భారత జౌళి రంగాన్ని ప్రపంచంలోనే అగ్రగామిగా నిలిపే లక్ష్యంతో కేంద్ర ప్రభుత్వం ఇటీవల దేశవ్యాప్తంగా ఏడు మెగా జౌళి పార్కుల ఏర్పాటుకు శ్రీకారం చుట్టింది. 'ప్రధానమంత్రి మెగా ఇంటిగ్రేటెడ్ టెక్స్‌టైల్ రీజియన్ అండ్ అప్పరెల్ పార్క్స్ (పీఎం మిత్ర)'గా వ్యవహరించే ఈ పథకంలో ఆత్మనిర్భర్ భారత్ కింద రూ.4,445 కోట్ల వరకు వెచ్చించి భారీ సమీకృత ప్రాంతీయ వస్త్ర, దుస్తుల పరిశ్రమ సమూహాల ఏర్పాటుకు రంగం సిద్ధమవుతోంది. పంట క్షేత్రం నుంచి విదేశాలకు వస్త్రాల ఎగుమతి వరకు తోడ్పడే సౌకర్యాలతో జౌళి పార్కులను సిద్ధం చేయనున్నారు. 'పీఎం మిత్ర' కింద తమ రాష్ట్రాల్లో జౌళి పార్కుల ఏర్పాటుకు అవకాశం కల్పించాలని మధ్యప్రదేశ్, తమిళనాడు, పంజాబ్, ఒడిశా, గుజరాత్, అస్సాం, రాజస్థాన్‌లతోపాటు రెండు తెలుగు రాష్ట్ర ప్రభుత్వాలూ కేంద్రానికి ప్రతిపాదనలు పంపాయి. వరంగల్ జిల్లాలో ప్రతిపాదిత కాకతీయ మెగా జౌళి పార్కు ఏర్పాటుకు తెలంగాణ ప్రభుత్వం ఇప్పటికే 1200 ఎకరాల భూసేకరణ చేపట్టి, పరిశ్రమల ఏర్పాటుకు మౌలిక వసతులు కల్పిస్తోంది. ఏపీ పరిశ్రమల సమాఖ్య కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌కు రాసిన లేఖలో రాష్ట్రానికి మెగా జౌళి పార్కును మంజూరు చేయాలని కోరింది. ఈ పథకం కింద అవకాశం వస్తే ఒక్కో జౌళి పార్కుకు రూ.300 నుంచి రూ.500 కోట్లు దక్కే అవకాశం ఉంది. ప్రత్యక్షంగా, పరోక్షంగా లక్ష నుంచి రెండు లక్షల మందికి ఉపాధి, ఉద్యోగావకాశాలు సమకూరుతాయి. ఉభయ తెలుగు రాష్ట్రాలు పీఎం మిత్ర పథకం కింద మెగా జౌళి పార్కుల నిధులు పొందేందుకు పూర్తి స్థాయి అర్హతలు కలిగి ఉన్నాయి.
మేలి రకం ఉత్పత్తి
దేశంలో పత్తి పంట ఉత్పత్తిలో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ వరసగా మూడు, నాలుగు స్థానాల్లో ఉన్నాయి. గుజరాత్, మహారాష్ట్రల తరవాత తెలంగాణ 60 లక్షల బేళ్ల పత్తి ఉత్పత్తి చేస్తోంది. సుమారు 50 లక్షల ఎకరాల్లో తెల్ల బంగారాన్ని రాష్ట్ర రైతులు పండిస్తున్నారు. ఏపీలో ఈ ఏడాది 14 లక్షలకుపైగా ఎకరాల్లో 19 లక్షల బేళ్ల పత్తి ఉత్పత్తి జరిగినట్లు గణాంకాలు వెల్లడిస్తున్నాయి. పత్తి పంటకు అనుకూలించే భౌగోళిక పరిస్థితుల వల్ల ఉభయ రాష్ట్రాల్లో 31 మిల్లీమీటర్ల పొడవుతో పండే పత్తికి వస్త్ర పరిశ్రమల్లో మంచి డిమాండు ఉండటం మనకు కలిసివచ్చే అంశం. దేశంలోని మొత్తం పత్తి దిగుబడిలో సింహభాగం గుజరాత్, మహారాష్ట్ర, తెలంగాణ, ఏపీల నుంచే రావడం వల్ల ఈ ప్రాంతాలను 'కాటన్ బాస్కెట్ ఆఫ్ ఇండియా'గా వ్యవహరిస్తున్నారు. వస్త్ర పరిశ్రమల ఏర్పాటుకు అవసరమైన వనరులు ఉభయ తెలుగు రాష్ట్రాల్లో ఉన్నా ఈ రంగంలో ఆశించినంత పురోగతి సాధించలేకపోతున్నాం. రెండు రాష్ట్రాల్లో పోచంపల్లి, గద్వాల, మంగళగిరి, వెంకటగిరి లాంటి చేనేత రకం చీరలు, ఏలూరు, వరంగల్ కొత్తవాడ తివాచీలు ఎంతో ప్రసిద్ధి చెందాయి. వాటిపై ఆధారపడ్డ చేనేతకారులకు సరిపడా ఉపాధి లేకపోవడంతో కొన్ని దశాబ్దాల క్రితమే మన నేతకారులు పెద్ద సంఖ్యలో ఇతర రాష్ట్రాలకు వలసవెళ్ళారు. అక్కడి వస్త్ర పరిశ్రమల్లో చాలీచాలని జీతాలతో జీవితాలు వెళ్లదీస్తున్నారు. ఈ క్రమంలో ఉభయ రాష్ట్రాల్లో మెగా జౌళి పార్కులు ఏర్పాటు చేస్తే మన వద్ద ఉపాధి ఉద్యోగాలు పెరగడంతోపాటు, వస్త్ర పరిశ్రమ పుంజుకొని అటు రైతులకు మంచి ధర దక్కడంతోపాటు, ఇటు నేతన్నల జీవితాలూ బాగుపడతాయి. ఇప్పటికీ మన రైతులు పండించే పంటలో సింహభాగాన్ని ముడి సరకుగా ఎగుమతి చేస్తున్నారు. ఈ క్రమంలో వస్త్ర పరిశ్రమల ఏర్పాటుకు ప్రభుత్వాలు ప్రత్యేక చొరవ తీసుకోవడమే కాకుండా, పారిశ్రామిక విధానాన్ని సవరించి, పెట్టుబడిదారులను ఆహ్వానించాలి. విరివిగా వస్త్ర యూనిట్లు నెలకొల్పాలి. తద్వారా రాష్ట్రాలకు పారిశ్రామికంగా ఎంతో ప్రయోజనం కలుగుతుంది.
సరైన విధానం రావాలి