తెలంగాణ

telangana

ETV Bharat / opinion

బొగ్గు వినియోగానికి త్వరలో మంగళం

బొగ్గుతో నడిచే విద్యుదుత్పత్తి కేంద్రాలకు అనుమతులు నిలిపి వేయాలని, కొత్త గనుల తవ్వకం, విస్తరణ కార్యక్రమాలు చేపట్టకూడదని అంతర్జాతీయ ఇంధన సంస్థ(ఐఈఏ) డిమాండ్​ చేస్తోంది. వచ్చే 30 సంవత్సరాల్లో తటస్థ ఉద్గారాల స్థితి (నెట్‌ జీరో) లక్ష్యాలను సాధించాలంటే దశల వారీగా బొగ్గు ప్రాధాన్యం తగ్గించాలని సూచించింది. 2030 నాటికి 1020 గిగావాట్ల వార్షిక సౌర, పవన విద్యుత్‌ ఉత్పత్తిని చేపట్టాలని కోరింది.

coal, renewable energy
బొగ్గు వినియోగం

By

Published : Jun 18, 2021, 8:06 AM IST

కొత్తగా బొగ్గు గనుల తవ్వకం చేపట్టకూడదని, బొగ్గుతో నడిచేే థర్మల్‌ విద్యుత్‌ కేంద్రాలకు అనుమతి ఇవ్వకూడదని పర్యావరణ నిపుణులు డిమాండు చేస్తున్నారు. తాజాగా అంతర్జాతీయ ఇంధన సంస్థ(ఐఈఏ) నివేదికలోనూ బొగ్గును దశలవారీగా పరిహరించాలన్న సూచనలున్నాయి. బొగ్గుతో నడిచే విద్యుదుత్పత్తి కేంద్రాలకు అనుమతులు నిలిపి వేయాలని, కొత్త గనుల తవ్వకం, విస్తరణ కార్యక్రమాలు చేపట్టకూడదని ఐఈఏ స్పష్టంచేసింది. 2050 నాటికి తటస్థ ఉద్గారాల స్థితి (నెట్‌ జీరో) లక్ష్యాలను సాధించాలంటే దశల వారీగా బొగ్గు ప్రాధాన్యం తగ్గించాలని, 2030 నాటికి 1020 గిగావాట్ల వార్షిక సౌర, పవన విద్యుత్‌ ఉత్పత్తిని చేపట్టాలని సూచించింది. 2035 నుంచి ప్రారంభించి 2040 నాటికి నూరుశాతం నాణ్యమైన విద్యుదుత్పాదనపై దృష్టి పెట్టాలని పేర్కొంది. 2050 నాటికి 75 శాతం విద్యుదుత్పత్తిని సౌర, పవన మార్గాల ద్వారా సాధించాలని వెల్లడించింది. ఈ క్రమంలో, ఏడాది చివరి నాటికి అంతర్జాతీయంగా థర్మల్‌ విద్యుత్‌ ఉత్పాదనకు ప్రభుత్వాల పరంగా మద్దతును నిలిపివేసేందుకు కట్టుబడి ఉన్నట్లు తాజాగా జరిగిన జీ7 సభ్యదేశాలు ప్రతినబూనడం గమనార్హం.

నిబంధనల అమలే కీలకం

మన దేశంలో బొగ్గు వినియోగమే అధికం. అధిక ఉత్పత్తి, చౌక లభ్యత వంటివే ఇందుకు కారణం. ప్రపంచ బొగ్గు ఉత్పత్తిలో మనదేశానిది రెండో స్థానం. ఇక్కడ ఉత్పత్తి అవుతున్న విద్యుత్తులో 72శాతం బొగ్గు ఆధారిత కేంద్రాల ద్వారానే లభిస్తోంది. కర్బన ఉద్గారాల్లో 40 శాతం శిలాజ ఇంధనాలను మండించడం వల్లే విడుదలవుతున్నట్లు అంచనా. అందుకే బొగ్గుతో నడిచే విద్యుత్‌ కేంద్రాలను నియంత్రించాలనే డిమాండ్లు పెద్దయెత్తున ముందుకొచ్చాయి. పాతికేళ్ల పైబడి సేవలందించిన థర్మల్‌ విద్యుత్‌ కేంద్రాలను మూసివేయాలని కేంద్ర ప్రభుత్వం ప్రతిపాదించింది. నిర్వహణపరంగా అంతగా లాభదాయకంగా లేని పాత థర్మల్‌ విద్యుత్‌ కేంద్రాలను మూసివేయడం మంచిదని ఐక్యరాజ్యసమితి పర్యావరణ విభాగం కూడా తన 'ఎమిషన్‌ గ్యాస్‌-2020' నివేదికలో అభిప్రాయపడింది. పర్యావరణ మంత్రిత్వశాఖ 2015లోనే కాలుష్య నియంత్రణకు అనుసరించాల్సిన విధివిధానాలు వెల్లడించింది. థర్మల్‌ విద్యుత్‌ కేంద్రాలు ఈ నిబంధనలను అమలు చేయగలిగితే, కాలుష్య ప్రభావం 40 నుంచి 50 శాతం మేరకు తగ్గుతుందని అంచనా. విద్యుత్‌ కేంద్రాలను- 2004కు ముందు, 2004-16 మధ్య, 2016 తరవాత నిర్మించినవిగా మూడు విభాగాలుగా వర్గీకరించి, ఉద్గారాల విడుదలకు సంబంధించి ఆయా ప్లాంట్లు అనుసరించాల్సిన ప్రమాణాలను నిర్ధారించింది. ఈ నిబంధనలను 2019లోగా అమలు చేయాలని సూచించింది. అనంతరం సుప్రీంకోర్టు దాన్ని 2022 వరకు పొడిగించింది. 25 ఏళ్లు పైబడిన 34,720 మెగావాట్ల సామర్థ్యం ఉన్న ప్లాంట్లలో, 22,716 మెగావాట్ల సామర్థ్యం ఉన్న ప్లాంట్లకు 2022లోగా ఉత్పత్తి నుంచి విరమణ ప్రకటించాలని కేంద్ర విద్యుత్‌ ప్రాధికార సంస్థ (సీఈఏ) సూచించింది.

ఉద్గార ప్రమాణాలను ప్రభుత్వం ఇచ్చిన గడువు 2022లోగా అందుకోవడం విద్యుత్‌ కేంద్రాలకు సాధ్యం కాకపోవచ్చన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. దాదాపు 65 శాతం సంస్థల పరిస్థితి ఇదేనని విజ్ఞానశాస్త్ర, పర్యావరణ కేంద్రం (సీఎస్‌ఈ) తన అధ్యయన నివేదికలో స్పష్టం చేసింది. ఇందుకు చాలా కారణాలున్నాయి. పాతతరం విద్యుత్‌ కేంద్రాల్లో చాలా వాటికి నిర్మాణ గడువు (డిజైన్డ్‌ ఏజ్‌) ముగిసింది. ఇప్పుడు ఉద్గారాల విడుదలకు నియంత్రణకు చర్యలు తీసుకోవడం వల్ల తమకయ్యే ఖర్చుకు, దానివల్ల లభించే ప్రయోజనానికి మధ్య సమతూకం సాధ్యమయ్యే పని కాదని విద్యుత్‌ కేంద్రాల నిర్వాహకులు అభిప్రాయ పడుతున్నారు. అవి ఉత్పత్తిని కొనసాగించాలంటే, మరింత అధిక పెట్టుబడి అవసరమవుతుంది. 10 వేల మెగావాట్ల సామర్థ్యం కలిగిన కేంద్రాల్లో నీటి శీతల వ్యవస్థను ఆధునికీకరించి, వాటిలో కూలింగ్‌ టవర్లు ఏర్పాటు చేయడం సమస్యగా పరిణమిస్తుంది. కొంతకాలం పాటు ఆయా విద్యుత్‌ కేంద్రాలను మూసివేస్తే తప్ప అవసరమైన చర్యలు చేపట్టడం సాధ్యం కాదు.

ప్రత్యామ్నాయాలకు సన్నాహాలు

దేశవ్యాప్తంగా పునరుత్పాదక ఇంధన వనరులపై దృష్టి సారించడంతో బొగ్గు వినియోగం క్రమంగా తగ్గుతుందని కేంద్రం అభిప్రాయపడుతోంది. 2040 నాటికి 44 శాతానికి తగ్గుతుందని నీతిఆయోగ్‌ అంచనా వేసింది. ఇతర దేశాలు సహజవాయువుతో విద్యుత్‌ ఉత్పత్తి చేపట్టేందుకు మొగ్గు చూపుతున్నాయి. మన దేశంలో సహజవాయువు అంతగా అందుబాటులో లేదు. దీనితో బొగ్గుకు ప్రత్యామ్నాయంగా వినియోగించగల ఇంధన వనరులపై కసరత్తు మొదలైంది. కోల్‌ఇండియా సంస్థ మిథనాల్‌ (మిథైల్‌ ఆల్కహాల్‌)తో నడిచే అయిదు ప్రాజెక్టులను త్వరలోనే ప్రారంభిస్తోంది. ఒక్కో ప్రాజెక్టు విలువ రూ.6,000 కోట్లు. ఒడిశాలోని అంగుల్‌ జిల్లాలో కోల్‌ గ్యాసిఫికేషన్‌ కేంద్రాన్ని కొత్తగా ప్రారంభించారు. గుజరాత్‌, ఛత్తీస్‌గఢ్‌ వంటి కొన్ని రాష్ట్రాలు బొగ్గుతో నడిచే థర్మల్‌ విద్యుత్‌ కేంద్రాలను నిర్మించబోమని ప్రకటించాయి. రానున్న రోజుల్లో మరికొన్ని రాష్ట్రాలు ఈ దిశగా అడుగులు వేసే అవకాశం ఉంది. ఈ క్రమంలో పర్యావరణ పరిరక్షణకు అన్ని రాష్ట్రాలూ నడుం బిగించాల్సిన తరుణం ఆసన్నమైందని గ్రహించాలి.

- పార్థసారథి చిరువోలు

ఇదీ చూడండి:సోనియా, రాహుల్​ టీకా తీసుకున్నారా?

ABOUT THE AUTHOR

...view details