తెలంగాణ

telangana

ETV Bharat / opinion

వినియోగదారులపై ఆకర్షణల వల

కరోనా సంక్షోభంలో ఫ్లిప్‌కార్ట్‌, అమెజాన్‌, బిగ్‌బాస్కెట్‌, జొమాటో, స్విగ్గీ వంటి సంస్థలకు ఆదరణ విపరీతంగా లభించింది. ఎన్నో రకాల వస్తువులు, ఆహార పదార్థాలు ఏవైనా నేరుగా ఇంటికే చేరవేసే వెసులుబాటు ఉండటంతో ప్రజల్లో వీటికి డిమాండ్‌ పెరిగింది. ఇంత ప్రఖ్యాతి పొందినా వీటిలోనూ లోపాలున్నాయి. సొంత అనుబంధ సంస్థ(సబ్సిడరీ)లనే ఈ-పోర్టళ్లు ఎక్కువగా ప్రోత్సహిస్తాయి. సొంతంగా తయారు చేసిన వస్తువులకు ప్రచారం కల్పిస్తాయి. వాటి ధర ఎక్కువ, నాణ్యత తక్కువగా ఉన్నా పట్టించుకోవు.

Attraction of Internet Personalization
వినియోగదారులపై ఆకర్షణల వల

By

Published : Jul 15, 2021, 6:05 AM IST

భారత్‌లో ఈ-కామర్స్‌ విపణి వేగంగా వృద్ధి చెందుతోంది. 2017లో 3,850 కోట్ల డాలర్లుగా ఉన్న ఈ మార్కెట్‌, 2026 నాటికి 20 వేల కోట్ల డాలర్లకు చేరే అవకాశముంది. ఈ విపణి ఊపందుకోవడంలో స్మార్ట్‌ఫోన్లది కీలకమైన పాత్ర. ముఖ్యంగా కరోనా సంక్షోభంలో ఫ్లిప్‌కార్ట్‌, అమెజాన్‌, బిగ్‌బాస్కెట్‌, జొమాటో, స్విగ్గీ వంటి సంస్థలకు ఆదరణ విపరీతంగా లభించింది. ఎన్నో రకాల వస్తువులు, ఆహార పదార్థాలు ఏవైనా నేరుగా ఇంటికే చేరవేసే వెసులుబాటు ఉండటంతో ప్రజల్లో వీటికి డిమాండ్‌ పెరిగింది. ఇంత ప్రఖ్యాతి పొందినా వీటిలోనూ లోపాలున్నాయి. సొంత అనుబంధ సంస్థ(సబ్సిడరీ)లనే ఈ-పోర్టళ్లు ఎక్కువగా ప్రోత్సహిస్తాయి. సొంతంగా తయారు చేసిన వస్తువులకు ప్రచారం కల్పిస్తాయి. వాటి ధర ఎక్కువ, నాణ్యత తక్కువగా ఉన్నా పట్టించుకోవు. సరసమైన ధరల్లో నాణ్యమైన వస్తువులను అందించే వారు, వినియోగదారులు వీటివల్ల నష్టపోతున్నారు. కొన్ని ఈ-పోర్టళ్లు 'కస్టమైజేషన్‌' పేరుతో కస్టమర్లను మోసం చేస్తున్నాయనే ఆరోపణలు ఉన్నాయి. వినియోగదారుడు ఆన్‌లైన్‌లో ఏం వెతుకుతున్నాడో వాటికి తెలిసిపోతోంది. తమ అనుబంధ సంస్థలకు చెందిన లేదా తాము ఒప్పందం కుదుర్చుకున్న కంపెనీల వస్తువులనే అవి వినియోగదారులకు చూపుతున్నాయి. విదేశీ ప్రత్యక్ష పెట్టుబడుల విధానంలోని నిబంధనలను అమెజాన్‌, ఫ్లిప్‌కార్ట్‌లు ఉల్లంఘిస్తున్నాయని ఎన్నో ఏళ్లుగా దేశీయ వాణిజ్య బృందాలు ఆరోపిస్తున్నాయి. ప్రభుత్వమూ అనేకమార్లు ఈ విషయంపై ఆందోళన వ్యక్తం చేసింది. ఈ-కామర్స్‌ విధానానికి ముసాయిదా జారీ చేసినా, విదేశీ శక్తుల నుంచి వ్యతిరేకత ఎదురు కావడంవల్ల ప్రభుత్వం వెనకడుగు వేసింది. అప్పటికీ ఎఫ్‌డీఐ నిబంధనలను కఠినతరం చేసి వాటిపై ఒత్తిడి పెంచింది. ఇటీవల ఈ-కామర్స్‌లో కొత్త నిబంధనలు ప్రతిపాదించింది.

భద్రతకు భరోసా

భద్రతకు భరోసా

దేశంలో తయారైన వస్తువులకే ఎక్కువ ప్రాధాన్యమివ్వాలని భారత ప్రభుత్వం భావిస్తోంది. కానీ ప్రభుత్వ ఆత్మనిర్భర్‌ భారత్‌ లక్ష్యానికి ఈ సంస్థలు విరుద్ధంగా పనిచేస్తున్నాయి. అందువల్ల విదేశీ వస్తువులతో పాటు దేశీయ వస్తువులను వినియోగదారులకు సమానంగా అందుబాటులో ఉంచాలన్న నిబంధనను ప్రభుత్వం విధించింది. ఒకే వస్తువును ప్రచారం చేసే 'ఫ్లాష్‌ సేల్‌'ను నిషేధిస్తే, ఇతర తయారీదారులు లబ్ధి పొందుతారన్న అభిప్రాయం వ్యక్తం చేసింది. ఆయా పోర్టళ్లకు సంబంధించిన వ్యక్తులు, అనుబంధ సంస్థలను విక్రయదారులుగా పరిగణించకూడదు. అప్పుడే ఉత్పత్తిదారులతో సంబంధం ఉన్న ఈ-కామర్స్‌ దిగ్గజాల గుత్తాధిపత్యానికి తెరపడుతుంది. ఈ ప్రతిపాదనలతో వినియోగదారుడి డేటా భద్రతకూ భరోసా పెరుగుతుంది. భారత్‌లో కార్యకలాపాలు సాగించాలనుకునే ఈ-కామర్స్‌ సంస్థలు డీపీఐఐటీ వద్ద కచ్చితంగా నమోదు చేసుకోవాలని నూతన నిబంధనలు చెబు తున్నాయి. ఇదే జరిగితే ఫ్లిప్‌కార్ట్‌ను శాసించే వాల్‌మార్ట్‌- డీపీఐఐటీ అనుమతులు లేనిదే సొంత టీషర్టులను కూడా అమ్ముకోలేదు. వినియోగదారుల హక్కుల సంరక్షణ చట్టం కింద ప్రభుత్వం ఈ మార్పులకు సిద్ధపడింది. తమ వేదికలపై విక్రయిస్తున్న వస్తు, సేవలకు తామే పూర్తి బాధ్యత వహించే విధంగా ఈ నిబంధనలు ఉన్నాయి. ఇప్పుడున్న ఈ-కామర్స్‌ వ్యవస్థ వల్ల దేశంలో డెలివరీ బాయ్స్‌ నుంచి వినియోగదారుల వరకు అందరూ నష్టపోతారు. అందువల్ల కొత్త నిబంధనలు అత్యవసరం. విదేశీ సంస్థలైన అమెజాన్‌, ఫ్లిప్‌కార్ట్‌లూ తమ వ్యాపారాన్ని సమీక్షించుకునే విధంగా ఇవి ఉపకరిస్తాయి. దేశీయ సంస్థలైన జియోమార్ట్‌, బిగ్‌బాస్కెట్‌, స్నాప్‌డీల్‌కు ప్రయోజనం కలుగుతుంది. కరోనాతో కుదేలైన చిన్న వ్యాపారాలపై ఈ కొత్త నిబంధనలు పెను భారంగా మారతాయని, విక్రయదారులపై ఒత్తిడి మరింత పెరుగుతుందని అమెజాన్‌ వాదిస్తోంది. విదేశీ సంస్థ స్టార్‌బక్స్‌తో జతకట్టిన టాటా కూడా ఈ నిబంధనలపై ఆందోళన వ్యక్తం చేస్తోంది.

ప్రయోజనాల పరిరక్షణ

ప్రయోజనాల పరిరక్షణ

దిగ్గజ ఈ-కామర్స్‌ సంస్థల గుత్తాధిపత్యాన్ని అడ్డుకునే విధంగా కాంపిటీషన్‌ కమిషన్‌ ఆఫ్‌ ఇండియా (సీసీఐ) చర్యలు చేపట్టాలి. ఈ-పోర్టళ్లలో కస్టమర్ల సంఖ్యను నియంత్రించాలి. ఈ చర్యలు దేశీయ ఈ-పోర్టళ్లకు ఎంతో ఉపయోగపడతాయి. పోటీ పారదర్శకంగా ఉంటుంది. కొత్త దేశీయ సంస్థల వృద్ధికి అవకాశాలూ మెండుగా ఉంటాయి. ఆన్‌లైన్‌ మోసాలు పెచ్చుమీరుతున్న ప్రస్తుత కాలంలో ఈ-కామర్స్‌ సైట్ల సమాచారం అందుబాటులో లేకపోవడం ఆందోళనకరం. ముఖ్యంగా దేశంలో పుట్టుకొస్తున్న అనేక అంకురాలకు చైనా నుంచి అక్రమంగా నిధులు అందుతున్నట్లు వార్తలొస్తున్నాయి. వీటికి అడ్డుకట్ట వేసేందుకు సమాచార హక్కు చట్టం పరిధిలోకి ఈ-కామర్స్‌ వెబ్‌సైట్లనూ తీసుకురావాలి. అప్పుడే వాటిలో ఉండే ఉత్పత్తులకు సంబంధించిన విక్రయదారుల వివరాలను వినియోగదారులు తెలుసుకోగల వీలుంటుంది. ప్రస్తుత పరిస్థితులను పరిశీలిస్తే, ప్రభుత్వం ప్రతిపాదించిన నిబంధనలు సరైనవేనని అర్థమవుతుంది. వీటివల్ల ఈ-కామర్స్‌ పోర్టళ్లు పారదర్శకంగా ఉంటాయి. వినియోగదారుల ప్రయోజనాలను సంరక్షించేందుకు అంతర్జాతీయంగా ఏకరీతి చట్టాలు ఉండాలి. ప్రపంచ వాణిజ్య సంస్థకు ఈ బాధ్యతలు అప్పగించాలని కొందరు కోరుతున్నారు. ప్రభుత్వం కొన్ని నిబంధనలు విధించి, మిగిలింది ఆయా పరిశ్రమలకే విడిచిపెట్టేయాలని మరికొందరి వాదన. అంతర్జాతీయంగా ఈ-కామర్స్‌ వెబ్‌సైట్ల నియంత్రణకు సమగ్ర విధానం రూపొందించడానికి ప్రపంచ దేశాలు కృషి చేయకపోవడం ఆందోళనకరం. కరోనా సంక్షోభం మొదలయ్యాక డిజిటలైజేషన్‌కు, డిజిటల్‌ సరఫరా గొలుసు వ్యవస్థకు డిమాండ్‌ ఊపందుకుంది. అందువల్ల ఈ-కామర్స్‌ వెబ్‌సైట్లు జవాబుదారీతనంతో వ్యవహరించేందుకు అంతర్జాతీయ వేదికల్లో చర్చలు జరిపి, చట్టాలు రూపొందించడం తక్షణావసరం.

ఏ దేశంలో ఎలా?

ఐరోపా: ఈ-పోర్టళ్ల ఆట కట్టించేందుకు 2020లో ఐరోపా కమిషన్‌ పలు చట్టాలను ప్రవేశపెట్టింది. ఈ-పోర్టళ్లలో తమ వస్తువులతో పాటు ఇతరుల వస్తువులకూ సమానంగా ప్రాధాన్యమివ్వాలని ఆదేశించింది.

అమెరికా:గుత్తాధిపత్యాన్ని ప్రదర్శించాలనుకున్న సంస్థలపై ఉక్కుపాదం మోపేందుకు చట్టాలను రూపొందించింది. గూగుల్‌, ఫేస్‌బుక్‌, అమెజాన్‌ వంటి సంస్థల ఆధిపత్యాన్ని అడ్డుకుంది. ఈ-పోర్టళ్ల సొంత పరిశ్రమల ఏర్పాటుకు నిరాకరించింది.ఈ-పోర్టల్‌ కార్యకలాపాలు సాగించడం, ఉత్పత్తి-అమ్మకాలు చేసుకోవడంలో ఏదో ఒకదానినే అనుసరించాలని తేల్చిచెప్పింది.

చైనా: ఈ-కామర్స్‌పై చైనా స్పందన మిశ్రమంగా ఉంది. ఓవైపు అంతర్జాతీయంగా ఆన్‌లైన్‌ వేదికల్లో పోటీని ఎదుర్కొనేలా దేశ ఈ-కామర్స్‌ను తీర్చిదిద్దేందుకు కృషిచేస్తూనే, మరోవైపు చైనా ప్రయోజనాలకు అనుకూలంగా వ్యవస్థను నియంత్రిస్తోంది.

- డాక్టర్‌ రాధా రఘురామపాత్రుని
(అంతర్జాతీయ వాణిజ్య రంగ నిపుణులు)

ABOUT THE AUTHOR

...view details