తెలంగాణ

telangana

ETV Bharat / opinion

ప్రపంచాన్ని కమ్ముకొన్న నాయకత్వ శూన్యత - కరోనా తీరే

అంతర్జాతీయ సమాజాన్ని కరోనా కమ్మేసింది. ఈ సమయంలో కొందరు నాయకులు ప్రవర్తిస్తున్న తీరు దిగ్భ్రాంతి కలిగిస్తోంది. దీర్ఘదృష్టి లేకపోవడం వల్ల ప్రపంచంలో నాయకత్వ శూన్యత ఆవహించింది. సమాజ ప్రయోజనాలతోనే స్వీయ ప్రయోజనాలు ముడివడిఉన్నాయన్న మౌలిక అవగాహన కొరవడిన కొన్ని దేశాల తీరు నివ్వెరపరుస్తోంది. మనిషి, మానవత్వం గురించి తెలిసిన నాయకులు ఈ ప్రపంచానికి నేడు అత్యవసరం.

The leadership vacuum that pervades the world
ప్రపంచాన్ని కమ్ముకొన్న నాయకత్వ శూన్యత

By

Published : Aug 11, 2020, 10:45 AM IST

కొందరు చేసిన పాపాలవల్ల యావత్‌ ప్రపంచం తీవ్రమైన సమస్యలు, సంక్షోభాలు ఎదుర్కొంటున్న సందర్భం బహుశా ఇదొక్కటేనేమో! కరోనా కరాళకేళి అంతర్జాతీయ సమాజాన్ని అతలాకుతలం చేస్తోంది. దీర్ఘదృష్టిలేని, సమాజక్షేమం పట్టని నాయకుల ఏలుబడిలో దేశాలెన్నో మహమ్మారికి చిక్కి విలవిల్లాడుతున్నాయి. ప్రపంచాన్ని నాయకత్వ శూన్యత పట్టిపీడిస్తోంది. అందుకే చేయాల్సింది చేయకుండా చేతులు ముడుచుకు కూర్చుని ఏదైనా అద్భుతం జరిగితే బాగుండునని, ఎవరైనా ఆర్థిక సాయం ప్రకటిస్తే భేషుగ్గా ఉంటుందని కొందరు అంగలార్చే పరిస్థితులు దాపురించాయి. అలాంటి అద్భుతాలు జరిగేవి కావు... ఆర్థిక సాయాలూ అందేవి కావు!

రెండు కోట్లు

ప్రపంచవ్యాప్తంగా 215 దేశాలు లేదా ప్రాంతాల్లో కరోనా కేసులు ఇప్పుడు రెండు కోట్లు దాటాయి. మరణాలు ఏడు లక్షల 35 వేలకు చేరువలో ఉన్నాయి. బాధితుల్లో కోటీ 29 లక్షలకుపైగా క్రమంగా కోలుకున్నారు. మహమ్మారి బారినపడి కోలుకున్నవారిలో ‘యాంటీబాడీ’లు ఎక్కువకాలం నిలబడటం లేదన్న అధ్యయనాలు ఆందోళన కలిగిస్తున్నాయి. కరోనా ఏటా దాడి చేసే అవకాశాలు కొట్టిపారేయలేమని, అది సాధారణ జలుబులా మారి తరచూ ఇబ్బంది పెట్టవచ్చునన్న విశ్లేషణలూ కలవరపెడుతున్నాయి. 22లక్షల 20వేలకు మించిన కేసులతో అమెరికా, బ్రెజిల్‌ల తరవాత మనదేశం మూడోస్థానంలో నిలవడం తీవ్ర ఆందోళన కలిగిస్తున్న అంశం. దాదాపు 45వేల మరణాలతో జాబితాలో అమెరికా, బ్రెజిల్‌, మెక్సికో, యూకేల తరవాత అయిదో స్థానంలో భారత్‌ ఉంది.

మాంద్యం కన్నా పెద్ద సమస్య

పన్నెండేళ్ల క్రితం అప్పటి ఆర్థిక మాంద్యంతో పోలిస్తే కరోనా ఇప్పుడు చాలా పెద్ద సమస్యగా మనముందుంది. అయినా ఏ ఒక్క దేశమూ ఉమ్మడి ప్రణాళిక గురించి మాట్లాడటం లేదు. కరోనా కట్టడికి అంతర్జాతీయ స్థాయిలో ఏకోన్ముఖ వ్యూహం అవసరం అన్నమాటే దిక్కులేనిదైంది. ఏమిటిది... లోపం ఎక్కడుంది? జి-20 దేశాలు ఈ ఏడాది మార్చి చివరిలో సమావేశం కావడానికి ముందే- కరోనా కట్టడిపై ఉమ్మడి ప్రణాళిక గురించి సదస్సులో ప్రధానంగా చర్చించాలని ఐక్యరాజ్య సమితి ప్రధాన కార్యదర్శి ఆంటోనియో గుటెరస్‌ అభ్యర్థించారు. ఆయన విజ్ఞప్తిపై ఎటువైపునుంచీ చడీచప్పుడూ లేదు. దేశాలన్నీ గుంభనంగా ఉండిపోయాయి. ప్రపంచం ఎదుర్కొంటున్న ఆరోగ్య, ఆర్థిక సంక్షోభాలపై సమన్వయ, సహకారాలు అత్యవసరమని, ఆ వైపు కదలాల్సిన చారిత్రక అవసరం ఉరుముతోందని ఈ ఏడాది ఏప్రిల్‌ ఆరున ‘సమితి’ మాజీ సెక్రెటరీ జనరల్‌ బాన్‌కీ మూన్‌తోపాటు 164 దేశాలకు చెందిన మాజీ అధ్యక్షులు, ప్రస్తుత ప్రధానులు, భిన్న రంగాలకు చెందిన ప్రముఖులు, శాస్త్రవేత్తలు గళం వినిపించారు. ఆ నాయకుల విజ్ఞప్తులు, పిలుపులు సమాధానం లేనివిగానే మిగిలిపోయాయి.

నాయకత్వ శూన్యతను ఎత్తిచూపిన గుటెరస్!

‘కొవిడ్‌’ చుట్టూ రాజకీయాలు పులమడం సమస్యకు పీటముడి వేస్తోందని, మహమ్మారిపై ఉమ్మడి పోరాటానికి ఏ ఒక్క దేశమూ చొరవ చూపించకపోవడం, దాదాపు అంతటా నాయకత్వ శూన్యత ఆవరించడం ప్రస్తుతం కరోనాను మించి భయపెడుతున్న సమస్య అని ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్‌ఓ) డైరెక్టర్‌ జనరల్‌ టెడ్రోస్‌ అధనోమ్‌ ఇటీవల చేసిన వ్యాఖ్యలు అక్షర సత్యాలు. ‘అమెరికా-చైనాల మధ్య సఖ్యత లేదు. రష్యా-అమెరికాల నడుమ సంబంధాలు అంతంత మాత్రంగా ఉన్నాయి. అర్థవంతమైన నిర్ణయాలు తీసుకోకుండా, ప్రభావపూరిత చర్యలతో ముందడుగు వేయకుండా భద్రతామండలికి అడ్డుపడుతున్న సమస్యలివి’- రెండు నెలల క్రితం జాన్‌ గుటెరెస్‌ వెలిబుచ్చిన ఈ అభిప్రాయం ప్రపంచం నాయకత్వ శూన్యతలో కొట్టుమిట్టాడటానికిగల కారణాలను సూటిగా ఎత్తిచూపింది.

ముందుకు రారా?

చైనాకు వంతపాడుతోందన్న కారణంతో ఈ ఏడాది ఏప్రిల్‌లో అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌ డబ్ల్యూహెచ్‌ఓకు నిధుల సాయం నిలిపివేశారు. ఆ సంస్థనుంచి తాము వైదొలగుతున్నట్లూ ప్రకటించారు. ప్రపంచం కరోనా గుప్పిట చిక్కి అల్లాడుతున్న తరుణంలోనే అమెరికాలో నల్లజాతీయుల నిరసనలు భగ్గుమన్నాయి. జాతి, లింగ, వర్గ, ప్రాంతం ఆధారిత దుర్విచక్షణలు అడ్డూ ఆపూ లేకుండా పేట్రేగుతున్నాయి. అసమానతల జడిలో చిక్కి ప్రపంచం ఉక్కిరిబిక్కిరవుతోంది. కరోనా మహమ్మారి ధాటికి అతలాకుతలమైన పేద దేశాలకు చేయూత అందించేందుకు సంపన్న దేశాలు ఉదారంగా ముందుకు రాకపోవడం దిగ్భ్రాంతి కలిగించే పరిణామం. సమాజ ప్రయోజనాలతోనే స్వీయ ప్రయోజనాలు ముడివడిఉన్నాయన్న మౌలిక అవగాహన కొరవడిన కొన్ని దేశాల తీరు నివ్వెరపరుస్తోంది. మనిషి, మానవత్వం గురించి తెలిసిన నాయకులు ఈ ప్రపంచానికి నేడు అత్యవసరం. అవును... నాయకత్వ శూన్యతే ఇప్పుడు ఈ ప్రపంచాన్ని కరోనాకన్నా ఎక్కువగా బెంబేలెత్తిస్తున్న సమస్య!

- ఆర్‌.కె.మిశ్రా

(రచయిత- ప్రముఖ పాత్రికేయులు)

ఇదీ చదవండి:ఉపరాష్ట్రపతిగా వెంకయ్యనాయుడు మూడేళ్లు పూర్తి

ABOUT THE AUTHOR

...view details