తెలంగాణ

telangana

ETV Bharat / opinion

దేశానికి ఏదీ రక్షణ.. సత్వర న్యాయం ఎండమావే! - Political corruption

నేరాలూ ఘోరాలూ రాకెట్‌ వేగంతో పోటీపడుతూ నయా సాంకేతిక పరిజ్ఞానం దన్నుతో నిక్షేపంగా సాగిపోతుంటే, మన నేరన్యాయ వ్యవస్థ జోడెడ్ల బండి కాలం నాటి విధానాలు పట్టుకు పాకులాడుతూ- సత్వర న్యాయాన్ని అక్షరాలా ఎండమావిగా మార్చేసింది. డబ్బు, మందు, మగువ- వీటి కోసం ఏ గడ్డి కరవడానికైనా సిద్ధపడ్డ ప్రబుద్ధులు రక్షణ విభాగాల్లో దండిగా పోగుపడ్డ నిజాన్ని తెహల్కా వీడియో సాక్ష్యాలు ధ్రువీకరించాయి. తప్పుచేసిన వాడెవడూ తప్పించుకోలేని విధంగా చట్టబద్ధ యంత్రాంగాల పనిపోకడల్ని ప్రక్షాళించి చూడండి. నేరగ్రస్త రాజకీయాలపై చావుదెబ్బా పడుతుంది. ఏమంటారు?

corrupt politics
దేశానికి ఏదీ రక్షణ?

By

Published : Aug 2, 2020, 7:46 AM IST

టాటా ట్రస్టుల ఆధ్వర్యంలో నిరుడు సెప్టెంబరులో వెలుగుచూసిన ఇండియా జస్టిస్‌ రిపోర్ట్‌- 126 దేశాల చట్టబద్ధ పాలన సూచీలో భారత్‌ 68వ స్థానంలో ఉన్నట్లు నివేదించింది. ఆ కారణంగా జీడీపీలో తొమ్మిది శాతాన్ని ఇండియా కోల్పోతున్నట్లు మరో అధ్యయనం చాటుతోంది!

నేరాలూ ఘోరాలూ రాకెట్‌ వేగంతో పోటీపడుతూ నయా సాంకేతిక పరిజ్ఞానం దన్నుతో నిక్షేపంగా సాగిపోతుంటే, మన నేరన్యాయ వ్యవస్థ జోడెడ్ల బండి కాలం నాటి విధానాలు పట్టుకు పాకులాడుతూ- సత్వర న్యాయాన్ని అక్షరాలా ఎండమావిగా మార్చేసింది. దానివల్ల నేరాలు నిజం, న్యాయం మిథ్యగా మారి దోచుకొన్నవారికి దోచుకొన్నంతగా వాతావరణం విషమించింది. సాక్ష్యం కావాలంటే, 'ఆపరేషన్‌ వెస్ట్‌ ఎండ్‌' 2001లో సృష్టించిన రాజకీయ, సామాజిక సంచలనం పోనుపోను పాలపొంగులా ఎలా చల్లారిపోయిందో, న్యాయపోరాటం అంతులేని కథగా మలి అంకానికి ఏ విధంగా చేరిందో గమనించాలి!

తిరుగులేని రుజువులు

దేశ రక్షణకు వనరుల కేటాయింపు విషయంలో ఏ మాత్రం రాజీపడేది లేదన్న మాట ప్రతి ఏటా బడ్జెట్‌ ప్రసంగంలో ఆనవాయితీగా వినిపిస్తూనే ఉంటుంది. అరకొర కేటాయింపులు వాస్తవిక అవసరాలకు అక్కరకు రావడం లేదన్న ఆక్షేపణలు, కాంట్రాక్టుల్లో ముడుపుల చిలక్కొట్టుళ్లు ముమ్మరిస్తున్న వైనాలు అడపా దడపా 'కాగ్‌' నివేదికల్లో ప్రత్యక్షమవుతూనే ఉన్నాయి. ఆ తరహా రక్షణ కొనుగోళ్లలో అవినీతి ఆదీఅంతాల గుట్టుమట్లు వెలికి లాగడానికి తెహల్కా డాట్‌ కామ్‌- నెలల తరబడి పకడ్బందీ కార్యాచరణతో 'ఆపరేషన్‌వెస్ట్‌ఎండ్' చేపట్టింది. లండన్‌లోని ఆయుధ తయారీ సంస్థ ‘వెస్ట్‌ఎండ్‌ ఇంటర్నేషనల్‌’ ప్రతినిధులమంటూ చేతిలో ఇమిడే థర్మల్‌ కెమెరాల కాంట్రాక్టు చేజిక్కించుకొనేందుకు అధికారులు, రాజకీయ ప్రముఖులు ఎందర్నో కలిసింది. థర్మల్‌ కెమెరాల కాంట్రాక్టుకు సహకరిస్తే భారీగా ముడుపులిస్తామన్న తెహల్కా- ఆ శూలశోధనకు ఖర్చు చేసింది రూ.10.8లక్షలు! కానీ అది బయటపెట్టిన వీడియోలు- నీతి తప్పిన నేతలు, బ్యురోక్రాట్ల దేశద్రోహ చర్యలకు తిరుగులేని రుజువులు!

'అంతిమ న్యాయం' ఎప్పటికో చెప్పలేం

రక్షణ కాంట్రాక్టుల్లో మధ్యవర్తులూ ముడుపులూ మామూలేనని దేశ రక్షణమంత్రిగా ములాయం సింగ్‌ యాదవ్‌ దేశ ప్రజానీకం కళ్లు తెరిపించే ప్రయత్నం అంతకు ముందే చేశారు. 'వెయ్యి వాంగ్మూలాల పెట్టు ఒక్క వీడియో' అన్న తెలివిడితో తెహల్కా- రక్షణ రంగ ముడుపుల బాగోతాల ధారావాహికనే సిద్ధం చేసింది. ప్రాథమిక దశలో డైరెక్టరేట్‌ జనరల్‌ఆఫ్‌ ఆర్డినెన్స్‌లో సీనియర్‌ సెక్షన్‌ ఆఫీసర్‌ చేతులు తడపడంతో మొదలై, సాక్షాత్తు దేశ రక్షణమంత్రి ఇంట్లో లంచాలు చేతులు మారేదాకా సాగిన పరిశోధన 2001లో దేశాన్ని కుదిపేసింది. లక్ష రూపాయల మొత్తాన్ని ‘పార్టీకి విరాళం’ రూపేణా అందుకొన్న భాజపా అధ్యక్షుడు బంగారు లక్ష్మణ్‌ బొమ్మ దిగ్భ్రాంతపరచింది. నాటి రక్షణమంత్రి జార్జి ఫెర్నాండెజ్‌ సహచరి, సమతా పార్టీ అధినేత్రి జయా జైట్లీ, పార్టీ జాతీయ కోశాధికారి అశోక్‌జైన్‌ ముడుపులందుకొని తరించిపోయారు. సైనిక శ్రేణుల్లో అవినీతి కలుపు మొక్కలుగా వీడియోలకెక్కిన వారిని మిలిటరీ కోర్ట్‌ మార్షల్‌చేయగా, ప్రజాజీవనంలోని పెద్దల విషయానికి వచ్చేసరికి సంకుచిత రాజకీయం గజ్జె కట్టింది. రెండు విచారణ కమిషన్ల దరిమిలా కేదస దర్యాప్తు ఏళ్లు పూళ్లు కొనసాగి- ఎట్టకేలకు జయా జైట్లీతోపాటు ఆమెకు సహకరించిన మరో ఇద్దరికి సీబీఐ కోర్టు నాలుగేళ్ల జైలుశిక్ష విధించింది. హుటాహుటిన జయా జైట్లీకి హైకోర్టునుంచి బెయిలు మంజూరు కావడంతో అక్కడ కేసు విచారణ మరింకెన్నేళ్లు జరుగుతుందో, 'అంతిమ న్యాయం' ఎప్పటికి అమలవుతుందో చెప్పగల నాథుడు లేడు.

డబ్బు, మందు, మగువ- వీటి కోసం ఏ గడ్డి కరవడానికైనా సిద్ధపడ్డ ప్రబుద్ధులు రక్షణ విభాగాల్లో దండిగా పోగుపడ్డ నిజాన్ని తెహల్కా వీడియో సాక్ష్యాలు ధ్రువీకరించాయి. మొత్తం దేశ రక్షణ వ్యవస్థతోనే నిందితులు రాజీ పడ్డారంటూ, రక్షణ కొనుగోళ్లలో అవినీతి పట్ల ఏ మాత్రం ఉపేక్షా భావం పనికిరాదన్న సీబీఐ కోర్టు న్యాయమూర్తి- కేసు తీవ్రతను సరిగ్గానే మదింపు వేశారు. దేశాన్నే అట్టుడికించిన ఆ కేసులో న్యాయ విచారణ ఎందుకు వేగంగా సాగలేదు? వీడియో సాక్ష్యాలు నేర తీవ్రతను కళ్లకు కడుతున్నా సీబీఐ కోర్టులో తీర్పు రావడానికే ఏళ్లు పూళ్లూ పట్టడం ఏమిటి?- వంటి ప్రశ్నలకు- చట్టాలపై రాజకీయాల స్వారీ అన్నదే సమాధానమవుతుంది.

కమిషన్​ ఏర్పాటు..

తెహల్కా కేసులు రాజకీయ ప్రకంపనలు సృష్టిస్తున్న సమయంలో జస్టిస్‌ కె.వెంకటస్వామి కమిషన్‌ ఏర్పాటైంది. 'ఆపరేషన్‌ వెస్ట్‌ ఎండ్‌'తోపాటు అంతక్రితం జరిగిన రక్షణ లావాదేవీల దర్యాప్తు బాధ్యతనూ నిభాయించిన కమిషన్‌- 181 రోజులు భేటీ అయి, 50మంది సాక్షుల్ని విచారించి, 720 మధ్యంతర ఉత్తర్వులతో సకలం సిద్ధం చేసి నివేదికకు తుదిరూపు దిద్దుతున్న దశలో జస్టిస్‌ వెంకటస్వామి రాజీనామా చేయాల్సి వచ్చింది. 'సుప్రీం' ప్రధాన న్యాయమూర్తి సూచన మేరకు అథారిటీ ఫర్‌ అడ్వాన్స్‌ రూలింగ్‌కు ఛైర్మన్‌గా ఉండటానికి ఆమోదం తెలపడంపై రేగిన రాజకీయ రగడకు నొచ్చుకొన్న జస్టిస్‌ వెంకటస్వామి- తెహల్కా కమిషన్‌ నుంచి వైదొలగారు. తదుపరి దర్యాప్తు బాధ్యతలు చేపట్టిన జస్టిస్‌ పుఖాన్‌ కమిషన్‌ పదవీకాలం పొడిగింపునకు యూపీఏ ప్రభుత్వం సమ్మతించలేదు. ఎన్నికల వేళ జస్టిస్‌ పుఖాన్‌ కమిషన్‌ ఇచ్చిన తొలి నివేదిక నాటి రక్షణమంత్రి జార్జి ఫెర్నాండెజ్‌కు 'క్లీన్‌ చిట్‌' ఇవ్వడం యూపీఏ పాలకులకు నచ్చలేదన్న విశ్లేషణల్నీ తోసిపుచ్చే వీల్లేదు. దరిమిలా దర్యాప్తు బాధ్యతలు చేపట్టి రాజకీయ నాయకులు, రక్షణ శాఖ అధికారులపై కేదస తొమ్మిది కేసులు పెట్టగా- బంగారు లక్ష్మణ్‌పై కేసులో సీబీఐ న్యాయస్థానం 2012 ఏప్రిల్‌లోనే నాలుగేళ్ల జైలుశిక్ష విధించింది. జయా జైట్లీ కేసులో అదే తీర్పు రావడానికి ఇంకో ఎనిమిదేళ్లు ఎందుకు పట్టిందన్నది ఆలోచనాపరులకు అర్థంకాని మిస్టరీ!

విచారణ పద్ధతుల బూజు దులపాలి..

సామాన్యులకు న్యాయం అన్నది భారతావనిలో అద్దంలో చందమామ. రాజకీయ రాహువులు పరమ నిష్ఠగా దానికి గ్రహణం పట్టించడం దశాబ్దాల పర్యంతం కళ్లకు కడుతున్న డ్రామా! బ్రిటన్‌లోని డైరెక్టర్‌ ఆఫ్‌ ప్రాసిక్యూషన్స్‌ లాగా సమర్థ నిష్పాక్షిక సంస్థను నెలకొల్పి కేదస, ఎన్‌ఫోర్స్‌మెంట్‌డైరెక్టరేట్‌లు ప్రారంభించే విచారణల పర్యవేక్షణ బాధ్యత దానికి అప్పగించాలని 1997లోనే సుప్రీంకోర్టు సవివర మార్గదర్శకాలు జారీ చేసినా ఏం ఒరిగింది? అవినీతి కేసులో దేశాధ్యక్షురాలినే బోనెక్కించి ఏడాది తిరక్కుండానే జైలుశిక్ష ఖరారు చేసిన దక్షిణ కొరియా వంటి ఉదాహరణలు వింటే- చట్టబద్ధ పాలనకు అర్థతాత్పర్యాలేమిటో బోధపడతాయి. ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్యం అంటూ గొప్పలు చెప్పుకొనే నేతాగణాలు- చట్టం ముందు అందరూ సమానమేనన్న మౌలిక రాజ్యాంగ ధర్మానికి నిజాయతీగా నిబద్ధమైతే- ఇండియా రూపురేఖలే మారిపోతాయి. కాలం చెల్లిన నేరన్యాయ వ్యవస్థకు అగ్ని సంస్కారం చేసి, ఎపిడెన్స్‌ యాక్ట్‌ వంటివాటిని సాంతం సంస్కరించి, న్యాయస్థానాల్లో విచారణ పద్ధతుల బూజు దులిపి, ఆధునిక సాంకేతికత వినియోగాన్ని విస్తృతం చేసి, తప్పుచేసిన వాడెవడూ తప్పించుకోలేని విధంగా చట్టబద్ధ యంత్రాంగాల పనిపోకడల్ని ప్రక్షాళించి చూడండి. దశాబ్దాలపాటు దేకుతున్న అవినీతి కేసుల దశ తిరుగుతుంది. నేరగ్రస్త రాజకీయాలపై చావుదెబ్బా పడుతుంది. ఏమంటారు?

- పర్వతం మూర్తి

ABOUT THE AUTHOR

...view details