్చుకొంటున్నారు. సామాన్యుల నుంచి నాయకుల వరకు ఎందరో ఇదే ధోరణిలో కొట్టుకుపోతున్నారు. ఎటుచూసినా రక్తపాతాలే. ఈ గాయాల్ని నయం చేసుకోలేమా? సత్యం అనే గమ్యాన్ని చేరుకోవడానికి అహింసే ప్రధాన మార్గమని భావించారు మహాత్ముడు. సమస్యలు, సంక్షోభాలు ఎన్ని వచ్చినా ఆ మార్గాన్ని వీడలేదు. సత్యసంధత వల్ల క్రోధం, స్వార్థం, ద్వేషం సమసిపోతాయి. రాగద్వేషాలు ఉన్న వ్యక్తి ఎంత మంచివాడైనా శుద్ధసత్యాన్ని దర్శించలేడని అంటారు గాంధీ. అహింసామార్గంలో ప్రేమ అనురాగాలు ఉంటాయి. శత్రుత్వం, కసి ప్రతీకారం ఉండవు. స్వాతంత్య్ర సమరం అహింసా మార్గంలో జరిగింది కాబట్టే శత్రువులుగా ఉండాల్సిన బ్రిటిష్‌వారు సైతం గాంధీజీని మహాత్ముడిగా, మహనీయుడిగా భావించారు.