అంతరిక్ష ప్రయోగాల్లో భారత్ ప్రత్యేకత చాటుకుంటోంది. ప్రపంచ దేశాలకు పోటీగా భారత అంతరిక్ష పరిశోధన సంస్థ(ఇస్రో) ఇప్పటికే తక్కువ ఖర్చుతో మంగళయాన్ ప్రయోగం చేపట్టి విజయవంతం చేసింది. అలాగే ఏ దేశానికీ సాధ్యం కాకపోయినా- చంద్రుడి దక్షిణ ధ్రువ కక్ష్యలోకి రోవర్‌ను పంపేందుకు ప్రయత్నాలు చేసి 98 శాతం విజయవంతమైంది. దాంతోపాటు ఒకే రాకెట్ ద్వారా 104 ఉపగ్రహాలను నిర్ణీత కక్ష్యలో ప్రవేశపెట్టింది!
ఇదీ జర్నీ...
1969 ఆగస్టు 15న బెంగళూరు కేంద్రంగా భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) ఆవిర్భవించింది. అప్పటి ప్రధానమంత్రి జవహర్‌లాల్ నెహ్రూ, శాస్త్రవేత్త విక్రమ్ సారాభాయ్‌ల చొరవతో ఇస్రోకు రూపకల్పన జరిగింది. అనంతర కాలంలో ప్రొఫెసర్ సతీశ్ ధావన్; క్షిపణి పితామహుడు, మాజీ రాష్ట్రపతి అబ్దుల్ కలాం వంటి మేధావుల పాత్ర ఎంతో ఉంది.
భారత అంతరిక్ష పరిశోధన సంస్థ ఏర్పాటై 50 ఏళ్లు దాటింది. అంతరిక్ష పరిజ్ఞానాన్ని సామాన్యుల చెంతకు చేర్చాలని ఇస్రో ఎన్నో ప్రయత్నాలు చేస్తోంది. ఈ క్రమంలో ఏటా అక్ట్టోబరులో దేశవ్యాప్తంగా వారం రోజులపాటు అంతరిక్ష వారోత్సవాలు జరుపుతోంది. ఈ దఫా కరోనా సవాళ్లను అధిగమించి ఆన్‌లైన్ మాధ్యమాల సాయంతోనే.. వెబినార్ల ద్వారా అంతరిక్ష వారోత్సవాలు నిర్వహిస్తోంది.
భారత్, రష్యా, చైనా, అమెరికా, జపాన్ తదితర దేశాలు అంతరిక్ష ప్రయోగాల్లో పోటీ పడుతున్నాయి. ఈ ప్రయోగాలు సత్ఫలితాలనిస్తున్న నేపథ్యంలో- అంతరిక్ష విజ్ఞానాన్ని ప్రజలందరికీ తెలియజేయాలని ఐక్యరాజ్య సమితి తలపెట్టింది. ఇందుకుగాను ప్రపంచ అంతరిక్ష వారోత్సవ సంరంభాన్ని ప్రారంభించింది.
ప్రపంచవ్యాప్తంగా ఏటా అక్టోబరు 4 నుంచి పది వరకు వారం రోజులపాటు ఈ ఉత్సవాలను సుమారు 70దేశాల్లో జరుగుతున్నాయి. అక్టోబరులోనే ఈ వారోత్సవాలను నిర్వహించేందుకు కారణం లేకపోలేదు. రష్యా(ఒకప్పటి సోవియట్ యూనియన్) 1957 అక్టోబరు 4న స్పుత్నిక్-1 అనే మొట్టమొదటి మానవ నిర్మిత ఉపగ్రహాన్ని అంతరిక్షంలోకి పంపింది.
ఆ తరవాత పదేళ్లకు 1967 అక్టోబరు 10న అంతరిక్ష విజయాలను శాంతియుత మానవ ప్రయోజనాల కోసమే వినియోగించాలని ఐక్యరాజ్యసమితి తీర్మానించింది.
ఈ రెండింటికి ఓ ప్రత్యేకత ఉండటం వల్ల ఆ తేదీల్లోనే ప్రపంచవ్యాప్తంగా అంతరిక్ష వారోత్సవాలు నిర్వహించేలా ఐక్యరాజ్యసమితి నిర్ణయించింది. ప్రపంచ అంతరిక్ష వారోత్సవ సంస్థ 'ఉపగ్రహాల జీవితకాలం పొడిగింపు' అనే నినాదంతో ఈ ఏడాది ఉత్సవాల నిర్వహణకు శ్రీకారం చుట్టింది.