'మేం 99 మందిమున్నాం... గుర్తుంచుకోండి, అటు పక్క మీరొక్కరే' ప్రపంచ పెట్టుబడిదారీ విధానానికి గుండెకాయలాంటి న్యూయార్క్‌లోని వాల్‌స్ట్రీట్‌కు కూతవేటు దూరంలో ధ్వజమెత్తిన ప్రజలు 2011లో వినిపించిన నినాదమది. విస్తరిస్తున్న ఆర్థిక అసమానతలు, పెరుగుతున్న దోపిడికి వ్యతిరేకంగా 'ఆక్యుపై వాల్‌స్ట్రీట్' (వాల్‌స్ట్రీట్‌ను ఆక్రమించుకోండి) పేరిట తొమ్మిదేళ్ల క్రితం న్యూయార్క్‌లో ప్రారంభమైన ఆ తిరుగుబాటు నెల రోజుల వ్యవధిలోనే ప్రపంచవ్యాప్తమైంది. ముఖ్యంగా ఉత్తర అమెరికా, ఐరోపాల్లో కార్చిచ్చులా వ్యాపించిన ఆ తిరుగుబాటు 750కిపైగా నిరసన ప్రదర్శనలకు అంటుకట్టింది. ప్రపంచంలో ఒక శాతం ఉన్న సంపన్నుల సంపద పెరగడం చుట్టూ జరుగుతున్న చర్చ- కొవిడ్ ముప్పుతో మరో మలుపు తిరిగింది. 'దశాబ్దకాల ప్రపంచ పురోగతిని ఈ వైరస్ కసిగా నుసి చేసే భయానక పరిస్థితులు కనిపిస్తున్నాయి' అని అంతర్జాతీయ ద్రవ్య నిధి సంస్థ (ఐఎంఎఫ్) కొన్ని నెలల క్రితం హెచ్చరించినట్లే- కనీసం పది కోట్ల మంది కొవిడ్ వల్ల కొత్తగా పేదరికం విష కౌగిలిలో చిక్కుకొన్నారు. కొవిడ్ కర్కశంగా విరుచుకుపడిన ఈ ఏడాదిలో ప్రపంచంలోని పదిమంది కుబేరుల సంపద 30వేల కోట్ల డాలర్లు పెరిగితే- రోజుకు రెండు డాలర్లకన్నా తక్కువ ఆదాయంతో బతుకులీడుస్తున్న వారి సంఖ్య అదనంగా పదికోట్లు పెరగడం గమనార్హం!
దోపిడి ప్రయోగాలు
వనరులను కొల్లగొట్టి ఎంతగా వినియోగిస్తే అంత గొప్ప అభివృద్ధి అనే తప్పుడు ప్రాతిపదికలు- వర్ధమాన దేశాల ఆర్థిక, రాజకీయ, సామాజిక విలువల విధ్వంసానికి కారణమయ్యాయి. ప్రపంచవ్యాప్తంగా అసమానతల విస్తరణకు వేగం పెంచాయి. కొవిడ్ కారణంగా ఉన్నపళంగా ఉపాధి కోల్పోయి దుర్బర దారిద్య్రంలోకి జారుకున్నవారు గ్రామీణ ప్రాంతాలతో పోలిస్తే- పట్టణాల్లోనే అధికంగా ఉన్నట్లు ప్రపంచబ్యాంకు తాజా నివేదిక వెల్లడిస్తోంది. మురికివాడల్లో బతుకునెరపుతూ చిన్నా చితకా పనులతో పొట్టపోసుకొనే, పారిశ్రామికవాడల్లో కూలీలుగా బతుకులీడ్చే కోట్లాది ప్రజానీకానికి కొవిడ్ శరాఘాతమైంది. అనేక ఆఫ్రికా, ఆసియా దేశాల్లో ప్రపంచ బ్యాంకు నిర్వహించిన అధ్యయనాల్లో పట్టణప్రాంత ప్రజలే అత్యధికంగా పేదరికం బారినపడినట్లు వెల్లడైంది. మరీముఖ్యంగా దక్షిణాసియాలో కనీసం అయిదున్నర కోట్లమంది కొత్తగా పేదరికం పెనుఉచ్చులో చిక్కుకొన్నారు. అభివృద్ధిలో అట్టడుగున మగ్గుతున్న 47 దేశాల్లో కొవిడ్ కారణంగా ఆరోగ్య సంక్షోభాన్ని మించి ఆర్థిక ఉత్పాతం వికటాట్టహాసం చేస్తోంది. ప్రపంచ వాణిజ్యం కుదేలై, పర్యాటక రంగం చతికిలపడి, లాక్డౌన్లతో ఉపాధికి కోలుకోలేని దెబ్బతగిలిన కారణంగా- ఈ పేద దేశాల వాణిజ్య లోటు నిరుడు నమోదు చేసుకున్న 9,100 కోట్ల డాలర్ల రికార్డు లోటును అధిగమించనుందని అంచనా.
అప్పు కోసం 110కి పైగా దేశాలు