'ఆత్మనిర్భర్ భారత్'ను నినదిస్తూ నిన్న సరికొత్త ప్యాకేజీ గుదిగుచ్చిన కేంద్రప్రభుత్వం- తయారీ రంగ సముద్ధరణను అత్యవసర అజెండా తొలివరసలో నిలబెట్టింది. కొవిడ్ సంక్షోభం నేపథ్యంలో లాక్‌డౌన్లతో లావాదేవీలు కుంగి చతికిలపడిన దేశార్థికానికి నవోత్తేజం కల్పించడమే లక్ష్యమంటూ ఇంతకుమునుపు రెండు విడతలుగా ప్రకటించిన ఉద్దీపన చర్యలకు కొనసాగింపు ఇది. ప్రజల కొనుగోలుశక్తిని పెంపొందించి ఆర్థిక కార్యకలాపాలు జోరెత్తేలా చేసేందుకు ఉద్దేశించామన్న తాజా ప్యాకేజీలో చిన్నగీతల పక్కన పెద్దగీత- తయారీ రంగాన ఉత్పాదకతతో ముడివడిన రాయితీల ఏరువాక.
అయిదేళ్లలో రెండు లక్షలకోట్ల రూపాయల దాకా వెచ్చించి- దేశీయ పరిశ్రమల్ని ప్రోత్సహిస్తామని, ఉపాధి కల్పనకు రెక్కలు తొడుగుతామని, దిగుమతుల్ని నియంత్రిస్తామని కేంద్రం చెబుతోంది. ఎగుమతుల మెరుగుదల ద్వారా ఆర్థిక వృద్ధికీ ఊపిరులూదగలమని భరోసా ఇస్తోంది. తయారీరంగానికి, ముఖ్యంగా సూక్ష్మ చిన్న మధ్యతరహా సంస్థ(ఎమ్‌ఎస్‌ఎమ్‌ఈ)లకు సమధిక తోడ్పాటుతోనే ఆత్మనిర్భర్ భారత్ ఆవిష్కరణ, అయిదు లక్షల కోట్ల డాలర్ల సుదృఢ ఆర్థిక వ్యవస్థగా ఇండియా అవతరణ సుసాధ్యమన్న విశ్లేషణలు కొన్నాళ్లుగా వెలుగు చూస్తున్నాయి.
క్షేత్రస్థాయిలో భిన్నంగా..
టెలికాం, ఎలక్ట్రానిక్స్, జౌళి, ఆహార ప్రాసెసింగ్, వాహన తదితర రంగాలకు రాయితీల ప్రదానం వెలుపలి పెట్టుబడులకు తద్వారా నూతన యూనిట్లకు విశేషంగా దోహదపడుతుందన్నది ప్రభుత్వ వర్గాల అంచనా. తయారీ రంగాన యూనిట్లు పెరిగేకొద్దీ ఎమ్‌ఎస్‌ఎమ్‌ఈలకు చేతినిండా పని, ఇతోధికంగా రాబడి సమకూరతాయన్న భవిష్యద్దర్శనాల కథనాలు వినసొంపుగా ఉన్నాయి. ఇప్పటికే లఘు పరిశ్రమలకు ఎంతో చేశామని ప్రభుత్వం చాటుతున్నా- క్షేత్రస్థాయి స్థితిగతులు భిన్నంగా ఉన్నాయి. కొత్తగా ఇచ్చిన హామీలైనా సాయం కోసం అర్రులు చాస్తున్న రంగాలకు తక్షణ ఉపశమనం ప్రసాదించి సొంత కాళ్లపై నిలబెట్టేలా, కార్యాచరణ పదును తేలాలి!
స్థూల దేశీయోత్పత్తి(జీడీపీ)లో భారత తయారీ రంగం వాటా కొన్నేళ్లుగా 15-16 శాతానికే పరిమితమవుతోంది. జర్మనీ (47శాతం), దక్షిణ కొరియా (39.8), ఫ్రాన్స్(31.8) ప్రభృత దేశాల గణాంకాలతో పోలిస్తే ఇండియా వెనకబాటుతనం ప్రస్ఫుటమవుతోంది. ఈ దురవస్థను చెదరగొట్టి జీడీపీలో దేశీయ తయారీరంగం వాటాను కనీసం 25 శాతానికి చేర్చాలన్న సంకల్ప ప్రకటనలెన్నో ఆచరణకు నోచకుండా మలిగిపోయాయి. దిగలాగుతున్న ప్రతిబంధకాల్ని అధిగమించి దేశీయ తయారీ రంగం కాలూచేయీ కూడదీసుకుంటే జీడీపీలో వాటా రెట్టింపవుతుందని మెకిన్సేలాంటి సంస్థలు ఉద్బోధిస్తున్నా- ఏళ్లతరబడి సరైన దిద్దుబాటు చర్యలే కొరవడ్డాయి.
సంస్థలు గట్టెక్కాలంటే..
దిగుమతులపై ఆధారపడవద్దని భారత వాహన, విడిభాగాల పరిశ్రమకు ఇటీవల పిలుపిచ్చిన కేంద్రమంత్రి నితిన్ గడ్కరీ- అన్నీ కలిసివస్తే లఘుపరిశ్రమలకు ఉజ్జ్వల భవితవ్యం సాధ్యమేనంటున్నారు. జీడీపీలో ఎమ్‌ఎస్‌ఎమ్‌ఈల వాటా 60శాతానికి చేరేందుకు రెండేళ్ల వ్యవధి చాలన్నది అమాత్యుల అంచనా. లఘుపరిశ్రమలతోపాటు స్థూలంగా తయారీ రంగం కోలుకుని సుస్థిర ప్రగతిబాట పట్టడానికి తన వంతుగా కేంద్రం చేయాల్సింది ఎంతో ఉంది. అరకొర రుణ వసతి, అహేతుక నిబంధనల పీడ విరగడ అయితేనే చిన్న సంస్థలు గట్టెక్కగలుగుతాయి. ఉత్పాదకతతో ముడిపెట్టిన రాయితీల పందేరం ఒక్కటే తయారీ రంగాన పెట్టుబడుల్ని చురుగ్గా రాబట్టలేదు.
దేశంలో ఎక్కడైనా ప్రభుత్వపరంగా ఏ బాదరబందీ లేకుండా ఔత్సాహిక పారిశ్రామికుల్ని సమాదరించాలి. సుశిక్షిత మానవ వనరులు, దీటైన సాంకేతిక పరిజ్ఞానంతో 'భారత్‌లో తయారీ' కేవలం నినాదాలకే పరిమితం కాదని, ఇక్కడున్నది అవకాశాల స్వర్గమని వెలుపలి పెట్టుబడిదారులు విశ్వసించే స్థితిగతుల్ని నెలకొల్పాలి. మౌలిక వసతుల కొరత, అధికార యంత్రాంగంలో అలసత్వం, అవినీతి తదితర అవలక్షణాల్ని ఏ కోశానా ఉపేక్షించని వాతావరణ పరికల్పనలో ప్రభుత్వాలు కృతకృత్యమైతేనే- ఆత్మనిర్భర భారతావని సాకారమవుతుంది!
ఇదీ చూడండి:ఆత్మనిర్భర్ భారత్ 3.0: ఉపాధి కల్పనకు పెద్ద పీట