ఆకలితో అలమటించే వారికి అన్నమే పరబ్రహ్మ స్వరూపం. ఏనాడో 1945 జనవరినుంచే ప్రజా పంపిణీ వ్యవస్థ (పీడీఎస్) వేరూనుకొన్న ఇండియాలో బడుగు జీవుల ఆహార భద్రతా సాధనంగా అది పూర్తి స్థాయిలో అక్కరకొస్తోందా అన్న ప్రశ్నకు- లేదు లేదన్నదే సమాధానం! పీడీఎస్‌లో అవినీతి గాదెకింద పందికొక్కులా మారి నిరుపేదల కడుపు కొట్టడంతోపాటు ఏటా వేలకోట్ల రూపాయల విలువైన ఆహారాన్ని స్వాహా చేస్తున్న నేపథ్యంలో- లబ్ధిదారుల వేలిముద్రలు, ఐరిస్ సాంకేతికత వినియోగం ద్వారా అక్రమాలను అరికట్టే యత్నాలు మొదలయ్యాయి. వాటికి ఆధార్ సాంకేతికతను అనుసంధానించి ‘ఒకే దేశం-ఒకే రేషన్ కార్డు’ పథకాన్ని ప్రారంభించిన మోదీ ప్రభుత్వం, వలస శ్రామికులు తామెక్కడ ఉంటే అక్కడే రేషన్ తీసుకోగల అవకాశాన్ని అందుబాటులోకి తెచ్చింది.
దేశవ్యాప్తంగా అమలు..
నిరుడు ఆగస్టునుంచి నాలుగు రాష్ట్రాల్లో అందుబాటులోకి వచ్చిన ఈ విధానం మొన్న సెప్టెంబరునుంచి 68.8 కోట్ల మంది లబ్ధిదారులకు ప్రయోజనకరమయ్యేలా 28 రాష్ట్రాలు కేంద్రపాలిత ప్రాంతాల్లో అమలులోకి వచ్చిందని కేంద్రం తాజాగా ప్రకటించింది. నేటికీ ముందు వెనకలాడుతున్న తమిళనాడు, పశ్చిమ్‌బంగ, ఛత్తీస్‌గఢ్, అరుణాచల్‌ప్రదేశ్, అసోమ్ లాంటి రాష్ట్రాల్నీ దారిలోకి తెచ్చి వచ్చే ఏడాది మార్చినుంచి దేశవ్యాప్తంగా పథకాన్ని సమగ్రంగా పట్టాలకెక్కించాలన్నది సంకల్పం.
తప్పని సాంకేతిక సమస్యలు..
దేశవ్యాప్తంగా ఎక్కడైనా రేషన్ తీసుకోగల అవకాశం ఉండి ఉంటే కొవిడ్ కష్టకాలంలో వలసజీవుల ఆకలి వెతలు కొంతైనా తప్పేవన్న విశ్లేషణలున్నా- లబ్ధిదారుల ఆధార్, వేలిముద్రల స్వీకరణలో అవాంతరాలు, ఇంటర్నెట్ వేగం తగినంతగా లేకపోవడం వంటి సమస్యలు అసలైన లబ్ధిదారుల్ని ఇబ్బంది పెడుతున్న దృష్టాంతాలూ నమోదవుతున్నాయి. మరోవంక పీడీఎస్ బియ్యం ఏపీనుంచి ఆఫ్రికా, మలేసియాలకు అక్రమంగా రవాణా అవుతున్న తీరు పూడ్చాల్సిన కంతలెన్నో ఉన్నాయని నిర్ధారిస్తోంది!