తెలంగాణ

telangana

ETV Bharat / opinion

విద్యా ప్రణాళికే ప్రగతికి చుక్కాని.. కానీ సవాళ్లెన్నో!

దేశాభివృద్ధిలో విద్యా విధానాలు కీలక భూమిక పోషిస్తాయి. సుమారు మూడు దశాబ్దాల అనంతరం భారతీయ విద్యా విధానంలో సంస్కరణలకు శ్రీకారం చుట్టింది కేంద్రం. విద్యారంగంలో పెద్దయెత్తున పెట్టుబడులు పెట్టడానికి సన్నద్ధమవడం, విద్యాసంస్థల స్వీయ నియంత్రణకు ప్రాధాన్యం ఇవ్వడం వంటి అంశాలు బాగున్నా.. విద్యా విధాన దార్శనిక ప్రకటనలో నాణ్యతను పెంచేందుకు విస్పష్ట ప్రణాళికను విస్మరించారు. అయితే.. నూతన జాతీయ విధానం అమలుకు అవసరమైన ఆరు శాతం బడ్జెట్‌కు ప్రభుత్వం కట్టుబడి; సహేతుక ప్రణాళికలు, ఆచరణాత్మక వైఖరితో ముందడుగేస్తేనే భవిష్యత్‌ సవాళ్లకు దీటుగా భారతీయ యువత సంసిద్ధమవుతుంది.

The implemation of New Educational Policy is likely to face many challenges
విద్యా ప్రణాళికే ప్రగతికి చుక్కాని

By

Published : Sep 7, 2020, 7:50 AM IST

ఒక దేశ అభివృద్ధి క్రమంలో నాణ్యమైన విద్యావిధానాలు కీలక పాత్ర పోషిస్తాయి. దాదాపు మూడు దశాబ్దాల తరవాత జాతీయ విద్యా విధానంలో సంస్కరణలకు తెరతీశారు. ప్రాథమిక స్థాయిలో మాతృభాషలోనే విద్యాభ్యాసం సాగాలని దిశానిర్దేశం చేయడం, ఉన్నత చదువులకు సంబంధించి ప్రాథమ్యాలనుబట్టి పాఠ్యాంశాలు ఎంపిక చేసుకునే వెసులుబాటును విద్యార్థులకు కల్పించడం, విద్యారంగంలోకి పెద్దయెత్తున ప్రైవేటు పెట్టుబడులకు తెరచాపలెత్తడం, విద్యాసంస్థల స్వీయ నియంత్రణకు ప్రాధాన్యం ఇవ్వడం వంటి అంశాలు ఎంతగానో ఆహ్వానించదగినవి. జాతీయ నూతన విద్యా విధాన దార్శనిక ప్రకటనలో చదువుల నాణ్యత గురించి ప్రస్తావించారుగానీ- దాన్ని పెంచేందుకు సుస్పష్ట ప్రణాళికలను మాత్రం వివరించలేదు.

బడుగు వర్గాలకు చెందిన విద్యార్థుల సామాజిక ఆర్థిక స్థితిగతుల దృష్ట్యా వారికి ఏ విధంగా తోడ్పాటు అందించాలన్న విషయాన్నీ ఇందులో విస్మరించారు. వచ్చే 15 ఏళ్లకు దేశంలో పూర్తి అక్షరాస్యత సాధన, ఉన్నత విద్యలో స్థూల నమోదు నిష్పత్తిని 40శాతం నుంచి 50 శాతానికి చేర్చడం వంటి లక్ష్యాలను నిర్దేశించారు. వీటి సాధనకు అనుసరించాల్సిన ప్రణాళికలు, సలహాలను మాత్రం అందులో పొందుపరచలేదు. విద్యావ్యవస్థలోని వివిధ స్థాయుల్లో నాణ్యతను ఎలా పెంచాలన్న నిర్దిష్ట ప్రణాళికల ప్రస్తావనా నూతన విద్యావిధానంలో కొరవడింది.

ఉపాధ్యాయుల ప్రమాణాలు

విద్యా ప్రణాళికే ప్రగతికి చుక్కాని చదువుల నాణ్యతకు ఉపాధ్యాయుల ప్రమాణాలు, వారి అంకితభావం, నైపుణ్యాలే దోహదపడతాయి. మంచి వేతనాలతోపాటు ఉపాధ్యాయులకు సరైన సామాజిక గుర్తింపు, ఇతర సౌకర్యాలు కల్పిస్తేనే అంకితభావం, నైపుణ్యాలు కలిగినవారిని ఈ వృత్తిలోకి ఆకర్షించేందుకు వీలవుతుంది. అందుకోసం ఇంజినీరింగ్‌ సర్వీసులు, ఫారెస్ట్‌ సర్వీసుల తరహాలోనే జాతీయ, రాష్ట్రీయ స్థాయుల్లో విద్యా నియామక సేవల విభాగాలు ఏర్పాటు కావాలి. విద్యాబోధన, పర్యవేక్షణలతో ముడివడిన ఉద్యోగాలను ఈ విభాగాల ద్వారా నియమిస్తేనే ఉన్నత ప్రమాణాలు నెలకొల్పేందుకు వీలవుతుంది. ఆధునిక అవసరాలకు అనుగుణంగా ఉపాధ్యాయులకు కొత్త పద్ధతుల్లో శిక్షణ ఇచ్చి, వారికి సరికొత్త నైపుణ్యాలు అలవరచాలి. అప్పుడే విద్యా ప్రమాణాలు మెరుగుపడతాయి. ఈ విషయంలో సమగ్రమైన, సహేతుకమైన సూచనలేవీ నూతన విధానంలో కనిపించడం లేదు. దేశ అవసరాలేమిటి, ఏ రంగానికి ఎంత ప్రాధాన్యం ఇవ్వాలి, ఏయే స్థానాల్లో ఎలాంటి మానవ వనరులు ఉండాలి వంటి వాటిపై సహేతుక అంచనాలుండాలి. ఆ మేరకు మానవ వనరులను ప్రణాళికాబద్ధంగా అభివృద్ధి పరచుకోవాలి.

అప్పుడే స్పష్టత వస్తుంది..

దేశావసరాల మేరకు పాలిటెక్నిక్‌, డిప్లొమా, ఐటీఐల స్థాయుల్లో నిపుణుల శాతాన్ని విస్తరించాలి. నూతన విధానంలో వీటిని పూర్తిగా విస్మరించారు. ఆ మేరకు ప్రణాళికలు రూపొందించకుండా, ప్రమాణాలు నిర్దేశించకుండా ఒకే తరహా డిగ్రీ విద్యార్థులను పెద్ద సంఖ్యలో తయారు చేస్తే మానవ వనరులను దుర్వినియోగం చేసినట్లే! పాఠశాల స్థాయిలోనే నైపుణ్యాభివృద్ధి అవసరాన్ని ప్రస్తావించారు. దేశంలోని అనేక రాష్ట్రాల్లో బల్లలు, శౌచాలయాలు, తరగతి గదుల వంటి కనీస సదుపాయాలే లేవు. ఈ పరిస్థితుల్లో నైపుణ్య ల్యాబొరేటరీల విస్తరణ ఏ మేరకు ఆచరణ సాధ్యమో ఆలోచించాల్సి ఉంది. ఏయే రంగాల్లో ప్రాథమ్యాలేమిటో గుర్తెరిగినప్పుడే, ఎలాంటి ల్యాబొరేటరీలను స్థాపించాలన్న స్పష్టత సాధ్యమవుతుంది. గతంలో 10+2గా ఉన్న వ్యవస్థను 5+3+3+4గా మార్చి అవ్యవస్థీకృతంగా ఉన్న ప్రీ-కేజీ, ఎల్‌కేజీ, యూకేజీలనూ ఇందులో చేర్చారు. పూర్వ ప్రాథమిక స్కూళ్లలో చదువుపై మాత్రమే కాకుండా జ్ఞానేంద్రియాలను చైతన్యపరచే విధానాలపై దృష్టిపెడితే బాగుంటుంది.

భవిష్యత్తుపై దృష్టి

మున్ముందు బోధన పద్ధతులు, అభ్యసన విధానాల్లో అనేక మార్పులు సంభవించవచ్ఛు బోధన విధానమూ సమూహ స్థాయి నుంచి వ్యక్తిగత స్థాయికి మారే అవకాశం ఉంది. ఈ అవసరాల దృష్ట్యా బోధన కార్యక్రమాల్లో ఇప్పటికన్నా మిన్నగా- ‘డిజిటల్‌ కంటెంట్‌’ తయారు చేయగల కొత్త సాంకేతిక ఆవిష్కరణల అవసరం ఎంతైనా ఉంది. ఉన్నత విద్యలో భవిష్యత్తు అవసరాల దృష్ట్యా ఏఐ, మెషీన్‌ లెర్నింగ్‌, డేటా సైన్స్‌ వంటి వాటితో పాటు- ప్రపంచ స్థాయి కోర్సులు ప్రవేశపెట్టాల్సిన అవసరమూ ఈ విధానంలో ప్రస్తావనకు నోచుకోలేదు. ప్రైవేటు వర్సిటీలు, విదేశీ విశ్వవిద్యాలయాలను ఆహ్వానించాలని ఇందులో సూచించారు. ప్రస్తుతం దేశంలో అమలులో ఉన్న సొసైటీ చట్టం ప్రకారం లాభాపేక్ష లేకుండా విద్యాసంస్థలను నిర్వహించాలి. చట్టాలను మార్చనంత వరకు విదేశీ విద్యాసంస్థలను ఆహ్వానించినా- వారు వచ్చి ఇక్కడ విశ్వవిద్యాలయాలు నెలకొల్పే అవకాశం లేదు.

ప్రభుత్వ రాయితీలు పేదవారికి వర్తించేలా..

ప్రైవేటు పెట్టుబడులు విద్యారంగంలోకి ప్రవహించాలంటే కొంతమేరకు సడలింపులు ఇవ్వక తప్పదు. విద్యలో ప్రైవేటు పెట్టుబడులవల్ల అసమానతలు తలెత్తి బలహీన వర్గాలకు అన్యాయం జరుగుతుందన్న వాదన ఉంది. ఇప్పుడున్న పరిస్థితుల్లో ఈ వాదన కొంతమేరకు నిజమే. ప్రభుత్వ విద్యాసంస్థలను కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చక్కటి నాణ్యతతో విస్తరిస్తే పేద వర్గాలకు ఏ కొంచెంకూడా అన్యాయం జరగదన్న విషయాన్ని గమనంలోకి తీసుకోవాలి. విద్యార్థుల కోసం ప్రభుత్వం ఇచ్చే రాయితీలన్నీ పూర్తిగా పేదవారికే చెందాలి. ధనవంతుల పిల్లలు ప్రైవేటు విద్యాసంస్థల్లో చదువుకోవచ్ఛు అందుకే ప్రైవేటు భాగస్వామ్యం అవసరం. కానీ, ఈ విధానాన్ని అమలు చేయడానికి ముందుగానే ప్రభుత్వ సంస్థల నాణ్యత, ప్రమాణాలు గణనీయంగా మెరుగుపడాలి. దేశవ్యాప్తంగా ప్రభుత్వ విద్యాసంస్థల నాణ్యత తీరుతెన్నుల పరిశీలన కోసం జిల్లాకు ఒక పర్యవేక్షణ వ్యవస్థ ఏర్పాటువైపు అడుగులు పడాలి.

కేటాయింపు ప్రతిపాదన బాగు...

దాదాపు ఆరు శాతం జాతీయ బడ్జెట్‌ను విద్యాభివృద్ధికి కేటాయించాలన్న ప్రతిపాదన ఆహ్వానించదగినది. గడచిన అయిదేళ్లలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు రెండూ కలిపి జీడీపీలో 3.5 శాతమైనా చదువులకు ఖర్చు పెట్టలేదు. ఈ పరిస్థితుల్లో మిగిలిన 2.5 శాతం వనరులను ఎలా సమకూరుస్తారన్నదానిపై వివరణ లేదు. ఉన్నత విద్యను అందించే వ్యవస్థలను బోధన వర్సిటీలు, పరిశోధన ప్రాధాన్య విశ్వవిద్యాలయాలు, స్వతంత్ర ప్రతిపత్తి కలిగిన యూనివర్సిటీలుగా విభజించాలన్న ఆలోచన సహేతుకమైనదే.

వర్గీకరణ ఉంటే..

అందుకోసం జర్మనీ తరహాలో విద్యార్థులను వర్గీకరిస్తే మేలు. చక్కటి మేధా సామర్థ్యం కలిగినవారికి పది, పన్నెండో తరగతి నుంచే పరిశోధనల్లో కొనసాగించే వెసులుబాటు కల్పించాలి. రెండో రకం విద్యార్థులకు నైపుణ్యాలకు సంబంధించి సమగ్ర శిక్షణ ఇవ్వాలి. మూడో రకం వారికి ఉన్నత విద్యను అందించడంతోపాటు సేవల రంగంలో అక్కరకొచ్చేలా తర్ఫీదు ఇవ్వాలి. ఉన్నత చదువుల్లో బహుళాంశ విశ్వవిద్యాలయాల స్థాపన, సాంకేతికతను అభ్యసించే విద్యార్థులకు సామాజిక శాస్త్రాలను బోధించడం హర్షణీయమే. జాతీయ భావాలను ప్రోది చేసేందుకు వివిధ కోర్సులు ప్రవేశపెట్టడం మంచిదే. నూతన జాతీయ విధానం అమలుకు అవసరమైన ఆరు శాతం బడ్జెట్‌కు ప్రభుత్వం కట్టుబడి; సహేతుక ప్రణాళికలు, ఆచరణాత్మక వైఖరితో ముందుకు కదిలితేనే భవిష్యత్‌ సవాళ్లకు దీటుగా భారతీయ యువత సంసిద్ధమవుతుంది.

- డాక్టర్​ లావు రత్తయ్య, విజ్ఞాన్​ విద్యాసంస్థల ఛైర్మన్​

ఇదీ చదవండి:కొత్త విద్యావిధానంలో ఆర్భాటమే అధికం?

ABOUT THE AUTHOR

...view details