ఎన్నో ఆకాంక్షలతో ముందుకెళ్తున్న ఈ దేశంలో విద్యా వ్యవస్థకు మరింత పదునుపెట్టడానికి కేంద్ర కేబినెట్ ఇటీవల ఆమోదించిన నూతన విద్యా విధానాన్ని ప్రతి ఒక్కరూ స్వాగతించాల్సిందే. విద్యావ్యవస్థను ప్రక్షాళించాలన్న కేంద్ర ప్రభుత్వ నిర్ణయం మెచ్చుకోదగ్గదే. డాక్టర్ కస్తూరిరంగన్ కమిటీ సూచించిన విద్యా విధానం... ప్రస్తుత వ్యవస్థలో సమూల మార్పులు తీసుకొస్తుంది. విద్యారంగంలో పెనుమార్పులకు శ్రీకారం చుడుతుంది.
యువత ఆలోచన ధోరణిలో వస్తున్న మార్పులను సరైన రీతిలో అంచనా వేసి కేంద్రం నూతన విద్యా విధానానికి అమోదం తెలిపింది. భారతీయ యువత విద్య కోసం ఇతర దేశాలకు వలస పోకుండా నిరోధించేందుకే నూతన విద్యా విధానాన్ని తీసుకొచ్చింది.
మాతృభాషకు పెద్దపీట
జాతీయ విద్యా విధానాన్ని అమలు చేయడం ద్వారా పాఠశాల నుంచి విశ్వవిద్యాలయ స్థాయి వరకు అనేక మార్పులు వస్తాయి. కనీసం 5వ తరగతి వరకు మాతృభాషలో విద్యను అందించాలని, వీలైతే ఉన్నత తరగతులకు విస్తరించాలని ప్రభుత్వం కేంద్రం సూచించడం గొప్ప విషయం. అనేక చిన్న దేశాలు తమ మాతృభాషలో బోధనా విధానాన్ని ప్రోత్సహించడం ద్వారా ఎంతో ప్రయోజనం పొందాయి. జపాన్, జర్మనీ, ఫ్రాన్స్, కొరియా, చైనా మొదలైన దేశాలు ఇందుకు మంచి ఉదాహరణలు.
డాక్టర్ కస్తూరిరంగన్ కమిటీ ఉన్నత విద్య కోసం ప్రతిపాదించిన మార్పులు విద్యార్థులు, పరిశోధకులకు ఎంతగానో దోహదపడతాయి. నూతన విద్యా విధానం ప్రకారం డిగ్రీ మూడు లేదా నాలుగు సంవత్సరాలు.. పీజీ ఒకటి లేదా రెండు సంవత్సరాలు ఉంటుంది. అయితే నాలుగు సంవత్సరాలు డిగ్రీ చదివే విద్యార్థి తన ఆసక్తిని బట్టి అతడు నేరుగా పీహెచ్డీలో చేరే అవకాశాన్ని కొత్త విధానం కల్పిస్తోంది. ఇంకా అనేక సౌలభ్యాలు నూతన విద్యా విధానంలో ఉన్నాయి.