స్వతంత్ర భారత నిర్మాతలు ఈ దేశ సామాజిక, ఆర్థిక అభ్యున్నతికి తోడ్పడే సాధనంగా రాజ్యాంగాన్ని మలిచారు. సంకుచిత రాజకీయ ప్రయోజనాల కోసం ప్రాథమిక హక్కులు, స్వేచ్ఛలను పణంగా పెట్టే అవకాశం లేకుండా పలు జాగ్రత్తలు తీసుకున్నారు. భారతదేశ సంక్లిష్టతలను దృష్టిలో పెట్టుకుని శాసన, న్యాయ, కార్యనిర్వాహక వ్యవస్థల మధ్య అధికారాలను విభజించడం ఈ జాగ్రత్తల్లో కీలకమైనది. రాజ్యాంగాన్ని 22 విభాగాలుగా రూపొందించి, వివిధ వ్యవస్థల అధికారాలు, పని విధానాల గురించి సవివరంగా ఉల్లేఖించారు. ఇంతటి శ్రద్ధ తీసుకోవడంవల్లనే భారత రాజ్యాంగ రచనకు రెండు సంవత్సరాల 11 నెలల 17 రోజులు పట్టింది. అదే అమెరికా రాజ్యాంగ రూపకల్పన కేవలం నాలుగు నెలల్ల్లో పూర్తయింది. అనేక పాశ్చాత్య దేశాల్లో అనుసరిస్తున్న సమాఖ్య వాదానికి భిన్నమైనది మన దేశంలో కనిపిస్తుంది. రాజ్యాంగంలోని 11వ విభాగం పూర్తిగా కేంద్ర-రాష్ట్ర సంబంధాలపైనే దృష్టి కేంద్రీకరించింది. ఈ విభాగం కేంద్ర ప్రభుత్వానికే ఎక్కువ అధికారాలు ఇచ్చింది.
పెరుగుతున్న జోక్యం
కేంద్రం, రాష్ట్రాల మధ్య శాసన, కార్యనిర్వాహక అధికారాలను విభజించడం, భారత రాజ్యాంగ విశిష్ట గుణమని డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ 1949లో ఉద్ఘాటించారు. ఉమ్మడి జాబితాలోని అంశాలపై రాష్ట్రాలకన్నా కేంద్రానికే ఎక్కువ అధికారాలు ఉన్నాయి. కేంద్ర, రాష్ట్ర, ఉమ్మడి జాబితాల్లో చేర్చని అంశాలపై చట్టాలు చేసే అధికారాన్నికూడా రాజ్యాంగం కేంద్ర ప్రభుత్వానికే ఇచ్చింది. కానీ, కేంద్రం ఇంతగా రాష్ట్రాల అధికారాల్లోకి చొరబడుతుందని రాజ్యాంగ నిర్మాతలు ఊహించలేదు. కేంద్రం, రాష్ట్రాలు రాజ్యాంగాన్ని మనసావాచా కర్మణా ఆచరిస్తాయని వారు భావించారు. మూడో రాజ్యాంగ అధికరణను కేంద్రం ఎన్నటికీ ప్రజాభీష్టానికి విరుద్ధంగా ఉపయోగించదని సర్దార్ పటేల్ 1949లో రాజ్యాంగ నిర్మాణ సభకు హామీ ఇచ్చారు. కానీ, కేంద్ర ప్రభుత్వాలు ఆ హామీని పదేపదే ఉల్లంఘిస్తూ వచ్చాయి.
సీబీఐ దర్యాప్తునకు అనుమతి నిరాకరించిన తాజా రాష్ట్రం పంజాబ్. దీనికి ముందు పశ్చిమ్ బంగ, కేరళ, మహారాష్ట్ర, ఝార్ఖండ్, రాజస్థాన్, ఛత్తీస్‌గఢ్ సీబీఐకి అనుమతి నిరాకరించాయి. ఇవన్నీ ప్రతిపక్షపాలిత రాష్ట్రాలు. గతంలో వేర్వేరు సమయాల్లో ఆంధ్రప్రదేశ్, త్రిపుర, మిజోరం సైతం అనుమతి నిరాకరించాయి. సీబీఐ స్థాపన, నిర్వహణకు సంబంధించి కేంద్ర చట్టమేదీ లేదు. 1946నాటి దిల్లీ ప్రత్యేక పోలీసు సంస్థాపన చట్టం (డీపీఎస్‌ఈ) ద్వారా సీబీఐ ఏర్పడింది. 1861నాటి పోలీసు చట్టంలో దిల్లీ, కేంద్ర పాలిత ప్రాంతాల దర్యాప్తు అవసరాలకు సంబంధించిన క్లాజులు ఏమీ లేకపోవడంతో ఈ ప్రత్యేక చట్టం అవసరం ఏర్పడింది. కేంద్ర ప్రభుత్వం ఏదైనా రాష్ట్రంలో దర్యాప్తునకు ఆదేశించినా, సీబీఐ ఆ రాష్ట్ర అనుమతి తీసుకోవాలని డీపీఎస్‌ఈ లో ఆరో సెక్షన్ నిర్దేశిస్తోంది. ఇది ప్రతి కేసుకూ వర్తిస్తుంది. రాష్ట్ర ప్రభుత్వం అనుమతించకపోతే సీబీఐ అధికారులకు 1973 క్రిమినల్ ప్రొసీజర్ కోడ్ కింద పోలీసు అధికారులకు ఉండే దర్యాప్తు అధికారాలు లేకుండా పోతాయి. అలాంటప్పుడు రాష్ట్ర హైకోర్టు కానీ, సుప్రీంకోర్టు కానీ ఆదేశించిన కేసులను మాత్రమే సంబంధిత రాష్ట్రాల్లో సీబీఐ దర్యాప్తు చేయగలుగుతుంది. నిజమైన రాజ్యాంగ స్ఫూర్తితో చూస్తే రాష్ట్రాలు సీబీఐ దర్యాప్తునకు అనుమతి ఉపసంహరించడం సబబు అనిపించుకోదు. ఇది కేంద్ర-రాష్ట్ర సంబంధాలకూ ప్రతికూలం. ఏదైనా కేసును ఏకకాలంలో అనేక రాష్ట్రాల్లో దర్యాప్తు చేయవలసి వచ్చినప్పుడు అది సీబీఐ ద్వారానే సాధ్యమవుతుంది. ఒక రాష్ట్ర పోలీసు అధికారులకు వేరే రాష్ట్రంలో పూర్తి దర్యాప్తు అధికారాలు ఉండవు. అదీ కాకుండా ప్రతి రాష్ట్ర పోలీసు శాఖ ఆ రాష్ట్ర ప్రభుత్వ కనుసన్నల్లో నడుచుకోవలసి వస్తుంది. అక్కడ అధికారంలో ఉన్న రాజకీయ పార్టీ ప్రభావం దాని మీద జాస్తి. మరోవైపు సీబీఐ కేంద్రంలో అధికారంలో ఉన్న రాజకీయ పార్టీ లేదా కూటమి అవసరాలకు తగ్గట్టుగా నడుచుకొంటుందనే విమర్శలు ఎక్కువవుతున్నాయి. కేంద్ర ప్రభుత్వానికి ఇష్టులైనవారి మీద దర్యాప్తును నత్తనడకగా సాగిస్తూ, ప్రత్యర్థుల మీద మాత్రం ఒంటి కాలి మీద లేస్తోందని సీబీఐపై ఆరోపణలు ఉన్నాయి.