తెలంగాణ

telangana

ETV Bharat / opinion

స్వావలంబనే ధ్యేయంగా.. జాతీయ వ్యూహం అవసరం! - స్వావలంబనే ధ్యేయంగా

కరోనా వైరస్ ప్రపంచ ఆర్థిక వ్యవస్థను పెనుమాంద్యంలోకి నెట్టేసింది. ఊహించని కష్టాల్ని తెచ్చిపెట్టిన మహమ్మారి మనం కచ్చితంగా స్వావలంబన సాధించాలన్న పాఠాన్ని నేర్పిదన్న ప్రధాని మోదీ వ్యాఖ్యలు అక్షర సత్యం. అవసరాల కోసం ఇతర దేశాల వైపు చూడకుండా.. స్వయం సమృద్ధి సాధించాలి. కరోనా విజృంభణ నేపథ్యంలో చైనా నుంచి తరలిపోవాలనుకొంటున్న విదేశీ సంస్థలను ఆకట్టుకోవడానికే కాదు, భారత ఆర్థిక వ్యవస్థను పునరుత్తేజితం చేసేందుకూ విస్తృత జాతీయ వ్యూహం అమలు అవసరం.

self-reliance
స్వావలంబనే ధ్యేయంగా

By

Published : Apr 27, 2020, 9:13 AM IST

దేశదేశాల వృద్ధిరేట్ల రెక్కలు విరిచి ప్రపంచార్థికాన్నే పెనుమాంద్యంలోకి నెట్టేస్తున్న కరోనా మహమ్మారి- పారిశ్రామిక, వర్ధమాన దేశాల అభివృద్ధి నమూనాల్లోని డొల్లతనాన్నే ఎండగడుతోంది. ‘ఊహించని కష్టాల్ని తెచ్చిపెట్టిన మహమ్మారి మనం కచ్చితంగా స్వావలంబన సాధించాలన్న పాఠాన్నీ నేర్పింది’ అన్న ప్రధాని మోదీ వ్యాఖ్య అక్షర సత్యం. మన అవసరాల కోసం బయటవారి వైపు చూడరాదన్నదే కరోనా సందేశమన్న ప్రధాని- గ్రామాలు, జిల్లాలు, రాష్ట్రాలు, మొత్తంగా దేశమూ స్వయంసమృద్ధి సాధించాలని పిలుపివ్వడం పూర్తిగా అర్థవంతం!

సమతులాభివృద్ధే..


విద్య వైద్యం ఆరోగ్యం లింగసమానత్వం- ఈ నాలుగూ మానవాభివృద్ధి సూచీలో దేశ ప్రమాణాల మెరుగుదలకు నిచ్చెనమెట్లు. మూడు లక్షల కోట్ల డాలర్ల ఆర్థిక వ్యవస్థగా ఎదుగుతున్న ఇండియా ఆ మౌలికాంశాలకు తగు ప్రాధాన్యం ఇవ్వకపోబట్టే ఏడు దశాబ్దాలుగా ప్రగతిరథ వేగం మందగించిందని చెప్పక తప్పదు. వ్యవసాయం, పరిశ్రమలు, సేవారంగాల సమతులాభివృద్ధే- ప్రగతి స్థిరకక్ష్యలో ఇండియాను నిలబెట్టగలిగేది. ఆర్థిక సంస్కరణల శకంలో వ్యవసాయం నిర్లక్ష్యానికి గురై, పరిశ్రమలకూ సరైన ఆదరణ దక్కకపోవడంతో స్థూలదేశీయోత్పత్తిలో సేవల రంగమే 55 శాతం ఆక్రమించింది. మొన్న ఫిబ్రవరి నాటికి 11 నెలల కాలంలో ఇండియా ఎగుమతులు 29,290 కోట్ల డాలర్లు; దిగుమతులు 43,603 కోట్ల డాలర్లకు చేరాయి. ఇలా చెల్లింపుల సమతూకం సమస్య ఎప్పుడూ ఉన్నదే. చక్కెర, వంటనూనెల వంటివాటినీ దిగుమతి చేసుకోవాల్సి రావడం దశాబ్దాలుగా నేతాగణాల దూరదృష్టి లోపమే. ఔషధాల ఉత్పత్తిలో ప్రపంచంలోనే మూడోస్థానంలో ఉన్న ఇండియా, ముడిపదార్థాల కోసం చైనాపై ఆధారపడాల్సి రావడమే దురదృష్టకరం. ఈ అవ్యవస్థ రూపుమాసిపోయేలా స్వయంసమృద్ధి వ్యూహాలు పట్టాలకెక్కాలి!

విస్తృత జాతీయ వ్యూహం అమలు కావాలి!

వ్యవసాయం తయారీ రంగాల్లో నిలదొక్కుకున్న దేశాలు ఎంత అద్భుతంగా రాణిస్తాయో జనచైనా అనుభవమే చాటుతోంది. అంచెలవారీగా మార్కెట్‌ ఆర్థికాన్ని విస్తరిస్తూ ప్రపంచానికే తయారీ కేంద్రంగా ఎదిగిన చైనా పట్ల కొవిడ్‌ సంక్షోభ నేపథ్యంలో అమెరికా, బ్రిటన్‌, జపాన్‌లకు చెందిన దిగ్గజ సంస్థలు విముఖత చూపుతున్న తరుణమిది. చైనా నుంచి తరలిపోవాలనుకొంటున్న విదేశీ సంస్థలను ఆకట్టుకోవడానికే కాదు, భారత ఆర్థిక వ్యవస్థను పునరుత్తేజితం చేసేందుకూ విస్తృత జాతీయ వ్యూహం అమలు కావాలి! జాతి ఆహార భద్రతకే కాదు పౌష్టికాహార లోపాల్ని సరిదిద్ది ఆరోగ్య సూచీల్ని మెరుగుపరచే సంజీవనిగా వ్యవసాయానికి ప్రభుత్వపరంగా ఇతోధిక ప్రాధాన్యం దక్కాలి. ఆధునిక అధికోత్పాదన ప్రయోగశాలలుగా వ్యవసాయ క్షేత్రాల్ని మలచి లాభదాయకతకు సర్కార్లు భరోసా ఇస్తే- వేలకోట్ల డాలర్లు ధారపోసి దిగుమతులు చేసుకొనే దౌర్భాగ్యం తప్పుతుంది. స్థూల దేశీయోత్పత్తిలో 16 శాతానికి అటూఇటూగా ఉన్న తయారీరంగం వాటాను 2022నాటికి 25 శాతానికి విస్తరించాలన్న లక్ష్యానికి మేలుబాటలూ ఇప్పుడే పడాలి. కొవిడ్‌ సంక్షోభంలో కూరుకొన్న 40కోట్లమంది అసంఘటిత రంగ కార్మిక శక్తి జీవికకు ఆలంబనగా- ఆయా రంగాల్లో స్వయంసమృద్ధే ధ్యేయంగా పారిశ్రామిక విధానాలు పదునుతేలాలి!

జౌళి, వస్త్రాలు, రసాయనాలు, ఔషధాలు, ఎలక్ట్రానిక్స్‌, వ్యవసాయం-ఆహారశుద్ధి, ఇంజినీరింగ్‌, తోలు తదితర రంగాలవారితో తయారీరంగంలో స్వయంసమృద్ధి అవకాశాలపై నెలరోజుల క్రితమే తర్కించిన ప్రభుత్వం- విస్పష్ట కార్యాచరణ వ్యూహంతో కదలాలి. దేశార్థికానికి దన్నుగా ఉన్న చిన్న మధ్యతరహా పరిశ్రమల్ని సరఫరా గొలుసులో అంతర్భాగం చేసి ఉపాధి అవకాశాలకు పెద్దపీట వెయ్యాలి. కొవిడ్‌ సవాలును గొప్ప అవకాశంగా మలచుకొని ప్రగతిశీల భారతావని కోసం పట్టుదలతో పరిశ్రమించాలి!

ABOUT THE AUTHOR

...view details