గడచిన రెండు దశాబ్దాల్లో భారతదేశ స్థూల దేశీయోత్పత్తి (జీడీపీ) నాలుగున్నర రెట్లు పెరిగితే, ప్రజల తలసరి వినియోగం మూడు రెట్లు హెచ్చింది. ఆహార ధాన్యాల ఉత్పత్తి రెండు రెట్లు పెరిగినందువల్ల భారత్ ఎగుమతులపై ఆధారపడాల్సిన అవసరం లేకుండా ప్రజల ఆహార అవసరాలను తానే తీర్చగలుగుతోంది. అయితే పెద్ద సంఖ్యలో ఉన్న పేద ప్రజానీకానికి పౌష్టికాహారం అందించడంలో భారత్ చేయవలసింది చాలా ఉంది. దేశంలో దాదాపు 19 కోట్లమంది పేద ప్రజలు పౌష్టికాహార లోపం కలిగి ఉన్నారని ఆహార, వ్యవసాయ సంస్థ (ఎఫ్‌ఏఓ) 2020 సంవత్సర నివేదిక తెలిపింది. 15 ఏళ్ల నుంచి 49 ఏళ్ల వయసు మహిళల్లో 51.4శాతం రక్తహీనతతో బాధపడుతున్నారు. ఇది పిల్లలను కనే వయసు కావడంతో ఆ మహిళల సంతానం దుర్బలంగా మారుతోంది. అందుకే భారత్‌లో అయిదేళ్ల లోపు బాలల్లో 34.7శాతం తమ వయసుకు తగ్గ ఎత్తు పెరగడం లేదు. మరి 20 శాతం ఉండాల్సిన బరువుకన్నా తక్కువ ఉంటున్నారు. సరైన పోషణ లేని పిల్లలు నీళ్ల విరేచనాలతో, మలేరియా, న్యుమోనియాలతో మరణించే ప్రమాదం ఎక్కువ. ఇటీవల గ్రామాల్లోని పేద కుటుంబాల్లో పాలు, గుడ్ల వాడకం పెరిగినా అవి చాలినంత పరిమాణంలో ఉండటం లేదు. మాంసకృత్తులు దండిగా ఉండే పప్పుగింజల వాడకం పెరగనిదే పేదల్లో పౌష్టికాహార లోపాన్ని తొలగించలేం.
పడిపోతున్న పప్పుగింజల వినియోగం
పల్లెల్లో ఉన్నకాస్త పప్పుల వినియోగమూ తగ్గిపోతూ బిస్కెట్లు, కేకులు, శీతల పానీయాల వాడకం పెరుగుతోందని జాతీయ నమూనా సర్వే (ఎన్‌ఎస్‌ఎస్‌ఓ) సంస్థ అధ్యయనాలు వెల్లడిస్తున్నాయి. 2016-20 మధ్యకాలంలో పల్లెల్లో శీతల పానీయాల వినియోగం రెట్టింపు అయింది. ఇంటింటా టెలివిజన్ ఉన్నందువల్ల ఈ తరహా వ్యర్థాహారాల వాణిజ్య ప్రకటనలు గ్రామీణ శ్రామిక జనాన్ని, ముఖ్యంగా ఆ కుటుంబాల్లోని యువతను ప్రభావితం చేస్తున్నాయి. ఫలితంగా పల్లెల్లో బిస్కెట్లు, కూల్ డ్రింకుల అమ్మకాలు జోరందుకున్నాయి. ఒకరిని చూసి మరొకరు ఈ తరహా ఆహారాలను భుజిస్తూ, సంప్రదాయ పప్పులను నిర్లక్ష్యం చేస్తున్నారు. రేషన్ కార్డులున్న ప్రతి కుటుంబానికీ ఈ ఏడాది నవంబరు వరకు నెలకు అదనంగా అయిదు కిలోల బియ్యం లేక గోధుమలు, ఒక కిలో పప్పు గింజలను అందించడానికి ప్రధానమంత్రి గరీబ్ కల్యాణ్ అన్న యోజన పథకాన్ని అమలు చేశారు. ఇది స్వాగతించాల్సిన పథకమే కానీ, దేశంలో నానాటికీ పెరిగిపోతున్న పోషకాహార లోపాన్ని అదుపు చేయడానికిది పూర్తిస్థాయిలో తోడ్పడదు.
కొరవడిన పరిశోధనలు
మంచి విత్తనాలు, మార్కెటింగ్ సదుపాయాలు లేకపోవడం, అసమర్థ సేకరణ యంత్రాంగంవంటివి రైతులకు పప్పుగింజల సాగు పట్ల విముఖత పెంచుతున్నాయి. ఇది ధరల్లో తీవ్ర హెచ్చుతగ్గులకు దారితీస్తోంది. 2012-13 నుంచి 2014-15 వరకు సాగైన ఆహార ధాన్యాల్లో దాదాపు 30 శాతాన్ని సేకరించిన ప్రభుత్వ సంస్థలు, పప్పుల ఉత్పత్తిలో కేవలం ఒకశాతం నుంచి నాలుగుశాతం వరకు మాత్రమే సేకరించాయి. ఇది పప్పుల ధరల పతనానికి దారితీసింది. భారత్‌లో ప్రధానంగా మెట్ట ప్రాంతాల్లోనే పప్పులు పండిస్తారు. ఈ పొలాలకు సాగునీటి సౌకర్యం లేక పూర్తిగా వర్షాలపై ఆధారపడాల్సి వస్తోంది. నాసిరకం విత్తనాలు ఉత్పత్తిని దెబ్బతీస్తున్నాయి. మేలైన విత్తనాల కోసం పరిశోధనలు జరగడం లేదు. ఇతర ఉత్పత్తి సాధనాలూ రైతులకు లభ్యం కావడం లేదు. ఇదంతా పప్పుగింజల ఉత్పత్తిని ఎదుగూబొదుగూ లేకుండా చేస్తోంది. ఈ పరిస్థితిని మార్చాలి. పంజాబ్, హరియాణా, ఉత్తర్ ప్రదేశ్ రాష్ట్రాల్లో కేవలం వరి-గోధుమ పంటలకే పరిమితమైన ప్రాంతాల్లో పప్పుగింజల సాగును ప్రోత్సహించాలి.