యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ యువరాజు మహమ్మద్ బిన్ జయేద్ అలీ నహ్యాన్ మూడేళ్ల క్రితం భారత పర్యటనకు వచ్చారు. ఆ సందర్భంగా భారత ప్రధాని నరేంద్ర మోదీ అన్ని ప్రొటోకాల్ నిబంధనలనూ పక్కనపెట్టి స్వయంగా తరలివెళ్ళి- న్యూదిల్లీ విమానాశ్రయానికి విచ్చేసిన జయేద్‌కు ఆత్మీయ ఆలింగనంతో స్వాగతం పలికారు. రెండేళ్ల క్రితం సౌదీ అరేబియా యువరాజు మహమ్మద్ బిన్ సల్మాన్ భారత్‌కు వచ్చినప్పుడూ ప్రధాని మోదీ అంతే ఆత్మీయంగా స్పందించారు. యూఏఈ, సౌదీ యువరాజుల రాక సందర్భంగా ప్రదర్శితమైన తాత్కాలిక ఉద్వేగ స్పందనలుగా వాటిని తీర్మానించలేం. గల్ఫ్ దేశాలతో భారత్ సంబంధాల్లో పొడగడుతున్న మౌలిక మార్పునకు సంకేతాలుగా వీటిని చూడాలి. కొంతకాలంగా ఇరు ప్రాంతాల మధ్య సుహృద్భావం పెల్లుబుకుతోంది. నాయకుల మధ్య పరస్పర గౌరవం, నమ్మకం పరిఢవిల్లుతున్నాయి.
శతాబ్దాల అనుబంధం
చారిత్రకంగా గల్ఫ్ దేశాలకు, భారత్‌కు మధ్య విడదీయరాని అనుబంధం ఉంది. సాంస్కృతిక, వారసత్వ సంపదపరంగా ఇరు ప్రాంతాల నడుమ ఎన్నో సారూప్యతలు కనిపిస్తాయి. భారత్‌లోని కోట్లాది ప్రజలు అత్యంత పవిత్రమైనవిగా భావించే మక్కా, మదీనాలు గల్ఫ్ దేశాల్లోనే ఉన్నాయి. మరోవంక చారిత్రక గాథలు, భాషలు, మతాలు, ఆహారం, నిర్మాణ శైలి ప్రాతిపదికన ఇరు ప్రాంతాలపైనా గాఢమైన పరస్పర ముద్ర ఉంది. గల్ఫ్, భారత్‌ల మధ్య ముడివడిన సాంస్కృతిక, వారసత్వపరమైన గాఢమైన సారూప్యతలను అరబ్ గడ్డతో ఆత్మీయ బంధం! మరెన్నింటినో పరిశోధించి వెలికితీయాల్సి ఉంది. కాలక్రమంలో గల్ఫ్ దేశాలతో చారిత్రక, సాంస్కృతిక సంబంధాలు రాజకీయ, ఆర్థిక భాగస్వామ్యంగా రూపాంతరం చెందాయి. గడచిన ఆరేళ్లకాలంలో ప్రధాని నరేంద్ర మోదీ దార్శనికత్వంలో ఈ బంధం బలీయంగా రూపుదిద్దుకొంది. 'పశ్చిమంవైపు చూపు' (లుక్ వెస్ట్) విధానాన్ని పట్టాలకెక్కించి గల్ఫ్ ప్రాంతంతో మేలైన సంబంధాలు నెలకొల్పుకొనేందుకు మోదీ ఎడతెగని ప్రయత్నాలు చేశారు. ఫలితంగా గల్ఫ్‌లోని కొన్ని దేశాలతో భారత్ సంబంధాలు ద్వైపాక్షిక భాగస్వామ్యాలనుంచి వ్యూహాత్మక భాగస్వామ్యం స్థాయికి పరిణతి చెందాయి. గల్ఫ్ దేశాలతో ఈ స్థాయిలో బలమైన భాగస్వామ్యాలు ఏర్పాటు చేసుకోవడమంటే దాని అర్థం- వాటితో కీలకమైన రంగాలు, అంశాలపై సానుకూల చర్చలకు మార్గం సుగమం చేసుకోవడమే. భారత ప్రధాని, సౌదీ యువరాజులతో శిఖరాగ్ర స్థాయిలో ఇరు దేశాల నడుమ ప్రత్యక్ష సంప్రదింపులకు, అనుసంధానానికి వీలుగా వ్యూహాత్మక భాగస్వామ్య మండలి ఏర్పాటైంది. అదే విధంగా యూఏఈతో సైతం అత్యున్నత స్థాయిలో ఏర్పాటైన మంత్రివర్గ బృందాల సారథ్యంలో వ్యూహాత్మక అనుబంధం కొత్త చివుళ్లు తొడుగుతోంది. గల్ఫ్ దేశాలతో వాణిజ్య బంధం క్రమంగా బలపడుతోంది. ఇరు ప్రాంతాల ప్రజల మధ్య రాకపోకలూ మునుపటితో పోలిస్తే గణనీయంగా పెరిగాయి. భారత్‌కు మూడో అతిపెద్ద వాణిజ్య భాగస్వామి యూఏఈ; సౌదీ అరేబియా నాలుగో స్థానంలో ఉంది. ఇంధనం, రిఫైనింగ్, పెట్రో కెమికల్స్, మౌలిక సౌకర్యాలు, వ్యవసాయం, ఖనిజాలు, మైనింగ్ రంగాల్లో సౌదీ అరేబియా వంద బిలియన్ డాలర్ల మేర భారత్‌లో పెట్టుబడులకు ముందుకొచ్చింది. మరోవంక భారత్‌లోకి ఎఫ్‌డీఐలు మోసుకొస్తున్న తొలి పది దేశాల్లో యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ కూడా ఒకటి.
గల్ఫ్‌దేశాల్లో భారతీయ సమాజం పెద్దయెత్తున విస్తరించి ఉంది. అక్కడ స్థిరపడిన 85 లక్షలమందికిపైగా భారతీయులు ఇరు ప్రాంతాల అనుబంధానికి గీటురాయిగా ఉన్నారు. భారీయెత్తున భారతీయులు గల్ఫ్‌లో ఉన్నందువల్ల ఆ ప్రాంతంనుంచి మనకు పెద్దయెత్తున విదేశ మారకద్రవ్యమూ తరలివస్తోంది. 2018లో దాదాపు 5000 కోట్ల డాలర్ల విదేశ మారకద్రవ్యం గల్ఫ్‌నుంచి భారత్‌కు వచ్చినట్లు అంచనా! అదే సందర్భంలో విశిష్ట నైపుణ్యాలతో అలరారే భారతీయుల సేవలను సద్వినియోగం చేసుకుని గల్ఫ్ దేశాలు అపారంగా లబ్ధి పొందుతున్నాయి. కొంతకాలంగా భారతీయ సమాజం ప్రయోజనాలపట్ల, వారి సాంస్కృతిక అవసరాలపట్ల గల్ఫ్ భాగస్వామ్య మండలి (జీసీసీ) దృక్పథం గుణాత్మకంగా మారుతోంది. భారతీయులు ఆలయాన్ని నిర్మించుకోవాలని భావిస్తే- యూఏఈ ప్రభుత్వం సానుకూలంగా స్పందించి అందుకు సమ్మతించడమే గల్ఫ్ దేశాల దృక్పథం మారుతోందనడానికి దాఖలా. భారత్, గల్ఫ్ దేశాల మధ్య వాణిజ్య, పెట్టుబడులకు హైడ్రోకార్బన్ వెన్నెముకగా నిలుస్తోంది. ఇరు ప్రాంతాల నడుమ 2019-20లో చోటుచేసుకున్న హైడ్రోకార్బన్ వాణిజ్యం విలువ 6200 కోట్ల డాలర్లు! ప్రపంచవ్యాప్తంగా జరిగిన మొత్తం హైడ్రోకార్బన్ వాణిజ్యంలో ఈ వాటా 36శాతం కావడం గమనార్హం.