తెలంగాణ

telangana

By

Published : May 30, 2021, 9:26 AM IST

ETV Bharat / opinion

బాలలపై కేంద్రానికి ఎంత దయో!

హరిత, శ్వేత, నీలి, పసుపు- విప్లవాల వర్ణచిత్రాలెంతగా మురిపించినా ఆకలి చావులు ఆగని దేశం మనది. ప్రభుత్వ సంక్షేమ పథకాలకేమీ లోటులేని భారత్​లో కేవలం కడుపు నిండా తిండి లేక ఏడాదికి ఏడు లక్షల మంది చిన్నారులు కన్నుమూస్తున్నారు. ఆఫ్రికా దేశాలకంటే అధ్వాన్నంగా అయిదేళ్లలోపు పసివాళ్లలో 31 శాతం పెరుగుదల లోపాలతో ఈసురోమంటున్నారు.

children, welfare schemes
చిన్నారులు, బడి పిల్లలు

'ఆకలితో ఉన్నవారికి దేవుడు అన్నంముద్ద రూపంలో తప్ప మరోలా కనిపించడు' అన్నారు మహాత్మాగాంధీ! ఆకలి మంటలను ఆర్పే ఆ 'దేవుడి' కోసం దేశంలోని కోట్ల కుటుంబాలు ఇప్పటికీ చేతులు సాచి వేడుకుంటూనే ఉన్నాయి! హరిత, శ్వేత, నీలి, పసుపు- విప్లవాల వర్ణచిత్రాలెంతగా మురిపించినా ఆకలి చావులు ఆగని దేశం మనది. ప్రభుత్వ సంక్షేమ పథకాలకేమీ లోటులేని ఇండియాలో కేవలం కడుపు నిండా తిండి లేక ఏడాదికి ఏడు లక్షల మంది చిన్నారులు కన్నుమూస్తున్నారంటే ఆ పాపం ఎవరిది? ఆఫ్రికా దేశాలకంటే అధ్వానంగా అయిదేళ్లలోపు పసివాళ్లలో 31 శాతం పెరుగుదల లోపాలతో ఈసురోమంటున్నారంటే ఆ దోషమెవరిది? ఈ ప్రశ్నలన్నింటికీ సమాధానాలు కావాలంటే కేంద్ర ప్రభుత్వ తాజా ప్రకటనను తిరగేయాలి! 'మహమ్మారి ముట్టడి తీవ్రంగా ఉన్న ఈ రోజుల్లో బాలల రోగనిరోధక శక్తిని రక్షించడానికి, వారికి పోషకాహారం సమకూర్చడానికి' అంటూ ప్రభుత్వ బడుల్లోని దాదాపు పన్నెండు కోట్ల మంది పిల్లలకు తలో వంద రూపాయల చొప్పున చేతిలో పెట్టబోతున్న కేంద్ర సర్కారు దయార్ద్ర హృదయానికి జోహార్లు పలకాలి! ఈ నూరు రూపాయలతో ఎన్ని రోజుల పాటు ఎంతటి బలవర్ధకమైన తిండి తింటే కొవిడ్‌ను ఎదుర్కొనే శక్తి వస్తుందో ఏలినవారే సెలవిచ్చి ఉంటే ఇంకా బాగుండేది!

బడిపిల్లల కడుపులపై కొవిడ్​ దెబ్బ..

స్వాతంత్య్రం సిద్ధించినప్పుడు ఇండియా జనాభా ఎంతో ఇప్పుడు దేశంలో ఆకలితో అలమటిస్తున్న నిరుపేదలు అంతమంది! పిల్లలకు ఒక్కపూట అయినా పట్టెడు అన్నం దొరుకుతుందన్న ఆశతో పేద కుటుంబాలెన్నో తమ బిడ్డలను సర్కారీ బడులకు పంపుతున్నాయి. దేశంపై పగబట్టినట్టు పేట్రేగిపోతున్న కొవిడ్‌ మహమ్మారి ఆ బడిపిల్లల కడుపులపైనా దెబ్బకొట్టింది. వ్యాధి నియంత్రణ చర్యల్లో భాగంగా జనజీవన దిగ్బంధనం తప్పనిసరి కావడంతో విద్యాసంస్థలు మూతపడ్డాయి. దేశావ్యాప్తంగా 11 లక్షలకు పైగా ప్రభుత్వ బడుల్లో మధ్యాహ్న భోజన పథకం నిలిచిపోయింది. వీటిలో చదువుకుంటున్న కోట్ల మంది బాలబాలికల్లో 95 శాతం అణగారిన వర్గాల వారే! ఈ చిన్నారులకు బలవర్ధకమైన ఆహారాన్ని అందించాలన్నదే మధ్యాహ్న భోజన పథకం అసలు లక్ష్యం. కరోనాతో ఈ పథకం ఆగిపోవడంతో ఎనిమిదో తరగతి లోపు చిన్నారులకు నేరుగా తలో వంద రూపాయల చొప్పున అందజేయాలని కేంద్ర ప్రభుత్వం జాలి గుండెతో నిర్ణయించింది. నెలకోసారి ఇంత ఇస్తారో, సంవత్సరం మొత్తానికీ దీనితోనే సరిపెట్టుకొమ్మంటున్నారో స్పష్టత లేదు. నెలకు వంద రూపాయలనుకున్నా, రోజుకు నాలుగు రూపాయలకు మించి పిల్లలకు దక్కేదేమీ ఉండదు. ఒక్క కోడిగుడ్డు కొనుగోలుకు సైతం అక్కరకురాని పైకాన్ని పంచుతూ... పోషకాహార పండగ చేసుకొమ్మంటున్న పాలకులది క్రూరపరిహాసం కాక మరేమిటి?

పెరిగిపోయిన పోషకాహార లోపం..

'దేశమంటే మట్టికాదోయ్‌' అన్న గురజాడ మాటలను మొన్నామధ్య ప్రధాని మోదీ ఉటంకించారు. 'ఈసురోమని మనుషులుంటే దేశమేగతి బాగు పడునోయ్‌' అన్న అదే మహాకవి మాటలు బహుశా ప్రధాని దృష్టికి వచ్చినట్లు లేవు! దేశంలోని 22 రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లో 2015-20 మధ్యలో పోషకాహార లోపం పెరిగిపోయిందన్న జాతీయ కుటుంబ ఆరోగ్య సర్వే ఫలితాలు దేశంలో మేటవేసిన దుర్భర పరిస్థితులను కళ్లకు కడుతున్నాయి. అంతకంతకూ పెరుగుతున్న పేదరికమే పోషకాహార లోపానికి రెక్కులు తొడుగుతోంది. కొవిడ్‌ ధాటికి ఉపాధులు కోసుకుపోయి కోట్ల మంది కొత్తగా దుర్భర దారిద్య్రంలోకి జారిపోతున్నారు. ఈ నిస్సహాయ కుటుంబాల్లోని చిన్నారుల ఎదుగుదలకు నిండు మనసుతో చేయూతనందించాల్సింది పోయి అరకొర విదిలింపులతో పొద్దుపుచ్చుతున్న ప్రభుత్వాల నిర్వాకం నిశ్చేష్టపరుస్తోంది! ఏలికలు విదుల్చుతున్న ఆ కొద్దిపాటి సొమ్మునూ పాత బకాయిల కింద బ్యాంకులు జమ చేసేసుకుంటున్న ఘటనలు వివిధ రాష్ట్రాల్లో వెలుగుచూస్తున్నాయి. తల్లిదండ్రుల సర్కారీ బీమా పథకాల పేరుచెప్పి- పిల్లల నోటి కాడి కూడును ప్రీమియాల కింద గుంజుకుంటున్న పెద్దమనుషుల చిల్లర బుద్ధులకు తగిన మందు ఎవరు కనిపెట్టగలరు? భారతదేశంలోని 27.5 కోట్ల మంది చిన్నారులు పోషకాహార ముప్పును ఎదుర్కొంటున్నారని యునిసెఫ్‌ ఇప్పటికే ఆందోళన వ్యక్తంచేసింది. వీళ్లలో దాదాపు 12 కోట్ల మందికి తలో వంద రూపాయల చొప్పున ఇచ్చి అమాంతం వారిని పోషకాహార శక్తిమాన్లుగా ఏలినవారు తయారు చేయబోతున్నారు! మరోవైపు, మూడో దశ కొవిడ్‌ ఉద్ధృతి ప్రభావం పిల్లలపైనే ఎక్కువగా ఉంటుందని వైద్యనిపుణులు హెచ్చరిస్తున్నారు. రోగనిరోధక శక్తి తక్కువగా ఉండే పసివాళ్లు కొవిడ్‌కు సులభ లక్ష్యాలు కాబోతున్నారు! బలవర్ధకమైన భోజనానికి నోచుకోని భావిభారతం భవిష్యత్తును అక్షరాలా మహమ్మారి దయకు వదిలివేస్తున్న ప్రభుత్వాలకు పాషాణాలకు పెద్ద తేడా ఏముందని ఎవరైనా అనుకుంటే కాదనగలమా?

కొవిడ్​ చిదిమేసిన బాలల జీవితాలు..

కొవిడ్‌ కోరల్లో చిక్కుకుని కుటుంబాలకు కుటుంబాలే ఛిన్నాభిన్నమవుతున్నాయి. అమ్మానాన్నలను పోగొట్టుకుని ఎందరో పిల్లలు అనాథలవుతున్నారు. 'రోజులు గడచిపోతున్నాయి కానీ, వీధినపడ్డ పిల్లలకు పూటకింత అన్నం పెట్టేవాళ్లు కనపడటం లేదు. ఆ పసివాళ్ల వేదనను మీరు అర్థం చేసుకుంటారనుకొంటున్నాం' అంటూ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను ఉద్దేశించి సుప్రీంకోర్టు చేసిన తాజా వ్యాఖ్యల్లో మానవ సహజమైన ఆర్ద్రత కనిపిస్తోంది. మధ్యప్రదేశ్‌ నుంచి ఆంధ్రప్రదేశ్‌ వరకు వివిధ రాష్ట్రాలు ఈ పని ఇప్పటికే మొదలుపెట్టాయి. లాక్‌డౌన్లతో ఏడాది నుంచి ఆదాయాల్లేక, కేంద్రం నుంచి పన్నులవాటాలు సకాలంలో అందక రాష్ట్రాలు నీరసించిపోతున్నాయి. మూలిగేనక్కపై తాటిపండు పడినట్లు వాటిపై కొత్తగా కొవిడ్‌ టీకాల సేకరణ భారమూ వచ్చిపడింది! ఇలాంటి సమయంలో కరోనాతో అమ్మానాన్నలను పోగొట్టుకున్న పిల్లల సంక్షేమాన్నీ రాష్ట్రాలు తలకెత్తుకుంటున్నా కేంద్రం ఇన్నాళ్లూ మౌనంగానే ఉండిపోయింది. కొవిడ్‌తో దేశంలో ఇటువంటి అభాగ్య చిన్నారుల సంఖ్య పెరిగి ఉండొచ్చని సుప్రీంకోర్టులో కేంద్రం తరఫున అదనపు సొలిసిటర్‌ జనరల్‌ సానుభూతి మాత్రం ఒలకబోశారు. కొవిడ్‌ కారణంగా అనాథలైన పిల్లలకు 'పీఎం కేర్స్‌' నిధి నుంచి సాయం చేస్తామని కేంద్రం ఇప్పుడు తీరిగ్గా ప్రకటించింది. ఖాళీ కడుపుల్లో కాళ్లుపెట్టుకుని కన్నీళ్లతో ముడుచుకుపోతున్న రేపటి పౌరులను రక్షించుకోవాలన్న సంగతి సుప్రీంకోర్టు చెప్పాక కానీ ఏలినవారికి జ్ఞప్తికి రాకపోవడమే చిత్రం... అదే దౌర్భాగ్యం!

- శైలేష్‌ నిమ్మగడ్డ

ఇదీ చూడండి:అనాథ చిన్నారులకు పీఎం కేర్స్​ నుంచి రూ.10 లక్షలు!

ABOUT THE AUTHOR

...view details