తెలంగాణ

telangana

ETV Bharat / opinion

స్వస్థ భారత్‌ కోసం.. చెత్త శుద్ధి! - స్వస్థ భారత్‌

భారత్​లో ఘనవ్యర్థాల నిర్వహణలో తీవ్ర అలసత్వం కనబడుతోంది. విచ్చలవిడిగా బహిరంగ ప్రదేశాల్లో చెత్త వేయడం వల్ల అనేక అనారోగ్య సమస్యలు ఎదురవుతున్నాయి. ఇక వ్యర్థాల సేకరణ, శుద్ధిపై ప్రభుత్వ లెక్కలకు సర్వే లెక్కలకు పొంతన కుదరకపోవడం ఆందోళన కలిగిస్తోంది.

solid Waste Management
వ్యర్థాల నిర్వహణ

By

Published : Aug 9, 2021, 5:27 AM IST

'ఉదాసీనత ఇలాగే కొనసాగితే ఏదో ఒకరోజు ఇండియా చెత్తకుప్పల కింద కూరుకుపోతుంది'- క్షేత్రస్థాయిలో కొల్లబోతున్న ఘనవ్యర్థాల నిర్వహణ నిబంధనలపై సుప్రీంకోర్టు మూడేళ్ల క్రితం ఆవేదనాత్మకంగా స్పందించిన తీరిది. వ్యర్థాల సేకరణ మొదలు శుద్ధి వరకు దేశవ్యాప్తంగా నెలకొన్న దుస్థితిపై ఆ తరవాత పార్లమెంటరీ స్థాయీసంఘమూ ఆందోళన వ్యక్తంచేసింది. అవన్నీ అరణ్యరోదనలే అవుతున్న వేళ- భారతీయ నగరాల్లో రహదారులే చెత్తకుండీలుగా మారిపోతున్నాయి! వీధులు, బహిరంగ ప్రదేశాల్లో వ్యర్థాలను పడేయడం, తగలబెట్టడం వంటివి ప్రజారోగ్యానికి పొగపెడుతూ యథేచ్ఛగా సాగిపోతూనే ఉన్నాయి.

పొంతన కుదరని లెక్కలు..

దేశవ్యాప్తంగా 4372 పట్టణ, నగరపాలక సంస్థల్లోని 97శాతం వార్డుల పరిధిలో ఇంటింటి నుంచి చెత్త సేకరణ సమర్థంగా సాగుతోందని కేంద్రం లోక్‌సభలో తాజాగా ప్రకటించింది. పట్టణ భారతంలో రోజూ సగటున ఉత్పత్తి అవుతున్న 1.40 లక్షల టన్నుల ఘనవ్యర్థాల్లో 68శాతం మేరకు శుద్ధి అవుతున్నాయని వెల్లడించింది. 98శాతం శుద్ధితో హిమాచల్‌ప్రదేశ్‌ ఈ జాబితాలో ముందుంటే- తొమ్మిది శాతం వ్యర్థాల శుద్ధీకరణతో బంగాల్ అట్టడుగుకు పరిమితమైంది. ఏపీలో 36శాతం, తెలంగాణలో 22శాతం ఘనవ్యర్థాలు శుద్ధికి నోచుకోవడం లేదని కేంద్ర ప్రభుత్వ ప్రకటన పేర్కొంటోంది. ఆసేతుహిమాచలం నాలుగు వేలకు పైగా పట్టణాల్లోని పారిశుద్ధ్య స్థితిగతులను గుదిగుచ్చిన 'స్వచ్ఛ్‌ సర్వేక్షణ్‌ 2020' సర్వే మాత్రం చెత్త సేకరణ, శుద్ధికి సంబంధించి సర్కారీ గణాంకాలతో విభేదిస్తోంది. 1636 పురపాలక సంఘాల పరిధిలో గృహ వ్యర్థాల సేకరణ యాభై శాతానికి మించడం లేదని ఆ నివేదిక తేటతెల్లం చేస్తోంది. సేకరించిన చెత్తను తడి, పొడిగా విభజించి అధిక మొత్తంలో శుద్ధి చేస్తున్న పట్టణాలూ చాలా తక్కువగానే ఉన్నాయన్న సర్వే సమాచారమూ కలవరపాటుకు గురిచేస్తోంది. వ్యర్థాలను వందశాతం శాస్త్రీయంగా శుద్ధిచేస్తేనే స్వచ్ఛ భారత స్వప్నం సంపూర్ణంగా సాకారమవుతుంది.

వేధిస్తున్న నిధుల కొరత..

పట్టణాలను పరిశుభ్రంగా ఉంచాల్సిన బాధ్యత పురపాలక సంఘాలదేనని 74వ రాజ్యాంగ సవరణ చట్టం స్పష్టీకరిస్తోంది. నిధుల కొరతతో అల్లాడుతున్న స్థానిక సంస్థలు ఈ కర్తవ్య దీక్షలో విఫలమవుతున్నాయని పార్లమెంటరీ స్థాయీసంఘం నివేదించింది. ఘనవ్యర్థాల నిర్వహణ నిమిత్తం ఆ సంస్థలకు సముచిత నిధులు, మానవ వనరులను ప్రభుత్వం అందుబాటులో ఉంచాలని సిఫార్సు చేసింది. గడచిన ఏడేళ్లలో వ్యర్థాల శుద్ధి మూడు రెట్లకు పైగా పెరిగిందంటున్న కేంద్రం- రాబోయే సంవత్సరాల్లో సమస్య పూర్తిగా పరిష్కారమవుతుందని చెబుతోంది. మరోవైపు సేంద్రియ ఎరువుల తయారీ, విద్యుదుత్పత్తి ద్వారా చెత్త నుంచి బంగారం తీయాలన్న ప్రణాళికలూ సంపూర్తిగా సఫలీకృతం కావడం లేదు. జపాన్‌, స్వీడన్‌, సింగపూర్‌, ఆస్ట్రేలియా వంటి దేశాల్లో చెత్త నియంత్రణ, పునర్వినియోగం గరిష్ఠ స్థాయిలో సాగుతున్నాయి. మాస్కుల తయారీ నుంచి రహదారుల నిర్మాణం వరకు ప్లాస్టిక్‌ వ్యర్థాలను ఉపయోగించుకొంటున్న దేశాలు మేలిమి ఫలితాలను సాధిస్తున్నాయి.

అశ్రద్ధతో ఆరోగ్యానికి ముప్పు..

బహిరంగ ప్రదేశాల్లో భారీయెత్తున మేటవేస్తున్న చెత్తను పర్యావరణహితంగా తొలగించడంలో ఇండియా చూపుతున్న అశ్రద్ధ- జనావళికి 22 రకాల జబ్బులను అంటిస్తోందని ప్రపంచ ఆరోగ్య సంస్థ లోగడే హెచ్చరించింది. 2050 నాటికి పట్టణభారతంలో ఘనవ్యర్థాల ఉత్పత్తి ఏటా 43.6 కోట్ల టన్నులకు చేరుతుందన్నది అంచనా! చెత్త సేకరణ, విభజన, శుద్ధీకరణ, పునర్వినియోగ విధానాల్లోని లోటుపాట్లు సమసిపోతేనే భావిభారతానికి కడగండ్లు తప్పుతాయి. కేంద్ర-రాష్ట్ర ప్రభుత్వాలు, స్థానిక సంస్థలు సమష్టిగా కదిలితేనే పట్టణాలు, నగరాల రూపురేఖలు మారతాయి. వ్యర్థాల పారబోతలో విచ్చలవిడితనాన్ని విడనాడి, మార్గదర్శకాలకు కట్టుబడేలా ప్రజాచైతన్యమూ వెల్లివిరిసినప్పుడే స్వస్థ భారతం ఆవిష్కృతమవుతుంది.

ఇదీ చూడండి:వ్యర్థాల పునర్వినియోగంతో సంపద సృష్టి!

ABOUT THE AUTHOR

...view details