తెలంగాణ

telangana

ETV Bharat / opinion

మౌలిక వసతుల్లో తడ'బడి'.. సంక్షోభంలో విద్యావ్యవస్థ! - పాఠశాలల్లో మరుగుదొడ్లు

పాఠశాలల్లో విద్యార్థులకు, ఉపాధ్యాయులకు అవసరమైన మౌలిక వసతుల కల్పన ప్రాధాన్యాంశం. మరుగుదొడ్ల సౌకర్యం లేక మహిళా ఉపాధ్యాయులు, బాలికలు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నట్లు గతంలో విద్యారంగ స్థితిగతులపై రూపొందించిన 'అసర్‌' నివేదిక స్పష్టం చేసింది. ఉన్నత పాఠశాలల్లో సుమారు 17.87 శాతం విద్యార్థులు చదువులు మానేయడానికి- బడుల్లో మౌలిక వసతులు అందుబాటులో లేకపోవడం ఒక కారణంగా ఓ నివేదిక వెల్లడించింది. మరుగుదొడ్ల నిర్మాణంలో చేతివాటం ఫలితంగా నాణ్యత లోపించి, నిరుపయోగంగా మారుతున్నాయి. అవినీతికి అండగా నిలిచే అధికారులపై గట్టి చర్యలు తీసుకొనేలా చట్టపరమైన ఏర్పాట్లు జరగాలి. ప్రజాధనం వృథా కాకూడదంటే ప్రభుత్వ నిర్ణయాలు కఠినంగా ఉండాలి.

Infrastructure in Schools
పాఠశాలల్లో మౌలిక వసతులు

By

Published : Apr 8, 2021, 8:15 AM IST

అవినీతి జాడ్యం దేన్నీ వదలడం లేదు. మరుగుదొడ్ల నిర్మాణంలోనూ చేతివాటం ప్రదర్శించిన ఫలితంగా అవి నాణ్యత లోపించి, నిరుపయోగంగా మారుతున్నాయి. ప్రభుత్వ పాఠశాలల్లోని పేద విద్యార్థుల సౌకర్యార్థం చేపట్టిన మరుగుదొడ్ల నిర్మాణంలో నాసిరకం పనులతో భారీ మొత్తంలో నిధులు పక్కదారి పట్టాయి. దేశంలో 10.83 లక్షల ప్రభుత్వ పాఠశాలలు ఉండగా, వాటిలో 31,448 బాలికల పాఠశాలలు. మొత్తం సర్కారీ బడుల్లోని 12.87 కోట్ల మంది విద్యార్థుల్లో 55 శాతం మేర బాలికలే ఉన్నారు. మొత్తంగా 49.47 లక్షల మంది ఉపాధ్యాయులు విద్యాబోధన సాగిస్తుండగా, వారిలో 43 శాతం మహిళా ఉపాధ్యాయులు. విద్యార్థులకు, ఉపాధ్యాయులకు అవసరమైన మౌలిక వసతుల కల్పన ప్రాధాన్యాంశం. మరుగుదొడ్ల సౌకర్యం లేక మహిళా ఉపాధ్యాయులు, బాలికలు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నట్లు గతంలో విద్యారంగ స్థితిగతులపై రూపొందించిన 'అసర్‌' నివేదిక స్పష్టం చేసింది. దేశంలోని 42వేల ప్రభుత్వ పాఠశాలలకు కనీస మంచినీటి సదుపాయం లేదని, 15వేల స్కూళ్లలో శౌచాలయాలు లేవని ఒక ప్రశ్నకు సమాధానంగా కేంద్ర విద్యాశాఖ మంత్రి ఇటీవల సభలో స్వయంగా వెల్లడించారు. 'డైస్‌-2018-19' గణాంకాల ప్రకారం ఉన్నత పాఠశాలల్లో సుమారు 17.87 శాతం విద్యార్థులు చదువులు మానేయడానికి- బడుల్లో మౌలిక వసతులు అందుబాటులో లేకపోవడం ఒక కారణం. మరుగుదొడ్ల ఏర్పాటు, నిర్వహణ లక్ష్యాలను- నిధుల కొరత వేధిస్తోంది. ప్రతిష్ఠాత్మక 'స్వచ్ఛభారత్‌' నేపథ్యంలో ప్రతి పాఠశాలలో బాలబాలికలకు మరుగుదొడ్లు నిర్మించడానికి కేంద్ర మానవ వనరుల అభివృద్ధి మంత్రిత్వ శాఖ 2014 సెప్టెంబర్‌ ఒకటో తేదీన స్వచ్ఛవిద్యాలయ అభియాన్‌ను ప్రారంభించింది. పాఠశాలల్లో నీరు, పారిశుద్ధ్యం, పరిశుభ్రత సౌకర్యాలు విద్యార్థులకు అందుబాటులోకి తీసుకురావడం దీని ప్రధాన లక్ష్యం. 'కార్పొరేట్‌ సామాజిక బాధ్యత (సీఎస్‌ఆర్‌)' కార్యక్రమంలో భాగంగా అనేక ప్రభుత్వ రంగ సంస్థలు ఈ ఉద్యమ స్ఫూర్తిని అందిపుచ్చుకొని సర్కారీ బడుల్లో మరుగుదొడ్ల నిర్మాణానికి ముందుకొచ్చాయి.

65 శాతం నాసిరకమే..

సుమారు యాభై కేంద్ర ప్రభుత్వరంగ సంస్థల ఆధ్వర్యంలో రూ.2162.60 కోట్ల వ్యయంతో 1,30,703 మరుగుదొడ్ల నిర్మాణం చేపట్టారు. అయితే, 1,19,530 మరుగుదొడ్లే నిర్మించినట్లు కేంద్ర మానవ వనరుల అభివృద్ధి మంత్రిత్వ శాఖ నివేదిక స్పష్టంచేసింది. 11,173 మరుగుదొడ్లు నిర్మించకుండానే నిర్మాణం చేపట్టినట్లు ఆధారాలు సృష్టించి నిధులు కాజేసినట్లు గుర్తించారు. సుమారు రూ. 335.19 కోట్ల మేర అవకతవకలు చోటుచేసుకున్నట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో 'కాగ్‌' పరిశీలన చేపట్టింది. 15 రాష్ట్రాల్లో 2048 పాఠశాలల్లో నిర్మించిన 2695 మరుగుదొడ్లపై సమగ్ర విచారణ చేపట్టగా 65 శాతం మేర మరుగుదొడ్లు నాసిరకంగా ఉన్నట్లు అధికారులు తేల్చారు. నీటి సౌకర్యం లేక అధిక శాతం మరుగుదొడ్లు నిరుపయోగంగా పడి ఉన్నాయి. వాటి నిర్మాణ వ్యయం వృథాగా మారింది. నాసిరకం ఉపకరణాలు వాడటంతో ఉపయోగించక ముందే ధ్వంసమయ్యాయి. మరుగుదొడ్ల నిర్వహణకు అయిదేళ్ల కాలవ్యవధికి గ్రామ విద్యా కమిటీలకు ప్రభుత్వరంగ సంస్థల ద్వారానే నిధులు సమకూర్చేలా ఒప్పందాలు జరిగాయి. కానీ విద్యా కమిటీలకు సకాలంలో నిధులు అందలేదు. దాంతో పర్యవేక్షణ కొరవడి 67శాతం మరుగుదొడ్లు నిరుపయోగంగా ఉన్నట్లు తేలింది. మరుగుదొడ్లు ఉపయోగించిన తరవాత చేతులు శుభ్రం చేసుకోవడం ఎంతో ముఖ్యమైన చర్యగా స్వచ్ఛవిద్యాలయ అభియాన్‌ మార్గదర్శకాల్లో పొందుపరచారు. 70 శాతం మరుగుదొడ్లలో పంపు నీటి సౌకర్యమే కరవైంది. చిన్నపాటి ఈదురుగాలులకే వందల సంఖ్యలో మరుగుదొడ్లు నేలమట్టమయ్యాయి. అన్ని పాఠశాలల్లో మరుగుదొడ్ల వద్ద దివ్యాంగుల సౌకర్యార్థం ర్యాంపులు నిర్మించాల్సి ఉన్నా- 30శాతం బడుల్లో వాటి ఊసే లేదు.

చేతివాటంతో సమస్యలు తప్పటం లేదు..

ప్రభుత్వ పాఠశాలల్లో బాలబాలికలకు వేర్వేరు పథకాల ద్వారా ప్రత్యేక మరుగుదొడ్లు నిర్మించేందుకు భారత ప్రభుత్వం పలు చర్యలు తీసుకుంటున్నా లక్ష్య సాధనలో ఎన్నో అవాంతరాలు ఏర్పడుతున్నాయి. ప్రధానంగా సరిపడా నిధులు లేక మరుగుదొడ్ల నిర్వహణ భారమవుతోంది. పలు ప్రభుత్వరంగ సంస్థలు ముందుకొచ్చి తమవంతు బాధ్యతగా నిధులు సమకూర్చినా, అధికారుల చేతివాటం కారణంగా సమస్యలు తప్పడం లేదు. ఈ క్రమంలో నిర్మాణ పనుల పర్యవేక్షణకు ప్రత్యేక బృందాల్ని తప్పనిసరిగా ఏర్పాటు చేయాలి. మార్గదర్శకాలకు అనుగుణంగా పనులు పూర్తవుతున్నదీ, లేనిదీ గమనించాలి. నిబంధనలు పాటించని సంస్థలపై నిషేధం విధించాలి. అవినీతికి అండగా నిలిచే అధికారులపై గట్టి చర్యలు తీసుకొనేలా చట్టపరమైన ఏర్పాట్లు జరగాలి. ప్రజాధనం వృథా కాకూడదంటే ప్రభుత్వ నిర్ణయాలు కఠినంగా ఉండాలి.

- డాక్టర్‌ సిలువేరు హరినాథ్‌

(రచయిత- 'సెస్‌'లో రీసెర్చ్‌ అసిస్టెంట్‌)

ABOUT THE AUTHOR

...view details