తెలంగాణ

telangana

ETV Bharat / opinion

ఆన్‌లైన్‌ లావాదేవీలపై సైబర్​ పంజా

దేశంలో సైబర్​ నేరాల సంఖ్య గణనీయంగా పెరుగుతోంది. సైబర్‌ నేరగాళ్ల బారినపడిన బాధితులు పోలీసులను ఆశ్రయించినా న్యాయం జరిగే అవకాశాలు చాలా తక్కువగా ఉంటున్నాయి. తక్కువ సమయంలో ఎక్కువ డబ్బు సంపాదించాలనే భావన యువతను సైబర్​ నేరాలవైపు మొగ్గు చూపేటట్లు చేస్తోందని విశ్లేషకులు పేర్కొంటున్నారు.

cyber crimes in india
ఆన్‌లైన్‌ లావాదేవీలపై సైబర్​ పంజా

By

Published : Aug 1, 2021, 7:16 AM IST

ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని విస్తృతంగా వినియోగించుకునేటప్పుడు అనేక సవాళ్లూ ఎదురవుతుంటాయి. అందులో అత్యంత సమస్యాత్మకమైనవి సైబర్‌ నేరాలు. 2014 నుంచి గణాంకాలు పరిశీలిస్తే- ఏటికేడాది భారత్‌లో సైబర్‌ నేరాల సంఖ్య గణనీయంగా పెరుగుతోంది. వీటిని కట్టడి చేయడానికి దేశంలో సమర్థమైన వ్యవస్థ లేకపోవడం ఎందరో బాధితుల్ని ఆర్థికంగా, మానసికంగా కుంగదీస్తోంది. సైబర్‌ నేరగాళ్ల బారినపడిన బాధితులు పోలీసులను ఆశ్రయించినా న్యాయం జరిగే అవకాశాలు చాలా తక్కువగా ఉంటున్నాయి. నేర విచారణలో దేశంలోని వివిధ ప్రాంతాల పోలీసుల మధ్య సమన్వయ లోపాన్ని ఆసరాగా చేసుకుని సైబర్‌ నేరగాళ్లు చెలరేగిపోతుండటం పరిపాటిగా మారుతోంది. ఇలాంటి పరిస్థితుల్లో కేంద్ర హోం మంత్రిత్వ శాఖ ఎట్టకేలకు కొత్తగా ప్రవేశపెట్టిన 'ఐ ఫోర్‌-సీ' వ్యవస్థ ఇలాంటి నేరాలకు పాల్పడుతున్న ఎందరో సైబర్‌ నేరగాళ్లకు సింహస్వప్నంలా మారే అవకాశాలు కనిపిస్తున్నాయి.

ఆర్థికపరమైనవే అధికం

ఆన్‌లైన్‌ వేధింపులు, ఫిషింగ్‌, బ్రూట్‌ఫోర్స్‌, డిక్షనరీ అటాక్‌, కుకీలను దొంగిలించడం వంటి వివిధ పద్ధతుల ద్వారా అకౌంట్ల హ్యాకింగ్‌, డీప్‌ఫేక్స్‌ వంటి మెషీన్‌ లెర్నింగ్‌ ఆధారంగా పనిచేసే విధానంలో మహిళలకు సంబంధించిన అభ్యంతరకరమైన వీడియోలు తయారు చేయడం వంటి సైబర్‌ నేరాలు ఎన్నో చోటు చేసుకుంటున్నాయి. వాటిని పక్కన పెడితే- దేశంలో జరుగుతున్న సైబర్‌ నేరాల్లో ఆర్థికపరమైనవే ఎక్కువగా ఉంటున్నాయి. 2020లో కరోనా విజృంభణ కారణంగా దేశవ్యాప్తంగా లక్షలసంఖ్యలో ఉపాధి కోల్పోయారు. ఇలాంటి వారిలో కొంతమంది సులభంగా డబ్బు సంపాదించేందుకు కొత్తగా ఆన్‌లైన్‌ నేరస్తులుగా అవతరించడం వల్ల గతంతో పోలిస్తే ఆర్థిక పరమైన సైబర్‌ నేరాలు నాలుగు రెట్లు పెరిగాయి.

అధికశాతం సైబర్‌ నేరాలు ఝార్ఖండ్‌, దిల్లీ, బిహార్‌, రాజస్థాన్‌ రాష్ట్రాల ద్వారా జరుగుతున్నాయి. అంతర్జాలంలో లభించే వ్యక్తుల ఫోన్‌ నంబర్ల డేటాబేస్‌ దిగుమతి చేసుకుని, బ్యాంకు ప్రతినిధుల ముసుగులో అమాయకులకు ఫోన్లు చేస్తూ పెద్దమొత్తంలో అకౌంట్లను ఖాళీ చేస్తున్నారు. కొన్ని ప్రాంతాల్లో నకిలీ కాల్‌సెంటర్లు నిర్వహిస్తూ, వందల మందిని నియమించుకుని, వారి ద్వారా అమాయకులకు వల వేస్తున్న తీరు- సైబర్‌ నేరాలు ఎంత వ్యవస్థీకృతంగా మారాయన్న దానికి నిదర్శనం. వివిధ బ్యాంకుల చిన్న స్థాయి ఉద్యోగులు, ఇ-కామర్స్‌ సంస్థల్లోని కొంతమంది ఉద్యోగులు తమ ఖాతాదారుల సమాచారాన్ని సైబర్‌ నేరస్తులకు అమ్ముకుంటున్నట్లూ విచారణలో బయట పడుతోంది.

ఇంతకాలం సైబర్‌ నేరాల విచారణ పోలీసులకు కత్తిమీద సాములా ఉండేది. బాధితుడు ఆలస్యంగా ఫిర్యాదు చేయడం, అప్పటికే ఇ-వాలెట్ల నుంచి నగదు ఖాతాలు మారిపోవడం వల్ల రికవరీ అసాధ్యంగా ఉండేది. అధిక శాతం సైబర్‌ నేరాలు శని, ఆదివారాల్లో జరుగుతుండటం వల్ల ఫిర్యాదులు చేయడానికి కూడా బాధితులకు ఇబ్బందికరంగా ఉండేది. కొన్ని నేరాల విచారణ కోసం రాజస్థాన్‌, బిహార్‌, ఝార్ఖండ్‌ వంటి రాష్ట్రాలకు మన తెలుగు రాష్ట్రాల పోలీసులు నేరుగా వెళ్తున్నారు. అక్కడి సిబ్బంది సహకారం లేకపోవడం, కొన్నిసార్లు స్థానికులు దాడులకు తెగబడటం వంటి ఘటనలు చోటుచేసుకుంటున్నాయి. ఇదిలా ఉంటే- మరోవైపు బాధితులు పోలీస్‌స్టేషన్‌కు వచ్చి ఫిర్యాదు చెయ్యడానికీ సంశయిస్తుండటం వల్ల తామేం చేసినా బాధితులు కిమ్మనరనే నమ్మకం నేరగాళ్లలో పెరుగుతోంది. ఇది నేరాలకు మరింత ఊతమిస్తోంది. విద్యావంతులు, చివరకు ఐటీ సంస్థల్లో కీలక స్థానాల్లో ఉన్నవారు సైతం అవగాహనా రాహిత్యంతో సైబర్‌ నేరాల బారిన పడుతుండటం ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది. ఇక సాంకేతిక పరిజ్ఞానంపై పెద్దగా అవగాహన లేని సామాన్యుల సంగతి చెప్పాల్సిన పని లేదు.

హెల్ప్‌లైన్‌ ఊరట

ఒక సైబర్‌ నేరం జరిగిన తరవాత పోలీసులను ఆశ్రయించడం కంటే నేరాల బారిన పడకుండా తగిన అవగాహన పొందడమన్నది అత్యంత ముఖ్యమైన ముందు జాగ్రత్త. ఈ విషయంలో ప్రభుత్వాలు, ప్రసార మాధ్యమాలు మరింత విస్తృతంగా అవగాహన కార్యక్రమాలు నిర్వహించాల్సిన అవసరం ఉంది. గత రెండేళ్లలోనే రూ.3,200 కోట్ల వరకు కేవలం సైబర్‌ నేరాల కారణంగా సామాన్యుల ఖాతాల నుంచి మాయమయ్యాయంటే పరిస్థితి తీవ్రతను అర్థం చేసుకోవచ్చు. ఇన్ని రకాల సవాళ్లున్న సైబర్‌ నేరాలను అదుపు చేయడానికి తాజాగా కేంద్ర హోం మంత్రిత్వ శాఖ అందుబాటులోకి తీసుకొచ్చిన 155260 హెల్ప్‌లైన్‌ నంబర్‌ కచ్చితంగా ఊరట కలిగిస్తుందని చెప్పవచ్చు.

ఇప్పటి వరకు దేశంలోని వివిధ ప్రాంతాల పోలీసుల మధ్య నెలకొన్న సమన్వయ లోపం కేంద్ర హోంశాఖ ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన 'భారత సైబర్‌ నేరాల సమన్వయ కమిటీ (ఐసీసీసీసీ)' ద్వారా తొలగిపోనుంది. బాధితులు వేగంగా స్పందించి, ఫిర్యాదు చేస్తే సైబర్‌ నేరగాళ్ల ఆనవాళ్లను త్వరగా పట్టుకోవడం, వారి ఖాతాలను, స్తంభింపజేయడం, నగదు రికవరీ చేయడం, తద్వారా బాధితులకు వ్యవస్థ మీద నమ్మకం కల్పించడం ఇప్పుడు సులభతరమవుతాయి. తాము పట్టుబడే అవకాశాలున్నాయని, తమ కార్యకలాపాలపై నిరంతర నిఘా ఉంటోందనే భయం పాత నేరగాళ్లను కట్టడి చేయడం సహా కొత్తగా ఎవరూ నేరాలకు పాల్పడకుండా నిరోధిస్తుంది. సామాన్యులు కష్టపడి సంపాదించుకుని తమ బ్యాంకు ఖాతాలో దాచుకున్న సొమ్ముకు రక్షణ కల్పించగలిగినప్పుడు ఆన్‌లైన్‌ లావాదేవీలను నిర్భీతితో, స్వేచ్ఛగా ప్రజలు నిర్వహించుకునే అవకాశం ఉంటుంది. ఆ దిశగా ప్రభుత్వం తీసుకున్న తాజా చర్య హర్షించదగినది.

తేలికగా ఆర్జన

వివిధ సైబర్‌ నేరాల కేసుల విచారణలో దిగ్భ్రాంతికరమైన వాస్తవాలు వెలుగు చూస్తుంటాయి. ఇలాంటి నేరాలకు పాల్పడుతున్న వారిలో సింహభాగం యుక్తవయస్కులు, కొంతమంది పదో తరగతి కూడా దాటని వారు ఉండటం విశేషం. ఇలా, నెలకు పది లక్షల రూపాయలకు పైగా సంపాదించుకునే వారున్నారు. గూగుల్‌ పే, ఫోన్‌పే, పేటీఎం వంటి వివిధ యూపీఐ వినియోగదారులను ఎలా బురిడీ కొట్టించాలి, నకిలీ ఖాతాదారుల సేవా నంబర్‌తో మోసాలు ఎలా చేయాలన్న అనేక అంశాల మీద యూట్యూబ్‌ వంటి మాధ్యమాల్లో మెలకువలు నేర్చుకుంటున్నారు. యూట్యూబ్‌ వంటి సంస్థలు ఇలాంటి వీడియోలను ఆదిలోనే అడ్డుకోకపోవడం పరోక్షంగా సైబర్‌ నేరగాళ్లు పుట్టుకొచ్చేందుకు దోహద పడుతున్నట్లవుతోంది. ఎలాంటి అడ్డదారులు తొక్కి అయినా, తక్కువ సమయంలో ఎక్కువ డబ్బు సంపాదించాలనే భావన ఇటీవల యువతరంలో కనిపిస్తోంది. దీంతో ఏమాత్రం కష్టపడకుండా భారీ మొత్తంలో డబ్బులు వచ్చి పడే అవకాశాలున్నాయన్న ఉద్దేశంతో సైబర్‌ నేరాల వైపు మొగ్గు చూపుతున్నారు.

- నల్లమోతు శ్రీధర్‌ (సైబర్‌, సాంకేతిక వ్యవహారాల నిపుణులు)

ఇదీ చదవండి :'పాజిటివిటీ 10%పైన ఉన్న జిల్లాల్లో కఠిన ఆంక్షలు'

ABOUT THE AUTHOR

...view details