తెలంగాణ

telangana

ETV Bharat / opinion

రేపటి పౌరులకు కొత్త బోధనాంశాలు - జాతీయ విద్యాపరిశోధనతో విద్యా విధానం

దశాబ్దాలుగా నెలకొన్న లోపాలను సరిదిద్దేందుకు జాతీయ నూతన విద్యావిధానాన్ని తెచ్చిన కేంద్ర ప్రభుత్వం- పాఠశాల స్థాయిలో బోధనా పద్ధతులు, పాఠ్యాంశాల్లో సంస్కరణలకు శ్రీకారం చుట్టింది. తరగతుల వారీగా పాఠ్యప్రణాళిక ఉండేలా జాతీయ విద్యాపరిశోధన, శిక్షణ మండలి, జాతీయ కరికులమ్‌ ఫ్రేమ్‌వర్క్‌ను రూపొందిస్తోంది.

new education policy 2020
కొత్త బోధనాంశాలు

By

Published : Jul 17, 2021, 7:01 AM IST

మన దేశంలోని విద్యావ్యవస్థ బట్టీయం చదువులకు పెట్టింది పేరు. చాలామంది విద్యార్థులకు తరగతి గదిలో విన్న పాఠాలను సొంతంగా విశ్లేషించుకొనే శక్తి ఉండటం లేదు. వాస్తవానికి బడిలో ఉన్నంతసేపు వారికి ఆ సమయమే లభించదు. ఉపాధ్యాయుడు బోధించడం, విద్యార్థులు వినడం తప్ప- ప్రపంచ దేశాలు అమలు చేస్తున్న చర్చల తరహా బోధన మన దేశంలో ఇప్పటికీ సాధ్యపడలేదు. దశాబ్దాలుగా నెలకొన్న లోపాలను సరిదిద్దేందుకు జాతీయ నూతన విద్యావిధానాన్ని తెచ్చిన కేంద్ర ప్రభుత్వం- పాఠశాల స్థాయిలో బోధనా పద్ధతులు, పాఠ్యాంశాల్లో సంస్కరణలకు శ్రీకారం చుట్టింది. తరగతుల వారీగా పాఠ్యప్రణాళిక ఉండేలా జాతీయ విద్యాపరిశోధన, శిక్షణ మండలి (ఎన్‌సీఈఆర్‌టీ) జాతీయ కరికులమ్‌ ఫ్రేమ్‌వర్క్‌(ఎన్‌సీఎఫ్‌)ను రూపొందిస్తోంది. మొదటి నుంచి పరిస్థితులకు అనుగుణంగా పాఠ్యప్రణాళిక విధివిధానాలను ఎప్పటికప్పుడు మారుస్తున్నారు. గతంలో 1975, 1988, 2000, 2005లో ఎన్‌సీఎఫ్‌లు రూపొందించారు. అంటే ప్రస్తుతం ఉన్న సిలబస్‌ 15 ఏళ్ల కిందటిది. దీంతో కేంద్రం కొత్త పాఠ్యప్రణాళికపై కసరత్తు ముమ్మరం చేసింది.

కాలం చెల్లనున్న బట్టీయం విధానం

పాఠాలను మార్చడం అంత సులభమైన ప్రక్రియ కాదు. అందులో ఎన్నో సంస్కృతీ సంప్రదాయాలు, చరిత్ర, జీవన నైపుణ్యాలు, స్థానికతతో ముడివడిన అంశాలు ఉంటాయి. దాంతో రాజకీయ పార్టీలు, నిపుణులు, మేధావుల నుంచి విమర్శలు ఎదురవుతున్నాయి. కరికులమ్‌ తయారీలో ఒకే వర్గానికి చెందిన అజెండాను పరిగణనలోకి తీసుకుంటున్నారనే ఆరోపణలు ఉన్నాయి. ఇప్పటికే నూతన విద్యావిధానంపై పెదవి విరుస్తున్న రాష్ట్రాలు పాఠ్యాంశాల ప్రణాళికలోనైనా తమకు ప్రాధాన్యం ఇవ్వాలంటున్నాయి. ఇప్పటివరకూ ఉన్న 10+2 విద్యావిధానాన్ని కేంద్రం 5+3+3+4గా మార్చింది. మొదటి అయిదు సంవత్సరాలు నర్సరీ, ఎల్‌కేజీ, యూకేజీ, ఒకటి, రెండో తరగతి వరకు ప్రారంభ దశగా పరిగణిస్తున్నారు. 2022-23 విద్యాసంవత్సరం నాటికి కొత్త పాఠ్యప్రణాళికతో పుస్తకాలను అందుబాటులోకి తీసుకురావాలని కేంద్రం యోచిస్తోంది. పిల్లలను బట్టీ విధానానికి దూరం చేసి పరిపూర్ణమైన పరిజ్ఞానాన్ని సముపార్జించేలా పుస్తకాలను రూపొందించనున్నారు.

కేంద్రం విడుదల చేసే పాఠ్యప్రణాళికను రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలు పరిశీలిస్తాయి. స్థానిక పరిస్థితులకు తగ్గట్లు రాష్ట్ర కరికులమ్‌ ఫ్రేమ్‌వర్క్‌(ఎన్‌సీఎఫ్‌)లో మార్పుచేర్పులు చేస్తాయి. జాతీయ కరికులమ్‌ను అందుబాటులోకి తెచ్చే ముందు జిల్లా స్థాయిలో సంప్రదింపులు జరుపుతామని పార్లమెంటరీ స్థాయీసంఘానికి కేంద్ర విద్యాశాఖ తెలిపింది. ఈ సంఘం జులై చివరి నాటికి తన నివేదికను సమర్పించనుంది. కొత్తగా రూపొందించే పాఠ్యప్రణాళికలో పుస్తకాల బరువు, పరిమాణం పెరగకుండా జాగ్రత్త పడుతున్నారు. దివ్యాంగ విద్యార్థులకు సైతం వివిధ అంశాలు సులభంగా అర్థమయ్యేలా బొమ్మల రూపంలో పాఠ్యపుస్తకాలను రూపొందించనున్నారు. ఇప్పటివరకు దృష్టిలోపం కలిగిన వారికి బ్రెయిలీ లిపిలో పాఠ్యపుస్తకాలు సమకూరుస్తున్నారు. ఇకపై దృష్టి మాంద్యం కలిగిన పిల్లలు పాఠ్యాంశాన్ని తడిమితే వినబడేలా అందుబాటులోకి తీసుకొస్తున్నారు. గత డిసెంబర్‌ నాటికే కొత్త ఎన్‌సీఎఫ్‌కు రూపమిద్దామనుకున్న కేంద్రానికి అది సాధ్యపడలేదు.

నాణ్యత అత్యావశ్యకం

అందరికీ ఆమోదయోగ్యమైన కరికులమ్‌ రూపకల్పనలో రాష్ట్రాల అభిప్రాయాలకు చోటివ్వాలి. గతంలో డిగ్రీలో చరిత్రకు సంబంధించిన పాఠ్యాంశాల్లో మార్పులు చేసిన యూజీసీ వివాదంలో చిక్కుకుంది. కమిషన్‌కు చెందిన నిపుణుల కమిటీ తయారు చేసిన ముసాయిదా ప్రాచీన అంశాలపై ఎక్కువ దృష్టి పెట్టిందన్న విమర్శలు వెల్లువెత్తాయి. మరికొంతమంది సవరించిన పాఠ్యాంశాలను స్వాగతించారు. ఈ తరం విద్యార్థులకు భారతదేశ చరిత్రను తెలియజేయాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడ్డారు. ఈ పరిణామాల దృష్ట్యా కేంద్రం రూపొందించే పాఠ్యప్రణాళికపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. విభిన్న ప్రాంతాలు, సర్వమతాలకు నెలవైన దేశంలో భావి భారత పౌరులు నేర్చుకోవాల్సిన నైతిక విలువలు, చేరుకోవాల్సిన గమ్యాలకు అనుగుణంగా పాఠ్యాంశాలు, పాఠ్యప్రణాళికలు ఉండాలి. ప్రస్తుత పోటీ ప్రపంచంలో తక్కిన దేశాలు నాణ్యమైన బోధన, సమగ్ర మూల్యాంకన వ్యవస్థతో విద్యార్థులను తీర్చిదిద్దుతున్నాయి. కార్పొరేట్‌ వలలో పడిన మనదేశ విద్యావ్యవస్థలో పెనుమార్పులు తీసుకురావాల్సిన బాధ్యత ప్రభుత్వాలపై ఉంది. సరైన వసతులు అందని విద్యార్థులకు కనీసం నాణ్యమైన చదువును చేరువ చేయడంలో ఏమాత్రం వెనకడుగు వేయకూడదు. విద్యార్థి సంపూర్ణ వికాసానికి దోహదపడేలా పాఠ్యప్రణాళికలను రూపొందించాలి.

- సురేశ్‌ చెడదీపు

ఇదీ చూడండి:7 వేల SSC ఉద్యోగాలకు పరీక్ష ఎప్పుడంటే?

ABOUT THE AUTHOR

...view details