తెలంగాణ

telangana

ETV Bharat / opinion

వినియోగదారుల హక్కులకేదీ భరోసా?

ఇటీవలి కాలంలో వినియోగదారులకు తమ హక్కులపై (consumer rights news) అవగాహన బాగా పెరిగింది. బాధితులు పెద్దసంఖ్యలో ఆ వేదికలను ఆశ్రయిస్తున్నారు. చాలా కేసుల్లో బాధ్యులకు చెంపపెట్టువంటి తీర్పులు వెలువడుతున్నాయి. ఇంతటి ప్రాధాన్యం కలిగిన సంఘాల్లో సరిపడా సిబ్బంది లేకపోవడం వినియోగదారుల చట్ట స్ఫూర్తికే గొడ్డలిపెట్టుగా మారుతోంది. దీనిపై తాజాగా దేశ అత్యున్నత న్యాయస్థానం మరోసారి తీవ్ర అసహనం వ్యక్తం చేసింది.

consumer rights latest news
వినియోగదారుల హక్కులు

By

Published : Oct 30, 2021, 5:27 AM IST

ఎటువంటి మోసం, మానసిక వేదనలకు ఆస్కారం లేని వస్తువులు, సేవలు పొందడం (consumer rights news) వినియోగదారుల హక్కు. ఆయా వస్తువుల నాణ్యత, సేవల్లో సమర్థత, ధరలు, స్వచ్ఛత తదితరాల గురించి సమాచారం తెలుసుకోవడం, ఆస్తి, ప్రాణ నష్టానికి దారితీసే వస్తువులను విక్రయించేవారి నుంచి రక్షణ పొందడమూ వారి హక్కుల్లో భాగమే. చాలా సందర్భాల్లో వీటికి విఘాతం కలుగుతోంది. తయారీదారులు, వ్యాపారస్తులు నాసిరకం వస్తువులు విక్రయిస్తూ, సేవల్లో ఉదాసీనత ప్రదర్శిస్తూ వినియోగదారులకు తీవ్ర వేదన మిగిలిస్తున్నారు. ఇటువంటి సందర్భాల్లో బాధితులు వినియోగదారుల వివాద పరిష్కార సంఘాల ద్వారా న్యాయం పొందవచ్చు. ఇటీవలి కాలంలో వినియోగదారులకు తమ హక్కులపై అవగాహన బాగా పెరిగింది. బాధితులు పెద్దసంఖ్యలో ఆ వేదికలను ఆశ్రయిస్తున్నారు. చాలా కేసుల్లో బాధ్యులకు చెంపపెట్టువంటి తీర్పులు వెలువడుతున్నాయి. ఇంతటి ప్రాధాన్యం కలిగిన సంఘాల్లో సరిపడా సిబ్బంది లేకపోవడం వినియోగదారుల చట్ట స్ఫూర్తికే గొడ్డలిపెట్టుగా మారుతోంది. దీనిపై తాజాగా దేశ అత్యున్నత న్యాయస్థానం మరోసారి తీవ్ర అసహనం వ్యక్తం చేసింది.

ప్రజా ప్రయోజనాలకు తూట్లు

వినియోగదారుల హక్కుల పరిరక్షణ (consumer rights protection) కోసం 1986లో చట్టాన్ని రూపొందించారు. దీనికింద జిల్లా, రాష్ట్ర, జాతీయ స్థాయిలో కోర్టులు ఏర్పాటయ్యాయి. తరవాతి కాలంలో వ్యాపార సరళి, వాణిజ్య విధానాల్లో వచ్చిన మార్పులకు అనుగుణంగా 2019లో పాత చట్టం స్థానంలో కొత్తది తెచ్చారు. ఆన్‌లైన్‌ మార్కెట్‌ను సైతం నూతన చట్టంలో చేర్చారు. బాధితులు తాము నివాసం ఉండే, పనిచేసే ప్రాంతాలకు సమీపంలోని సంఘాల్లో ఫిర్యాదులు నమోదుచేసే వెసులుబాటు కల్పించారు. ఆన్‌లైన్‌లోనూ అర్జీ దాఖలు చేయవచ్చు. కొత్త చట్టంలో భాగంగా కేంద్ర వినియోగదారుల పరిరక్షణ ప్రాధికార సంస్థ(సీసీపీఏ)ను ఏర్పాటు చేశారు. నిబంధనల అతిక్రమణలపై సోదాలు, దర్యాప్తు జరిపే అధికారం దీనికి ఉంటుంది. ప్రజలను తప్పుదోవ పట్టించే ప్రకటనలను నిలిపివేయడంతో పాటు జరిమానాలూ విధిస్తుంది. హక్కుల పరిరక్షణపై మంత్రిత్వశాఖకు సూచనలు సైతం చేస్తుంది. వినియోగదారుల హక్కులకు గొడుగుపట్టే జిల్లా, రాష్ట్రస్థాయి సంఘాల్లో పెద్దయెత్తున ఖాళీలు పోగుపడటం, వాటిలో మౌలిక వసతులు కొరవడటంపై దేశ సర్వోన్నత న్యాయస్థానం సుమోటోగా విచారణ ప్రారంభించింది. జిల్లా వినియోగదారుల వేదికల్లో 188 మంది అధ్యక్షులతో కలిపి మొత్తం 721 ఖాళీలు ఉన్నట్లు అమికస్‌ క్యూరీ సుప్రీంకోర్టు దృష్టికి తెచ్చారు. రాష్ట్ర సంఘాల్లో ఎనిమిది మంది అధ్యక్షులతో కలిపి మొత్తం 72 పోస్టులు, జాతీయ కమిషన్‌లో మూడు ఖాళీలు ఉన్నాయని పేర్కొన్నారు. దీనిపై న్యాయస్థానం- ప్రజా ప్రయోజనం కోసం రూపొందిస్తున్న చట్టాలకు ప్రభుత్వాలు తూట్లు పొడుస్తున్నాయంటూ ఈ ఏడాది ఆగస్టులో తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. ఎనిమిది వారాల్లోగా ఖాళీలను భర్తీచేయాలని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలను ఆదేశించింది. దానిపై సరైన చర్యలు కొరవడటంతో తాజాగా ఘాటుగా స్పందించింది. ఈ ట్రైబ్యునళ్లు వద్దనుకుంటే వినియోగదారుల పరిరక్షణ చట్టాన్నే రద్దు చేయాలని వ్యాఖ్యానించింది. దేశంలోని 28 రాష్ట్రాలు, ఎనిమిది కేంద్రపాలిత ప్రాంతాల్లో 638 జిల్లా వినియోగదారుల వేదికలు, 36 రాష్ట్ర వినియోగదారుల సంఘాలు పనిచేస్తున్నాయని కేంద్ర వినియోగదారుల వ్యవహారాల సహాయ మంత్రి అశ్వినీ కుమార్‌ చౌబే ఈ ఏడాది జులైలో పార్లమెంటులో ప్రకటించారు. ఈ ఏడాది జూన్‌ నాటికి 367 మంది అధ్యక్షులు, 695 మంది సభ్యులు వాటిలో విధులు నిర్వర్తిస్తున్నారని వెల్లడించారు. ఖాళీల గురించి మాత్రం ఆయన ప్రస్తావించలేదు.

విమర్శలకు ఆస్కారం

నిజానికి ట్రైబ్యునళ్ల విషయంలో కేంద్ర విధానాలు ఇటీవలి కాలంలో ఎన్నో విమర్శలకు తావిస్తున్నాయి. మద్రాస్‌ బార్‌ అసోసియేషన్‌ కేసులో సుప్రీం తీర్పునకు విరుద్ధంగా ట్రైబ్యునల్‌ సంస్కరణ చట్టాన్ని కేంద్రం పట్టాలకెక్కించింది. ఆయా ట్రైబ్యునళ్లలో నియామకాలపై దృష్టి సారించకపోవడంపై సుప్రీంకోర్టు అసహనం వ్యక్తం చేసింది. వినియోగదారుల చట్టంలో కొన్ని సెక్షన్లను బాంబే హైకోర్టు పరిధిలోని నాగ్‌పుర్‌ బెంచ్‌ గతంలో కొట్టేసింది. కమిషన్లలో నియామకాలకు ఆ తీర్పు అడ్డంకేమీ కాబోదని అత్యున్నత న్యాయస్థానం పేర్కొంది. కేంద్రం తరఫున అదనపు సొలిసిటర్‌ జనరల్‌ అమన్‌ లేఖి వాదనలు వినిపిస్తూ నాగ్‌పుర్‌ బెంచ్‌ తీర్పుపై అప్పీలు ప్రయత్నాలు చేస్తున్నామని పేర్కొన్నారు. దానికి మరెంత సమయం అవసరమవుతుందన్నది ప్రధాన ప్రశ్న. వినియోగదారుల సంఘాల్లో సిబ్బంది లేమితో ఉన్నవారిపై అదనపు భారం పడుతోంది. కష్టించి కూడబెట్టుకున్న సొమ్ముతో కొన్న వస్తువులు, పొందే సేవల్లో అన్యాయాల పట్ల వినియోగదారులకు వెన్నుదన్నుగా నిలుస్తున్న సంఘాల పట్ల పాలకుల నిర్లక్ష్యం ఎంతమాత్రం సరికాదు. దేశ ఆర్థిక వ్యవస్థ కళకళలాడాలంటే ప్రజల కొనుగోళ్లు, పొందే సేవలు పెరగాలి. వాటిలో రాజ్యమేలే అక్రమాలు, అలక్ష్యం దేశాభివృద్ధికే విఘాతాలుగా మారతాయి. ప్రభుత్వాలు స్పందించి వెంటనే సంఘాల్లో ఖాళీలను భర్తీచేయాలి. అప్పుడే వినియోగదారుల హక్కులకు సరైన భరోసా దక్కుతుంది.

- ఎం.అక్షర

ఇదీ చదవండి:ఆలయంలోకి ప్రవేశించారని దళిత కుటుంబంపై దాడి

ABOUT THE AUTHOR

...view details