తెలంగాణ

telangana

ETV Bharat / opinion

నిద్రలేస్తున్న పాత భూతం- ఈశాన్యంలో ఉగ్రవాదుల అలజడి! - చైనా అండతో ఈశాన్య భారతం​లో ఉగ్రవాదం

Terrorism in North East India: ఈశాన్యం భారతంలో ఉగ్ర భూతం మళ్లీ నిద్రలేస్తోంది. నిఘా, భద్రతా వర్గాల సమాచారం ప్రకారం ఈశాన్య ప్రాంతంలోని ఉగ్రవాద సంస్థలన్నీ కలిసి పనిచేసేందుకు పావులు కదుపుతున్నాయి. భారతదేశం నుంచి విడిపోవాలన్న వారి లక్ష్యం మళ్ళీ ఊపిరి పోసుకుంటోంది. వారికి చైనా, మయన్మార్‌ నుంచి తోడ్పాటు లభిస్తోందన్న కథనాలు ఆందోళన కలిగిస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఈశాన్య భారతంలో చైనా జోక్యాన్ని నివారించేలా భారత ప్రభుత్వం వ్యవహరించకపోతే.. దేశ భద్రతే పెనుప్రమాదంలో పడుతుందన్నది నిపుణుల వాదన.

Terrorism in North East India
Terrorism in North East India

By

Published : Jan 12, 2022, 7:31 AM IST

Terrorism in North East India: ఈశాన్య భారతంలోని ఉగ్రవాద సంస్థలకు చైనా, మయన్మార్‌ నుంచి తోడ్పాటు లభిస్తోందన్న కథనాలు ఆందోళన కలిగిస్తున్నాయి. అస్సాం, మణిపుర్‌, నాగాలాండ్‌లోని ఉగ్రవాద తండాల స్థితిగతులు గడచిన రెండేళ్లలో పూర్తిగా మారిపోయాయి. తమకు ఇక భవిష్యత్తు లేదనే దశ నుంచి తమ బలాన్ని తిరిగి చాటిచెప్పలగలమన్న ఆశలు ఆయా సంస్థల్లో చిగురిస్తున్నాయి. భారతదేశం నుంచి విడిపోవాలన్న వారి లక్ష్యం మళ్ళీ ఊపిరి పోసుకుంటోంది. నిఘా, భద్రతా వర్గాల సమాచారం ప్రకారం ఈశాన్య ప్రాంతంలోని ఉగ్రవాద సంస్థలన్నీ కలిసి పనిచేసేందుకు పావులు కదుపుతున్నాయి. కొన్యాక్‌ నాగా వర్గీయుల ఆధిపత్యం అధికంగా ఉండే మయన్మార్‌లోని చెన్‌ హోయట్‌ కేంద్రంగా వాటి కార్యకలాపాలు ఊపందుకొంటున్నాయి. తమ రాజకీయ ఆకాంక్షలకు స్థానికుల మద్దతు పొందేందుకు శ్రమిస్తున్నాయి. ఆ క్రమంలోనే అవి నియామకాల జోరు పెంచాయి.

డ్రాగన్‌ కుయుక్తులు

చెన్‌ హోయట్‌ ప్రాంతం నాగాలాండ్‌కు అత్యంత సమీపంలో ఉంటుంది. దట్టమైన అడవులతో నిండిన ఆ ప్రదేశంలోని నివాసితుల్లో నాగా తిరుగుబాటు వర్గాల పట్ల సానుభూతి అధికంగా వ్యక్తమవుతూ ఉంటుంది. వాస్తవానికి భారత సరిహద్దుల్లో ఉగ్రవాద కార్యకలాపాలను అడ్డుకునేందుకు మయన్మార్‌ సైన్యం (టాట్మడవ్‌) తరచూ దాడులు జరుపుతుంటుంది. ఆ బలగాలు సైతం నియంత్రించలేని ప్రాంతంగా చెన్‌ హోయట్‌ గుర్తింపు పొందింది. అందుకే కొత్త నియామకాల కోసం ఉగ్రవాద సంస్థలు దాన్ని ఎంచుకున్నట్టు తెలుస్తోంది. మయన్మార్‌లోని సాయుధ మూకల(ఏఈఓ)తో కలిసి ఈశాన్య భారత దేశంలోని ఉగ్రతండాలు గతంలో టాట్మడవ్‌పై పోరాటం సాగించాయి. అస్సాం, మణిపుర్‌, నాగా తిరుగుబాటుదారులకు ఆశ్రయం కల్పిస్తున్న ఏఈఓలు అందులో క్రియాశీలకంగా వ్యవహరించాయి. ఈశాన్య భారత సాయుధులు ఇటీవల అనూహ్యంగా తమ పంథా మార్చుకోవడం సర్వత్రా చర్చనీయాంశమైంది. వివిధ పరిణామాల మూలంగా మయన్మార్‌ సైన్యంతో వారికి చెలిమి చిగురించింది. ఫలితంగా ఈశాన్య తిరుగుబాటుదారులు మరింత బలంగా కనపడుతున్నారు. టాట్మడవ్‌, చైనా సహకారంతో తమ లక్ష్యాల సాధనలో ముందడుగు వేయవచ్చని ఆయా సంస్థల నేతలు తలపోస్తున్నారు.

అవకాశాన్ని అందిపుచ్చుకొని..

ఆంగ్‌సాన్‌ సూకీ నేతృత్వంలో పదేళ్ల ప్రజాస్వామ్య పాలనకు ముగింపు పలుకుతూ; నిరుడు ఫిబ్రవరిలో టాట్మడవ్‌ అధిపతి మిన్‌ ఆంగ్‌ లాయింగ్‌ మయన్మార్‌లో సైనిక తిరుగుబాటుకు ఉపక్రమించారు. ప్రపంచవ్యాప్తంగా ప్రజాస్వామ్యం కోసం గళమెత్తే ఇండియాకు ఆ పరిణామాలు తలనొప్పిగా మారాయి. ఈశాన్య భారతంలోని ఉగ్రవాద సంస్థలను అదుపులో ఉంచేందుకు టాట్మడవ్‌ సహకారం అత్యవసరం కావడంతో ఆ దేశ పరిస్థితులపై పూర్తిస్థాయిలో స్పందించే పరిస్థితి భారత్‌కు లేకపోయింది. 'మయన్మార్‌ ప్రజాస్వామ్య వ్యవస్థకు భారత్‌ ఎల్లప్పుడూ మద్దతిచ్చింది. చట్టబద్ధమైన పాలన, ప్రజాస్వామ్య ప్రక్రియల్ని అక్కడ పునరుద్ధరిస్తారని విశ్వసిస్తున్నాం' అని మాత్రమే వ్యాఖ్యానించింది.

మరోవైపు సైనిక తిరుగుబాటును తనకు అవకాశంగా మలచుకున్న చైనా, మయన్మార్‌తో బంధాన్ని బలోపేతం చేసుకుంది. రెండు దేశాల నాయకుల మధ్య సాన్నిహిత్యం పెరిగింది. మయన్మార్‌లో భారీగా పెట్టుబడులు పెడుతున్న డ్రాగన్‌ దేశం- అక్కడి సైన్యానికి అతిపెద్ద ఆయుధ సరఫరాదారుగా నిలుస్తోంది. 2020లో చైనాతో సరిహద్దు వివాదం చెలరేగడంతో ప్రాంతీయంగా భారత్‌కు సంక్లిష్ట పరిస్థితులు ఎదురయ్యాయి. తూర్పు లద్దాఖ్‌లోని పాంగాంగ్‌ సరస్సు ప్రాంతంలో నెలకొన్న సంఘర్షణలతో ఇరు దేశాల ద్వైపాక్షిక బంధం ప్రభావితమైంది. 2020 జూన్‌ 20న జరిగిన గల్వాన్‌ ఘటనతో ఉద్రిక్తతలు తారస్థాయికి చేరాయి. పాతిక మంది భారత సైనికులు అమరులయ్యారు. చైనా వైపూ అనేకమంది ప్రాణాలు కోల్పోయారు. ఆ తరవాత ఇరు దేశాలు వాస్తవాధీన రేఖ వెంబడి భారీ స్థాయిలో బలగాలను మోహరించాయి. అదే ఏడాది అక్టోబరులో తన అధికార మీడియా 'గ్లోబల్‌ టైమ్స్‌' ప్రచురించిన ఓ వార్తతో డ్రాగన్‌ పరోక్షంగా ఇండియాకు హెచ్చరికలు జారీ చేసింది. 'భారత్‌లోని వేర్పాటువాదులకు చైనా మీడియా బహిరంగంగా మద్దతు తెలిపితే, వారి వాదనలను లోకానికి వినిపించేందుకు ఒక వేదిక కల్పిస్తే దిల్లీ సర్కారు ఎలా స్పందిస్తుంది' అని రాసుకొచ్చింది.

కట్టుదిట్టంగా వ్యవహరిస్తేనే...

మయన్మార్‌ ద్వారా ఈశాన్య భారత ఉగ్రవాద సంస్థలకు వెన్నుదన్నుగా నిలిచి, ఇండియాకు ఇబ్బందులు సృష్టించే ప్రయత్నాలను చైనా కొనసాగిస్తోంది. మరోవైపు, ఆ సంస్థల నేతల్లో అనేకులు చైనాలో ఆశ్రయం పొందుతున్నారు. ముఖ్యంగా ఎన్‌ఎస్‌సీఎన్‌ (నేషనల్‌ సోషలిస్ట్‌ కౌన్సిల్‌ ఆఫ్‌ నాగాలిమ్‌) నేత ఫున్‌థింగ్‌ షిమ్‌రంగ్‌, ఉల్ఫా నాయకుడు పరేశ్‌ బారువాలు అక్కడి నుంచే తమ వ్యూహాలకు పదును పెడుతున్నారు. 24ఏళ్లుగా భారత ప్రభుత్వంతో చర్చలు జరుపుతున్నా, ఎలాంటి ఫలితం లేకపోవడంతో ఎన్‌ఎస్‌సీఎన్‌ ఐసాక్‌ మొయివా వర్గంలోనూ అసంతృప్తి వెల్లువెత్తుతోంది. నాగాలకు, మిజో తిరుగుబాటు దళాలకు గతంలో చైనా శిక్షణ ఇచ్చిందన్నది జగమెరిగిన సత్యం. వాటికి ఆర్థిక సాయమూ చేసింది. ఈశాన్య భారతంలో చైనా జోక్యాన్ని నివారించేలా భారత ప్రభుత్వం కట్టుదిట్టంగా వ్యవహరించాలి. లేకపోతే పరిస్థితులు మరింతగా విషమించి, దేశ భద్రతే పెనుప్రమాదంలో పడుతుంది!

రచయిత- సంజీవ్‌ కె.బారువా

ఇదీ చూడండి: ఈశాన్యంలో పుట్టుకొస్తున్న ఉగ్రసంస్థలు.. చైనా అండతోనే!

ABOUT THE AUTHOR

...view details