హిమాలయ రాష్ట్రమైన ఉత్తరాఖండ్‌లో ఆలయాల నిర్వహణ, ఆధ్యాత్మిక పర్యాటకం విషయంలో మునుపెన్నడూ లేని రీతిలో ఇటీవల వివాదాలు చెలరేగాయి. ప్రఖ్యాత బద్రీనాథ్, కేదార్‌నాథ్, యమునోత్రి, గంగోత్రి దేవాలయాలకు కొవిడ్ కారణంగా భక్తుల సందర్శనను నిలిపివేశారు. మరోవైపు, రాష్ట్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఆందోళన చేపట్టేందుకు ఈ దేవాలయాలకు చెందిన పూజారులు బహిరంగంగా గళమెత్తారు. రాష్ట్ర ప్రభుత్వ చట్టం కింద 2019లో ఏర్పాటు చేసిన చార్‌ధామ్ నిర్వహణ బోర్డుగా పిలిచే తాత్కాలిక కమిటీని కొనసాగించాలన్న నిర్ణయమే వీరి ఆందోళనకు కారణంగా నిలుస్తోంది. ఈ తరహా కమిటీ ఏర్పాటును తీవ్రంగా వ్యతిరేకిస్తున్న పూజారులు జూన్ 28 నుంచి ఆందోళన ప్రారంభించేందుకు సన్నద్ధమవుతున్నారు. వివాదానికి సంబంధించిన మూలం చాలాఏళ్లక్రితం నుంచే ఉంది.
ఏటా లక్షల మంది..
దేవభూమి ఉత్తరాఖండ్‌లోని చార్‌ధామ్ ఆలయాల్లో ఒకటైన బద్రీనాథ్ క్షేత్రాన్ని ఆదిశంకరాచార్యులు నిర్మించారని భక్తుల విశ్వాసం. గంగానదికి మూలమైన గౌముఖికి ఇది కొద్ది మైళ్ల దూరంలో ఉంటుంది. దేవప్రయాగ వరకు భగీరథిగా పిలిచే ఈ నదిని, అలకనందా నదితో కలిశాక 'గంగ'గా వ్యవహరిస్తారు. అటు కేదార్‌నాథ్‌లో ప్రవహించే మందాకిని, అలకనందల సంగమం రుద్రప్రయాగలో జరుగుతుంది. ఈ ప్రదేశాల్లో ప్రకృతి అందం వర్ణనాతీతం. ఈ క్రమంలో ప్రపంచ నలుమూలల నుంచి ఏటా లక్షల మంది భక్తులు, పర్యాటకులు ఈ ప్రాంతాలను సందర్శిస్తారు. సామాన్య భక్తులతోపాటు దేశంలోని ఎంతోమంది ప్రముఖులు దైవక్షేత్రాలను సందర్శించుకుని దేవాలయాల హుండీలకు భారీ విరాళాలు సమర్పించడం ఆనవాయితీ. గతంలో ఈ ఆలయాల నిర్వహణ, ఆర్థిక వ్యవహారాల్లో ఇక్కడి పురోహితులకు ప్రత్యేక స్థానం ఉండేది. నిధుల నిర్వహణలో వారికి స్వేచ్ఛ ఉండేది. కానీ 1939లో నాటి సంయుక్త ప్రావిన్సు గఢ్వాల్ ప్రాంతంలోని హిందూ దేవాలయాల నిర్వహణను బద్రీనాథ్-కేదార్‌నాథ్ చట్టం కింద ఏర్పాటు చేసిన ప్రత్యేక కమిటీ పర్యవేక్షణ కిందకి తీసుకొచ్చిన అనంతరం పరిస్థితులు మారి పోయాయి. పర్యవేక్షక కమిటీ ఏర్పాటుకు అప్పట్లో పురోహితుల నుంచి వ్యతిరేకత ఎదురైనప్పటికి, గట్టి ప్రతిఘటన వ్యక్తం కాలేదు. ఫలితంగా ఎలాంటి మార్పులూ చోటుచేసుకోలేదు.
పూజారులు ఆగ్రహం..
చార్‌ధామ్‌తోపాటు ఉత్తరాఖండ్ ఆలయాలకు దేశంలో ప్రత్యేక స్థానం ఉంది. కానీ కరోనా సంక్షోభం కారణంగా రెండేళ్లుగా ఆలయాల సందర్శనకు భక్తుల రాకను అనుమతించడం లేదు. వరసగా రెండేళ్లు భక్తులను అనుమతించకపోవడం ఇదే మొదటిసారి. ఈ పరిణామాల ఫలితంగా స్థానిక ఆలయాలకు సంబంధించిన పూజారులు, పాండాలు జీవనాధారం కోల్పోయారు. స్థానిక హోటల్, పర్యాటక పరిశ్రమలు దిక్కుతోచని స్థితిలో పడ్డాయి. వీటన్నింటికి మించి, కరోనా తొలి దశ వ్యాప్తికి కొద్ది నెలల ముందు, రాష్ట్ర ప్రభుత్వం 2019లో ఆలయాల నిర్వహణను తన అధీనంలోకి తీసుకుంది. ఈ నిర్ణయంపై పూజారులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కొత్తగా ఏర్పాటు చేసిన తాత్కాలిక కమిటీ రాష్ట్రంలోని 53 దేవాలయాల వ్యవహారాలకు సంబంధించిన తమ సంప్రదాయ హక్కులను ఉల్లంఘించినట్లేనని ఆరోపిస్తున్నారు. ఈ నేపథ్యంలో ప్రస్తుత కొవిడ్ మహమ్మారి పరిస్థితులు, ప్రభుత్వ మార్గదర్శకాలు, పూజారుల ఆందోళనలు వెరసి, ఉత్తరాఖండ్‌లో ఆధ్యాత్మిక పర్యాటక పునరుద్ధరణ అవకాశాలు మరింత సన్నగిల్లాయనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.