తెలంగాణ

telangana

ETV Bharat / opinion

హక్కుల హననాన్ని అరికట్టలేమా?

శాంతిభద్రతలు సహా మానవహక్కులను పరిరక్షించడమూ పోలీసుల బాధ్యతే. అయితే వారే పౌరహక్కులకు ప్రథమ శత్రువులుగా అవతరించారని సీజేఐ జస్టిస్‌ ఎన్‌.వి.రమణ ఇటీవలే ఆక్షేపించారు. పోలీస్‌ స్టేషన్లలో పెచ్చరిల్లుతున్న హింసకు అడ్డుకట్ట పడాల్సిందేనన్న సుప్రీంకోర్టు తీర్పులూ ఎన్నో ఉన్నాయి. ఈ పరిస్థితిలో మార్పు వస్తేనే చట్టబద్ధమైన పాలన సుసాధ్యమవుతుంది.

Custodial torture
మానవ హక్కులు

By

Published : Aug 10, 2021, 5:46 AM IST

స్వతంత్ర భారతంలో సంఘ సంస్కర్తలుగా పోలీసులు ప్రజాభ్యుదయానికి పాటుపడాలని పూజ్య బాపూజీ అభిలషించారు. పౌరుల గౌరవమర్యాదలను సంరక్షిస్తూ వారి ప్రేమాభిమానాలకు పాత్రులు కావాలని రక్షకభటులకు కేంద్ర తొలి హోంమంత్రి సర్దార్‌ పటేల్‌ దిశానిర్దేశం చేశారు. జాతినేతల జనహిత ఆదర్శాలను అందిపుచ్చుకోలేకపోయిన ఖాకీలు- పౌరహక్కులకు ప్రథమ శత్రువులుగా అవతరించారని సీజేఐ జస్టిస్‌ ఎన్‌.వి.రమణ తాజాగా ఆక్షేపించారు. చిత్రహింసలకు నెలవైన ఠాణాల్లో రాజ్యాంగ నిర్దేశాలు నీరుగారిపోతున్నాయని ఆవేదన వ్యక్తపరచారు. కర్తవ్య నిర్వహణలో ఆధునికత, సంవేదనాశీలతలను మేళవించి పోలీసులపై ప్రజల్లో సానుకూల దృక్పథానికి ప్రోదిచేయాలని ప్రధాని మోదీ సైతం ఇటీవల యువ ఐపీఎస్‌ అధికారులకు సూచించారు. ఖాకీలంటే రక్షకభటులన్న విశ్వాసం నాలుగో వంతు ప్రజల్లోనైనా లేదని లోగడే పలు అధ్యయనాలు తేల్చాయి. సమాజాన్ని భయభ్రాంతులకు గురిచేస్తూ పోలీస్‌ స్టేషన్లలో పెచ్చరిల్లుతున్న హింసకు అడ్డుకట్ట పడాల్సిందేనన్న సుప్రీంకోర్టు తీర్పులూ ఎన్నో ఉన్నాయి. పరిస్థితిలో ఏమైనా మార్పు వచ్చిందా?

ఠాణాల్లో చిత్రవధలు..

గడచిన మూడేళ్లలో దేశవ్యాప్తంగా పోలీసు, జుడీషియల్‌ కస్టడీల్లో 5569 మంది మరణించారని పక్షం రోజుల క్రితం కేంద్రం పార్లమెంటుకు నివేదించింది. అదే సమయంలో ఠాణాల్లో 1189 చిత్రవధల ఘటనలు నమోదయ్యాయనీ వెల్లడించింది. వెలుగులోకి రాని అకృత్యాలు ఇంకెన్నో ఉంటాయని హక్కుల సంఘాలు ఆందోళన వ్యక్తంచేస్తున్నాయి. 1996-2016 మధ్య 31వేలకు పైగా లాకప్‌ మరణాలను జాతీయ మానవ హక్కుల సంఘం(ఎన్‌హెచ్‌ఆర్సీ) నమోదు చేసిందని ట్రాన్స్‌పరెన్సీ ఇంటర్నేషనల్‌ సంస్థ ఆ మధ్య లెక్కకట్టింది. ఎన్‌హెచ్‌ఆర్సీ నిరుడు ఆదేశించినట్లు ఇటువంటి ప్రతి మరణంపైనా పక్కాగా విచారణ సాగాలి. బాధితులను బలితీసుకొంది పోలీసుల వేధింపులేనని తేలితే- బాధ్యులకు కఠిన శిక్షలు విధించి అమలుపరచాలి. అన్ని ఠాణాల్లోనూ సీసీ టీవీ కెమెరాలను ఏర్పాటుచేసి, వాటిలో నిక్షిప్తమైన దృశ్యాలను అవసరమైనప్పుడు సాక్ష్యాధారాలుగా వినియోగిస్తేనే హక్కుల హననానికి ముగింపు పలికే వీలుంటుంది.

చిత్తశుద్ధి ఏది?

చిత్రహింసల నిరోధాన్ని లక్షించే ఐరాస తీర్మానంపై దాదాపు పాతికేళ్ల క్రితమే ఇండియా సంతకం చేసినా- ఇప్పటివరకు దానికి పూర్తిస్థాయిలో కట్టుబాటు చాటనేలేదు. అందుకు అవసరమైన ప్రత్యేక చట్టాన్ని రూపొందించే క్రతువు కొనసాగుతోందని మొన్న మార్చిలో కేంద్రం లోక్‌సభలో ప్రకటించింది. 2010లో దిగువ సభ ఆమోదం పొందిన చిత్రహింసల నిరోధక బిల్లు మురిగిపోయింది. ఆపై ఏడేళ్లకు లా కమిషన్‌ రూపొందించిన ముసాయిదా చట్టమూ అదే పరిస్థితిని ఎదుర్కొంటోంది. పోలీసు వ్యవస్థలో మార్పును ఆకాంక్షిస్తూ పదిహేనేళ్ల క్రితం సర్వోన్నత న్యాయస్థానం వెలువరించిన ఆదేశాలకూ క్షేత్రస్థాయిలో మన్నన దక్కడం లేదు. పౌరుల సంతృప్త స్థాయే పోలీసుల పనితీరుకు గీటురాయి కావాలన్న జస్టిస్‌ వర్మ కమిటీతో పాటు అంతకు ముందు ఆ తరవాత సంస్కరణలపై గళమెత్తిన ఎన్నో సంఘాల సిఫార్సులూ అమలుకు నోచడం లేదు.

పోలీసులు పౌరులకు మిత్రులయ్యేలా..

న్యూజిలాండ్‌, నెదర్లాండ్స్‌, నార్వే, జార్జియా వంటివి ఏనాడో తమ పోలీసు వ్యవస్థలను ప్రక్షాళించాయి. రక్షకులే తక్షకులు కాకుండా అవి కాచుకొంటున్నాయి. పోలీసులు పౌరులకు మిత్రులయ్యేలా మేలిమి శిక్షణ అవసరమని ప్రధానిగా మన్మోహన్‌ దశాబ్దం క్రితమే ఉద్ఘాటించారు. ఖాకీ కొలువుల్లోకి వచ్చేవారందరి నైపుణ్యాలను ఆ మేరకు సానపడితేనే పరిస్థితిలో గుణాత్మక మార్పు సాధ్యమవుతుంది. సెలవులు, సౌకర్యాల లేమితో ఇక్కట్లపాలవుతున్న సిబ్బందికి అండగా నిలవడం ద్వారా- వారి పనితీరును దెబ్బతీస్తున్న ఒత్తిళ్లను తగ్గించాలి. యావత్‌ యంత్రాంగంపై దుర్రాజకీయాల పట్టు వదిలిపోయేలా సంస్కరణలకు పాలకులు సంసిద్ధులు కావాలి. శాంతిభద్రతలతో పాటు మానవహక్కులను పరిరక్షించడమూ ఖాకీల పవిత్ర బాధ్యతేనన్న న్యాయపాలిక నిర్దేశాన్ని ఔదలదాల్చేలా పోలీసు వ్యవస్థను తీర్చిదిద్దాలి. అప్పుడే చట్టబద్ధమైన పాలనకు సరైన బాటలు పడతాయి!

ఇదీ చూడండి:prathidhwani: పౌరుల ప్రాథమిక హక్కులకు భద్రత లభించాలంటే ఏం చేయాలి?

ABOUT THE AUTHOR

...view details