తెలంగాణ

telangana

ETV Bharat / opinion

నేరచరితుల్ని నిలువరిస్తేనే ప్రజాస్వామ్యానికి భవిష్యత్తు! - పార్లమెంట్​

పద్నాలుగో లోక్​సభలో 24 శాతంగా ఉన్న నేరచరితుల సంఖ్య.. ప్రస్తుత లోక్​సభలో ఎకాయెకి 43 శాతానికి పెరిగింది. భారత ప్రజాతంత్రాన్నే నేరగ్రస్త రాజకీయాలను కరిమింగిన వెలగపండులా చేసిన పార్టీల దురాగతం నిశ్చేష్టపరుస్తోంది. తొండముదిరి ఊసరవెల్లి అయిన చందంగా- నేర రాజకీయోపాసకులే పార్టీలు పెట్టి ప్రజాస్వామ్యాన్నే కబళిస్తున్న వైనమూ కళ్లకు కడుతోంది. నేరచరితుల్ని ఏరి పారేస్తేనే భారత ప్రజాస్వామ్యానికి భవిష్యత్తు!

Criminals in Politics
నేరచరితుల్ని నిలువరిస్తేనే ప్రజాస్వామ్యానికి భవిష్యత్తు!

By

Published : Dec 7, 2020, 7:52 AM IST

గోటితో పోయేదాన్ని గొడ్డలికి సైతం లొంగని మహా జాడ్యంగా మార్చి, భారత ప్రజాతంత్రాన్నే నేరగ్రస్త రాజకీయాల కరిమింగిన వెలగపండులా చేసిన పార్టీల దురాగతం నిశ్చేష్టపరుస్తోంది. పద్నాలుగో లోక్‌సభలో 24శాతంగా ఉన్న నేరచరితుల సంఖ్య తదుపరి సభలో 30శాతానికి, 16వ సభలో 34 శాతానికి, ప్రస్తుత లోక్‌సభలో ఎకాయెకి 43 శాతానికి విక్రమించింది. ఈ దురవస్థను దునుమాడాలంటూ ప్రజాప్రయోజన వ్యాజ్యాల రూపేణా సాగుతున్న పోరాటంలో- సుప్రీంకోర్టుకు కేంద్ర సర్కారు సమర్పించిన తాజా ప్రమాణపత్రం ఆలోచనాపరుల్ని కలచివేస్తోంది. రెండేళ్లు ఆపై శిక్ష పడగల కేసుల్లో దోషిగా నిరూపణ అయ్యి జైలుశిక్షకు గురైన ప్రజాప్రతినిధికి ఆ రోజునుంచే అనర్హత వర్తిస్తుందని, విడుదల అయిన రోజు నుంచి ఆరేళ్లపాటు అది అమలులో ఉంటుందని ప్రజాప్రాతినిధ్య చట్టంలోని 8(3) నిబంధన చాటుతోంది. ఐపీసీతో పాటు ఇతర చట్టాల కింద శిక్షపడిన ప్రభుత్వోద్యోగుల్ని జీవితకాలం విధులనుంచి బహిష్కరిస్తున్నప్పుడు, ప్రజా ప్రతినిధుల్ని నిర్ణీత కాలమే వెలి వేయడం రాజ్యాంగంలోని 14వ అధికరణ ప్రకారం సరికాదన్న వాదనపై న్యాయపాలిక కేంద్ర ప్రభుత్వ వైఖరి తెలుసుకోగోరింది.

జీవితకాల బహిష్కరణపై..

శిక్షపడిన ప్రతినిధులకు జీవితకాల బహిష్కరణే సరైనదని ఎన్నికల సంఘమూ స్పష్టీకరించిన నేపథ్యంలో- చట్టం ముందు అందరూ సమానమంటూనే కేంద్రం భిన్నంగా స్పందించింది. నిర్దిష్ట సర్వీసు నిబంధనలకు లోబడి కాకుండా శాసనకర్తలు దేశానికి, పౌరులకు సేవ చేస్తామన్న ప్రమాణానికి కట్టుబడతారంటూ ఆర్‌పీఐ నిబంధనల్ని సవరించాల్సిన అవసరం లేనే లేదని తేల్చిచెప్పింది. నేరం రుజువైన నేతల్ని జీవితకాల బహిష్కరణతోపాటు వాళ్లు పార్టీలు పెట్టకుండా, పార్టీల్లో కీలక పదవులు చేపట్టకుండా చూడాలన్న వ్యాజ్యంలో ఇమిడి ఉన్న ప్రజా ప్రయోజనాన్ని కేంద్రం పూర్తిగా విస్మరించింది!

'నేర చరితులనుంచి భారత ప్రజాస్వామ్యానికి విముక్తి ప్రసాదించాల్సిన అవసరం ఉంది.. రాజకీయాల ప్రక్షాళన కోసమే నేను వచ్చాను'- ప్రధాని పదవికి అభ్యర్థిగా 2014 ఏప్రిల్‌లో మోదీ చేసిన ప్రకటన అది. జైలులో ఉన్నవారు ఓటింగ్‌ హక్కు కోల్పోతారు కాబట్టి, అలాంటి వాళ్లకు ఎన్నికల్లో పోటీ చేసే హక్కు సైతం ఉండదని 'సుప్రీం' న్యాయపాలిక 2013లో తీర్పు ఇచ్చినప్పుడు- దాన్ని ప్రభావశూన్యం చేసేందుకు నాటి యూపీఏ సర్కారు యుద్ధ ప్రాతిపదికన కదిలింది. నేర చరితులే రాజకీయాల్ని దున్నేసే దుర్మార్గాన్ని మరే మాత్రం ఉపేక్షించరాదన్న జనవాణిని మోదీ తన గళంలో పలికించినా- ఇన్నేళ్లలో తీరైన కార్యాచరణే కొరవడింది.

అడ్డుకుంటేనే ప్రజాస్వామ్యానికి భవిష్యత్తు!

ప్రాథమిక సాక్ష్యాల పరిశీలన దరిమిలా కోర్టులు నేరాభియోగాలు నమోదు చేసినప్పటినుంచే ఎన్నికల్లో పోటీకి అనర్హత దోషం ఆపాదిస్తే నేరచరితుల ఉరవడిని నిలువరించగల వీలుందన్న న్యాయ సంఘం- అది దుర్వినియోగం కాకుండా తీసుకోవాల్సిన ముందు జాగ్రత్తల్నీ తన నివేదికలో ప్రస్తావించింది. నేర రాజకీయాలు ప్రజాస్వామ్య మూలాల్నే గుల్లబారుస్తున్నాయని, హేయ నేరాలకు పాల్పడ్డవాళ్లు ఎన్నికల గోదాలోకి రాకుండా పార్లమెంటు పటుతర చట్టం చేయాలని 2018 సెప్టెంబరులో అయిదుగురు సభ్యుల రాజ్యాంగ ధర్మాసనం సూచించింది. ఆ తరహా మహితోక్తులకు మన్నన దక్కకపోబట్టే- ఇటీవల జైలునుంచి నేరుగా పోలీసు వాహనంలో వచ్చి, నామినేషన్లు సమర్పించి, ఎన్నికల్లో నెగ్గుకొచ్చిన 'బాహుబలు'లతోపాటు 58శాతం ఘరానా నేరచరితులతో బిహార్‌ అసెంబ్లీ లుకలుకలాడుతోంది. తొండముదిరి ఊసరవెల్లి అయిన చందంగా- నేర రాజకీయోపాసకులే పార్టీలు పెట్టి ప్రజాస్వామ్యాన్నే కబళిస్తున్న వైనమూ కళ్లకు కడుతోంది. ఇంతగా ముప్పు నడినెత్తిన ఉరుముతున్నా, సరైన చట్టంకోసం సుప్రీంకోర్టే గట్టిగా సిఫార్సు చేస్తున్నా- ఎన్‌డీఏ సర్కారు మిన్నకుండటం మరే మాత్రం సరికాదు. నేరచరితుల్ని ఏరి పారేస్తేనే భారత ప్రజాస్వామ్యానికి భవిష్యత్తు!

ఇదీ చూడండి: కొరవడిన ఆనాటి ప్రమాణాలు!

ABOUT THE AUTHOR

...view details