ఇష్టమైతే ఏ పనైనా కష్టమనిపించదు. ఉత్సాహం, ఆసక్తి ఉంటే చేసే పనిలో తృప్తి, ఆనందం ఉంటాయి. అలాంటి అవకాశాన్ని కలిగించే అంశాలు, పనులు చాలా ఉన్నాయి. ఆ జాబితాలోకి 'ఇంటిలోనే పండించుకునే పంటలూ' వస్తాయి. వీటిని ప్రోత్సహించడానికి ఏటా ఆగస్టు నెల ఆఖరి ఆదివారాన్ని 'ఇంటి పంటల దినోత్సవం'గా జరుపుకొంటారు.
ఇంటి ఆవరణలో ఎవరికి వారు స్వయంగా కూరగాయలు, ఆకుకూరలు, ఇంకా అవకాశం ఉంటే చిన్న జాతి చెట్లను పెంచడాన్ని ఇంటిపంట, లేదా పెరటి తోట అంటారు. ఇంటి పంటలతో ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయి. మంచి పోషక విలువలు కలిగిన తాజా ఆకుకూరలు, కాయగూరలు, పండ్లు నిత్యం ఆహారంలో లభిస్తాయి. తోటపనితో శరీరానికి వ్యాయామం, మనసుకు ఉల్లాసం కలుగుతాయి. హృదయ మార్దవం, రసాస్వాదన ఉన్నవారికి పెరటి మొక్కల పెంపకం ఎంతో సంతృప్తినిస్తుంది. పిల్లల్లో సున్నితత్వం, మమకారం, జాగ్రత్త పెరుగుతాయి. ఫలితంగా ప్రతివారి పట్ల గౌరవం, అభిమానం, ప్రేమ, ఆప్యాయతల్లాంటివి చూపిస్తారు.
ఏఏ పంటలు..
ఇంటి పంటల పెంపకానికి పెద్ద ప్రణాళికలు, మదుపు అవసరం ఉండదు. చాలారకాల మొక్కలు, చెట్లు పెద్దగా సంరక్షణ చేయకపోయినా ఫలసాయాన్ని ఇస్తాయి. కంద, చేమ, అల్లం, మామిడిఅల్లం వంటి దుంప జాతులు, బొప్పాయి, జామ, దానిమ్మ, వంటి పండ్ల జాతులు ఈ కోవలోకే వస్తాయి. వీటితో పాటు మరికాస్త శ్రద్ధ వహిస్తే మన శ్రమకు అనేక ఎక్కువ రెట్లు ఫలితాన్నిచ్చే పెరటి మొక్కలెన్నో ఉన్నాయి. పాలకూర, తోటకూర, బచ్చలికూర, గోంగూర లాంటి ఆకుకూరలు, వంగ, బెండ, టమోటా వంటి కూరగాయల మొక్కలు, బీర, పొట్ల, దొండ, కాకర, చిక్కుడు, దోస వంటి పాదులకు కాసే కూరగాయలు, మెంతికూర, కొత్తిమీర, పుదీనా వంటి సుగంధ ద్రవ్య ఆకుకూరలను పెరటి తోటల్లో పెంచవచ్చు. ఆనప పాదు కొనలకు షెడ్లు, ఇళ్ల పైకప్పులు వంటి వాటి మీదకు దారి చూపితే చాలు- ఆపైన ఆ పాదు తనంత తానుగా అల్లుకొని విరగకాస్తుంది. వీటితో పాటు ఔషధ మొక్కలైన కలబంద, నల్లేరు, గుంటగలగర, నేలవేము, రుద్రజడ(సబ్జా గింజల మొక్క) వంటివి ఎక్కువ స్థలాన్ని ఆక్రమించవు. వేటికీ అడ్డు పడకుండా పెరుగుతాయి. అభిరుచిని బట్టి అందమైన పూల మొక్కలనూ పెంచుకోవచ్చు.