డిజిటల్ కరెన్సీ.. ముఖ్యంగా కేంద్ర బ్యాంకు విడుదల చేసే డిజిటల్ కరెన్సీ (సీబీడీసీ)పై నేడు ప్రపంచ దృష్టి కేంద్రీకృతమవుతోంది. ప్రయోగాత్మకంగా సీబీడీసీని విడుదల చేయబోతున్నట్లు ప్రకటించిన దేశాల జాబితాలో తాజాగా భారతదేశమూ చేరింది. సీబీడీసీ అంటే ప్రస్తుతం అంతర్జాతీయ మార్కెట్లలో లావాదేవీలు జరుగుతున్న క్రిప్టో కరెన్సీల వంటిది కాదు. అది రిజర్వు బ్యాంకు వంటి కేంద్ర బ్యాంకుల హామీ ఉన్న చట్టబద్ధ కరెన్సీ. అదేసమయంలో సీబీడీసీ కాగితం కరెన్సీ కాదు, నాణెమూ కాదు. దాన్ని ఈ రెండు రూపాల్లోకీ మార్చడమూ కుదరదు. సీబీడీసీ అనేది ఫోన్, డిజిటల్ వ్యాలట్, కంప్యూటర్ ద్వారా మాత్రమే ఉపయోగించగల డిజిటల్ కరెన్సీ.
పూర్వాపరాలు
డిజిటల్ రూపంలో దాచుకున్న ఆస్తిని క్రిప్టో కరెన్సీ అనవచ్చు. దీన్ని ప్రైవేటు కరెన్సీ అనీ వ్యవహరిస్తున్నారు. అది బ్లాక్ చెయిన్ వంటి 'డిస్ట్రిబ్యూటెడ్ లెడ్జర్' సాంకేతికత ఆధారంగా పనిచేస్తుంది. ఈ సాంకేతికత వల్ల క్రిప్టో కరెన్సీని ఫోర్జరీ చేయడం కుదరదు. క్రిప్టో కరెన్సీ చాలా పరిమితంగా చలామణీలో ఉన్నందువల్ల గిరాకీ ఏ కాస్త హెచ్చినా- దాని విలువ అమాంతం పెరిగిపోతుంది. ఈ తరహా కరెన్సీల్లో బిట్ కాయిన్‌దే అగ్రస్థానం. ఇంకా ఎథీÅరియమ్, ఎక్స్‌ఆర్‌పీ, టెదర్, బిట్ కాయిన్ క్యాష్, బిట్ కాయిన్ ఎస్‌వీ, లైట్ కాయిన్ వంటి క్రిప్టో కరెన్సీలూ వాడుకలో ఉన్నాయి. మొత్తం క్రిప్టో కరెన్సీ లావాదేవీల్లో 95శాతం కేవలం 10 అగ్రశ్రేణి క్రిప్టోలలోనే జరుగుతోంది. బిట్ కాయిన్ మూలాలు ఇప్పటికీ అస్పష్టమే. సతోషీ నకొమోతో అనే అజ్ఞాత నిపుణుడు 2009లో బిట్ కాయిన్‌ను సృష్టించాడని అందరూ అంటారు కానీ, ఆ వ్యక్తిని ఇంతవరకు ఎవరూ చూడలేదు. అసలు సతోషీ కేవలం ఒక్క వ్యక్తా లేక కొందరు వ్యక్తుల బృందమా అనేదీ తెలియదు. ఈ ఏడాది మార్చి 29నాటికి ఒక్క బిట్ కాయిన్ విలువ 58,000 డాలర్లకు, అంటే సుమారు 42 లక్షల రూపాయలకు చేరుకుంది. నేడు ప్రపంచంలో 6,223 క్రిప్టో కరెన్సీలు చలామణీలో ఉన్నాయని అంచనా. వాటి విలువ 1.80 లక్షల కోట్ల డాలర్లు. కేవలం 12 ఏళ్లలోనే వీటి విలువ సున్నా నుంచి ఈ స్థాయికి పెరగడం విశేషం. పైగా ఇవి ప్రభుత్వ నియంత్రణ లేకుండా అంతర్జాలం సాయంతో సునాయాసంగా చేతులు మారుతున్నాయి, దేశాల ఎల్లలు దాటుతున్నాయి. దీంతో కేంద్ర బ్యాంకులు క్రిప్టో కరెన్సీలను ఇక ఏమాత్రం అలక్ష్యం చేయలేని పరిస్థితి ఏర్పడింది. పోనుపోను ఈ తరహా కరెన్సీల విలువ పెరిగిపోవడం ప్రపంచ ఆర్థిక వ్యవస్థపై పెను ప్రభావం చూపనుంది.
ఫోర్జరీలకు తక్కువ ఆస్కారం..
ఇటీవలి కాలంలో డిజిటల్ చెల్లింపులు విస్తృతం కావడం చూస్తూనే ఉన్నాం. అధునాతన సాంకేతికత తెచ్చిన సౌలభ్యమిది. ఇది ప్రజలను అధికాధికంగా ఆకర్షిస్తోంది. మారుతున్న పరిస్థితులను గమనించి తగిన విధానాలతో ముందుకురావడం ప్రభుత్వాల కర్తవ్యం. డిజిటల్ కరెన్సీలు, చెల్లింపుల్లో ఫోర్జరీలకు ఆస్కారం దాదాపుగా ఉండదు. కరెన్సీ రూపంలో నగదు ముద్రణ, చలామణీకయ్యే ఖర్చులూ డిజిటల్ కరెన్సీ వల్ల తగ్గిపోతాయి. 2019-20లో కరెన్సీ ముద్రణ, నకిలీ కరెన్సీలను అరికట్టడం వంటి కార్యకలాపాలపై రిజర్వు బ్యాంకు రూ.4,400 కోట్లు ఖర్చుపెట్టవలసి వచ్చింది. ఇంతా చేసి ఒక కరెన్సీ నోటు సగటు జీవిత కాలం రెండేళ్లలోపే. అదే డిజిటల్ కరెన్సీ అయితే బ్లాక్ చెయిన్ సాంకేతకత వల్ల ఫోర్జరీకి అవకాశమే చిక్కదు. ఈ తరహా కరెన్సీలు డిజిటల్ రూపంలో శాశ్వతంగా ఉండిపోతాయి. డిజిటల్ చెల్లింపులు, డిజిటల్ కరెన్సీలు ఆర్థిక చక్ర భ్రమణాల వేగం పెంచుతాయి. ఈ వాస్తవాన్ని కేంద్ర బ్యాంకులు ఇంకా పూర్తిగా గుర్తించినట్లు లేదు!
సీబీడీసీలతో ప్రయోగాలు..