పదేళ్లకోమారు జరిగే భారతావని జనగణన చరిత్రలో ఒకే ఒక్కసారి 1921లో దేశ జనాభాలో నికర తరుగుదల నమోదైంది. వందేళ్లక్రితం విరుచుకుపడిన స్పానిష్ ఫ్లూ మహమ్మారి మృత్యుఘోషకు నిదర్శనమది. పద్దెనిమిది నెలలుగా ప్రపంచ దేశాల్ని పట్టికుదుపుతున్న కొవిడ్ కల్లోలం ఇప్పటికే 38 లక్షల మందికిపైగా అభాగ్యుల్ని పొట్టన పెట్టుకొందని 'అధికార గణాంకాలు' చాటుతున్నా అసలు సంఖ్య అంతకు రెండు మూడింతలు ఉంటుందని డబ్ల్యూహెచ్‌ఓ ఇటీవలే నిష్ఠుర సత్యం పలికింది.
అప్పుడు సానుకూలమే కానీ..
ఇండియా వ్యాప్తంగా కొవిడ్ మృతుల సంఖ్యను అతి తక్కువగా చూపుతున్నారన్న ఆరోపణలకు బిహార్, మహారాష్ట్ర వంటి చోట్ల చోటు చేసుకొంటున్న సవరణలు బలం చేకూరుస్తున్నాయి. అధికారిక 'సివిల్ రిజిస్ట్రేషన్ సిస్టమ్'లో క్రమం తప్పక నమోదవుతున్న మరణాల్ని, కొవిడ్ మృతుల వివరాలతో సరిపోల్చి దేశవ్యాప్తంగా దాదాపు పది లక్షల మంది కరోనా కాటుకు బలై ఉంటారంటున్న అధ్యయనాలు ఏమాత్రం తోసిపుచ్చలేనివి. కచ్చితంగా కొవిడ్ మృతుల గుర్తింపు, ప్రకృతి విపత్తుల నిర్వహణ చట్టం (ఎన్‌డీఎంఏ) కింద నష్టపరిహారం చెల్లింపు కోరుతూ దాఖలైన పిటిషన్ల విచారణ సందర్భంగా పది రోజుల క్రితం కేంద్రం స్పందన పూర్తి సానుకూలంగానే ఉంది.
ప్రకృతి వైపరీత్యాల నిధి మొత్తం దానికే
తాజా ప్రమాణ పత్రంలో మాత్రం- ఆర్థిక ఇబ్బందుల్ని ఏకరువు పెడుతూ అడ్డగోలు వాదనలకు శ్రుతి చేసిన తీరే నిర్ఘాంతపరుస్తోంది. కరోనా మరణాలన్నింటినీ ధ్రువీకరిస్తామన్న కేంద్రం- మృతుల కుటుంబాలకు రూ.4 లక్షల వంతున చెల్లిస్తే ప్రకృతి వైపరీత్యాల నిధి మొత్తం దానికే సరిపోతుందని బేలగా స్పందించింది. చట్ట ప్రకారం కనీస ప్రామాణిక పరిహారం చెల్లించాల్సి ఉండగా- దాన్ని భిన్న రూపాల్లో అందిస్తూనే ఉన్నామని, తాత్కాలిక సాయం అన్నది చట్టబద్ధ హక్కేమీ కాదని, న్యాయపాలికా ఈ విషయంలో జోక్యం చేసుకోజాలదనీ వివరించింది. శతాబ్ది సంక్షోభంగా విరుచుకుపడి, లక్షల కుటుంబాల్ని ఛిన్నాభిన్నం చేసిన మహా విషాదంపై కేంద్రం వైఖరి వ్యాకులపరుస్తోంది!