ప్రపంచవ్యాప్తంగా ఆరోగ్య ఆత్యయిక స్థితికి కారణమైన కరోనా మహమ్మారి ఇప్పటికే 20లక్షలమందికి పైగా అభాగ్యులపై కోరసాచి, లక్షా 30వేలమందిని కబళించింది. మాయావి వైరస్ మానవాళిపై సాగిస్తున్న సమరంలో ముందువరస సైనికులై మోహరించిన వైద్యారోగ్య సిబ్బందీ ప్రాణాంతక కరోనా బారినపడుతుండటమే గుండెల్ని పిండేస్తోంది. దేశ రక్షణ బడ్జెట్లకు దీటుగా ప్రజారోగ్య రంగానికీ భారీ కేటాయింపులు జరిపే బడా దేశాలే కరోనా విలయానికి చిగురుటాకుల్లా వణికిపోతుంటే, ఆరోగ్య సేవారంగం బలహీనంగా ఉన్న ఇండియా పరిస్థితి చెప్పేదేముంది? కరోనా పరీక్షల్ని విస్తృతంగా చేపట్టి, వ్యాధిగ్రస్తుల్ని సత్వరం కనిపెట్టి, చికిత్స అందించడం ద్వారా అది ప్రబలకుండా కాచుకోవాలన్న ప్రపంచ ఆరోగ్య సంస్థ హితవును ఇండియా ఇప్పటికిప్పుడు మన్నించే పరిస్థితి లేదు. వ్యాధి నిర్ధారణకు అవసరమైన కిట్లు మొదలు, ఆసుపత్రి పడకలు, వైద్య ఆరోగ్య సిబ్బందికి కరోనా సోకకుండా కాచుకొనే రక్షణ కవచాల దాకా తీవ్ర కొరత కళ్లకు కడుతున్నప్పుడు- లాక్‌డౌన్ నిర్ణయం ద్వారా వ్యాధి ఉరవడికి పగ్గాలేయడం వినా మార్గాంతరమూ లేదు!
ఏప్రిల్ ఆరునాటికి- చైనా విరాళంగా ఇచ్చిన వాటితో కలిపి రెండు లక్షల 10వేల లోపు వ్యక్తిగత రక్షణ సామగ్రి (పీపీఈ) కిట్లు అందుబాటులో ఉన్నాయి. మరో కోటీ 50 లక్షల పీపీఈలు, 15 లక్షల వ్యాధి పరీక్షల కిట్లు జన చైనానుంచి అందాల్సి ఉంది. ప్రతి పదిలక్షల జనాభాకు కరోనా పరీక్షల రేటు ఇజ్రాయెల్‌లో 18,600; ఇటలీలో 17,327; ఆస్ట్రేలియాలో 14,300; దక్షిణ కొరియాలో 10,046 ఉంటే ఇండియాలో అది కేవలం 161. చైనానుంచి కరోనా పరీక్ష కిట్లు అందుబాటులోకి వచ్చినా పెరిగే కేసుల ఉద్ధృతికి అవి సరిపోవన్న సంగతి బోధపడుతూనే ఉంది. ఈ సంక్లిష్ట పరిస్థితుల్లో దేశీయంగా వైద్య పరికరాల తయారీ సంస్థలు యుద్ధ ప్రాతిపదికన కదలాల్సి ఉన్నా- యాభైశాతం సామర్థ్యం మేరకే అవి పనిచేస్తున్న తీరు నిర్వేదం రగిలిస్తోంది. తక్షణ దిద్దుబాటు అవసరాన్ని ప్రబోధిస్తోంది!