కలుపు ఏరివేతతో సేద్యానికి శ్రీకారం చుట్టే రైతు, తనకు చెరుపు చేసే శాసనాల్ని పెరికిపారేయాలంటూ దేశ రాజధానిలో కదన భేరి మోగిస్తున్నాడు. 40 రైతు సంఘాల ఆధ్వర్యంలో జరుగుతున్న ఆందోళన 1988లో మహేంద్ర సింగ్ తికాయత్ సారథ్యంలో సఫలీకృతమైన బోట్‌క్లబ్ మహోద్యమాన్ని స్ఫురణకు తెస్తోందనడంలో సందేహం లేదు. 'మాకోసం కాదు, మా బిడ్డల కోసం' అంటూ కదం తొక్కుతున్న కర్షకలోకంలో భాజపా పాలిత రాష్ట్రాల రైతులూ పాల్పంచుకొంటున్నారు. కనీస మద్దతు ధరల విధానాన్ని కొసాగిస్తామని, వివాదాస్పద చట్టాల్లో ఎనిమిది సవరణలు చేస్తామని నాలుగో విడత సంప్రదింపుల్లో కేంద్రం ప్రతిపాదించినా- ససేమిరా అన్నదే రైతు సంఘాల సమాధానం. 'ఒకే భారత్-ఒకే వ్యవసాయ మార్కెట్' అంటూ కేంద్రం చేసిన శాసనాల్ని పూర్తిగా ఉపసంహరించాల్సిందేనన్నది రైతుల ఏకీకృత నినాదం!
కొవిడ్ సంక్షోభంతో కకావికలమైన ఆర్థిక రంగానికి నవోత్తేజం కల్పించేందుకంటూ మోదీ ప్రభుత్వం ప్రతిపాదించిన దాదాపు రూ.21 లక్షల కోట్ల ప్యాకేజీలోనే వ్యవసాయ మార్కెట్ సంస్కరణల ప్రతిపాదనలూ కొలువుతీరాయి. విస్తృత సంప్రదింపుల అవసరాన్ని విస్మరించి వాటిని ఆర్డినెన్సులుగా వెలువరించిన కేంద్రం- పార్లమెంటులో బిల్లుల్ని నెగ్గించేటప్పుడు మిత్రపక్షాల్నీ విశ్వాసంలోకి తీసుకోలేదు. రాజ్యాంగం ప్రకారం వ్యవసాయం రాష్ట్రాల పరిధిలోని అంశమైనా, వాటినీ సంప్రదించనేలేదు. అంతర్రాష్ట్ర వాణిజ్యం తన పరిధిలోనిదంటూ ఆ ప్రకారం 'వ్యవసాయ సంస్కరణ'లకు చట్ట రూపమిచ్చిన ఎన్‌డీఏ సర్కారు- మంచీ చెడులపై రైతు సంఘాలతోనూ చర్చించలేదు. మండీలకు ముంతపొగ పెట్టే చట్టాలు- బడుగు రైతు బతుకును కార్పొరేట్ల దయాధర్మానికి వదిలేస్తాయని రైతులోకం భీతిల్లుతోంది. ప్రపంచీకరణకు గవాక్షాలు తెరిచిన దాదాపు మూడు దశాబ్దాల్లో బడుగురైతు బాగుకు భరోసా ఇచ్చే ఏ సంస్కరణా పొలంబాట పట్టని దేశం మనది. అన్నదాతల పొట్టకొట్టే కరకు చట్టాల్ని ఉపసంహరించాలన్న రైతు సంఘాల డిమాండులో కర్షకుల అభిమతమే కాదు, జాతి హితమూ దాగుంది!