భారత సైన్యం పట్టుసడలని సంకల్పం, ప్రాణాలను తోడేసే చలి, రవాణా సమస్యలు.. చైనా పీపుల్స్ లిబరేషన్ ఆర్మీ(పీఎల్ఏ) భారత్‌కు తలవంచడానికి గల కారణాలు తరచిచూస్తే కనిపించేవి ఇవే. తనకు అనుకూలించని పరిస్థితుల్లోనూ మేకపోతు గాంభీర్యం ప్రదర్శించిన చైనా సైన్యం.. ఈ సమస్యలను తట్టుకోలేకపోయింది. భారత బలగాల ముందు డ్రాగన్ సైనికుల స్థైర్యం నీరుగారిపోయింది. ఇక తప్పని పరిస్థితుల్లో వెనక్కి తగ్గకుండా ఉండలేకపోయింది. ద్వైపాక్షిక అంగీకారం ప్రకారం ప్రతిష్టంభనకు తెరదించేందుకు ముందుకొచ్చింది.
గత బుధవారం(ఫిబ్రవరి 10న) బలగాల ఉపసంహరణ ప్రారంభమైంది. సైన్యాన్ని వెనక్కి తీసుకుంటున్నట్టు డ్రాగన్ బుధవారం ప్రకటించగా.. ఆ తర్వాతి రోజు పార్లమెంట్ వేదికగా రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ ఈ విషయాన్ని ధ్రువీకరించారు. దీని ప్రకారం భారత బలగాలు ఫింగర్ 3-4 మధ్య ఉన్న 'ధన్సింగ్ థాపా పోస్టు' వద్దకు చేరుకుంటాయి. చైనా దళాలు ఫింగర్ 8 వెనక్కు వెళ్లిపోతాయి.
ఆ మాస్టర్ స్ట్రోక్ వల్లే!
చలి, రవాణా సమస్యలను పక్కనబెడితే భారత్ ఇచ్చిన ఓ మాస్టర్ స్ట్రోక్ చైనాను ఉక్కిరిబిక్కిరి చేసింది. డ్రాగన్ ఊహించని ఆ పరిణామమే సరిహద్దులో భారత్ పైచేయి సాధించేందుకు కారణమైంది. పాంగాంగ్ నది దక్షిణ తీరంలో ఉన్న రెండు పర్వతాలను ప్రత్యేక సరిహద్దు దళం(స్పెషల్ ఫ్రాంటియర్ ఫోర్స్-ఎస్ఎఫ్ఎఫ్) తమ అధీనంలోకి తీసుకోవడం వల్ల.. చైనా నివ్వెరపోయింది. వ్యూహాత్మక ప్రాంతాల్లో పట్టు సాధించడం.. ఆ దేశానికి ప్రతికూలంగా మారింది.
ఇదీ చదవండి:బలగాల ఉపసంహరణ: చైనా ఉచ్చులో భారత్?
ఒకే ఒక్క ఎత్తుగడతో భారత సైన్యం కీలక స్థానాల్లో పాగా వేసిందని. బ్లాక్ టాప్, హెల్మెట్(రెండు ఎత్తైన శిఖరాలు)పై పట్టు సాధించిందని లద్దాఖ్‌లోని 14 కార్ప్స్కు నేతృత్వం వహించిన విశ్రాంత ఆర్మీ అధికారి ఈటీవీ భారత్‌తో చెప్పారు. సైన్యంలో జనరల్ హోదాలో పనిచేసిన ఆయనకు ఇక్కడి పరిస్థితులపై పూర్తి అవగాహన ఉంది.
"భౌగోళికంగా చూస్తే గురుంగ్ పర్వతాలు, క్యామెల్ బ్యాక్ ప్రాంతాలు మా ఆధీనంలోకి వచ్చాయి. సరస్సు మధ్యలో ఉండే గుర్రపు జీను వంటి ప్రాంతంతో పాటు మోల్డోలోని పీఎల్ఏ బేస్, స్పాంగుర్ సరస్సు పూర్తిగా భారత సైన్యం కనుసన్నల్లోనే ఉంటాయి. మోల్డో పీఎల్ఏ బేస్‌కు వచ్చే రహదారిని సైతం స్పష్టంగా చూసే అవకాశం ఉంటుంది. స్పాంగుర్ గ్యాప్ దక్షిణాన సైన్యం పటిష్ఠ స్థితిలో ఉంది. భారత్ ఈ ప్రాంతాలను ఆక్రమించుకున్న తర్వాత తాను మోసపోయిన విషయాన్ని చైనా గ్రహించింది. నాలుగు కి.మీ మేర చైనా భూభాగంలోకి మనం(భారత సైన్యం) చొచ్చుకెళ్లామని గ్లోబల్ టైమ్స్‌లో ఆరోపించింది. నాలుగు కిలోమీటర్ల లోపల అంటే.. చుషూల్ లోయ మొత్తం తమదే అన్న వాదన మొదలుపెట్టింది. ఇంతకు ముందెప్పుడూ ఇలాంటి వాదన చేయలేదు. దీన్ని బట్టి భారత్ తీసుకున్న నిర్ణయంతో వారు ఆందోళనకు గురయ్యారని స్పష్టమైంది. నిజానికి పాంగాంగ్ ఉత్తర తీరం, ఫింగర్ ప్రాంతాలతో పోలిస్తే దక్షిణ తీరంలోని ఎత్తైన ప్రాంతాలే వ్యూహాత్మకంగా కీలకం."
-ఈటీవీ భారత్‌తో విశ్రాంత సైనిక అధికారి
దక్షిణ తీరంలో భారత్ చేజిక్కించుకున్న ప్రాంతాల్లో రెజంగ్ లా సైతం ఉంది. 1962లో ఇరుదేశాల మధ్య యుద్ధం జరిగింది ఇక్కడే. ఆ తర్వాత తొలిసారి ఈ ప్రాంతాన్ని భారత సైన్యం తమ అధీనంలోకి తీసుకుంది. 'రెజంగ్ లా', 'రైచెన్ లా'లు కైలాశ్ పర్వతశ్రేణి ప్రారంభమయ్యే ప్రాంతాల్లో ఉంటాయి. సరిహద్దు ప్రతిష్టంభన విషయంలో పాంగాంగ్ ఉత్తర తీరంలోని ఫింగర్లపైనే ఎక్కువగా చర్చించుకున్నప్పటికీ.. వాటితో పోలిస్తే ఈ ప్రాంతాలే వ్యూహాత్మకంగా కీలకమైనవి.
ఇదీ చదవండి:ప్రణాళికపరంగా భారత్-చైనా బలగాల ఉపసంహరణ
పాంగాంగ్ సరస్సుకు ఉత్తర-దక్షిణ తీరాల్లో భూమి చొచ్చుకువచ్చినట్లు ఉండే భాగాలనే ఫింగర్లు అంటారు. మొత్తం ఎనిమిది ఫింగర్లు ఉంటాయి. చైనా-భారత్ సరిహద్దు రేఖ అయిన ఎల్ఏసీ ఫింగర్ 8 గుండా వెళ్తుందని భారత్ భావిస్తోంది. కానీ చైనా మాత్రం ఫింగర్ 3 వరకు ఉన్న భూభాగం తమదేనని వాదిస్తోంది. గతంలో పీఎల్ఏ సైన్యం ఫింగర్ 8 వద్ద ఉండి, ఫింగర్ 4 వరకు పెట్రోలింగ్ నిర్వహించేది. భారత సైన్యం ఫింగర్ 4 నుంచి ఫింగర్ 8 వరకు గస్తీ కాసేది.
(సంజీవ్ కే బారువా, సీనియర్ జర్నలిస్ట్)
ఇవీ చదవండి: