ఎట్టకేలకు టెలికాం రంగానికి(Telecom Sector News) భారీ ఉపశమనం దక్కింది. వేల కోట్ల రూపాయల బకాయిల చెల్లింపు భారం, 5జీ లాంటి ఆధునిక సాంకేతికతను అందిపుచ్చుకోవడానికి ఆర్థిక ఇబ్బందులు.. వంటి సమస్యలతో కొట్టుమిట్టాడుతున్న ఈ రంగానికి ప్రభుత్వ తాజా నిర్ణయం కొత్త ఊపిరి పోసింది. దేశంలోని ప్రైవేటు టెలికాం ఆపరేటర్లు కేంద్ర ప్రభుత్వానికి కట్టాల్సిన లక్షా ముప్పై వేల కోట్ల రూపాయలకు పైగా సర్దుబాటు చేసిన స్థూల ఆదాయం (అడ్జెస్టెడ్ గ్రాస్ రెవిన్యూ- ఏజీఆర్(Agr Dues in Telecom), స్పెక్ట్రమ్ బకాయిల వసూలుపై నాలుగేళ్లపాటు మారటోరియం విధిస్తున్నట్లు కేంద్ర టెలికాం శాఖ మంత్రి అశ్విన్ వైష్ణవ్(Telecom Minister Latest News) చేసిన తాజా ప్రకటన ఆ సంస్థల నెత్తిన పాలుపోసింది. విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులను నూరు శాతానికి పెంచడంతో టెలికాం సంస్థలకు మరింత విదేశీ రుణసాయం పొందే అవకాశం ఏర్పడుతోంది. ఇతరత్రా ఆదాయాలను ఏజీఆర్ నుంచి మినహాయించడం, కొరత ఉన్న స్పెక్ట్రమ్‌ను పంచుకోవడానికి అనుమతి ఇవ్వడం వంటి నిర్ణయాలు తీసుకోవడం గమనార్హం. 'టెలికాం రంగంలో పెట్టుబడులు పెరిగి, నగదు లభ్యత ఏర్పడేందుకు వీలుగా ఈ చర్యలు తీసుకున్నాం. తద్వారా ఈ రంగంలో ఉన్న ఉద్యోగాలను కాపాడటానికి, కొత్తగా మరిన్ని కొలువుల కల్పనకు, సంస్థల మధ్య ఆరోగ్యకరమైన పోటీ వాతావరణం ఏర్పడటానికి, వినియోగదారుల ప్రయోజనాలు కాపాడటానికి వీలవుతుందని భావిస్తున్నాం' అని టెలికాం మంత్రి చెబుతున్నారు. ఆర్థిక వ్యవస్థను ముందుకు తీసుకెళ్ళడంలో కీలకమైన టెలికాం రంగానికి కేంద్రం ప్రకటించిన ఉపశమన చర్యలను స్వాగతిస్తున్నామని, ఈ చర్యల వల్ల 'డిజిటల్ ఇండియా' లక్ష్యాలను భారత్ చేరుకుంటుందని రిలయన్స్ జియో అధినేత ముకేశ్ అంబానీ అంటున్నారు. తాజా సంస్కరణల వల్ల భయం లేకుండా పెట్టుబడులు పెట్టడానికి వీలవుతుందని భారతీ ఎయిర్‌టెల్ ఛైర్మన్ సునీల్ మిత్తల్ ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.
భారీ బకాయిలు..
ప్రైవేటు టెలికాం కంపెనీలు కేంద్రానికి ఏజీఆర్ కింద చెల్లించాల్సిన బకాయిల్లో ఎయిర్‌టెల్ వాటా రూ.43,980 కోట్లు; వొడాఫోన్ ఐడియా కట్టాల్సింది రూ.58,254 కోట్లు. ఇవికాక స్పెక్ట్రమ్ ఛార్జీలు మరో రూ.40 వేల కోట్లు చెల్లించాల్సి ఉంది. వీటిని చెల్లించాలంటూ 2019 అక్టోబర్‌లోనే సుప్రీంకోర్టు తీర్పిచ్చింది. స్పందన రాకపోవడంతో తక్షణమే చెల్లించాలంటూ గతేడాది మరోమారు ఆదేశించింది. ఎయిర్‌టెల్ దాదాపు రూ.18 వేల కోట్ల ఏజీఆర్ బకాయిలను చెల్లించింది. వినియోగదారుల సంఖ్య తగ్గిపోతూ ఆదాయంలో భారీ లోటు ఏర్పడిన వొడాఫోన్ ఐడియా మాత్రం రూ.7,854 కోట్లు మాత్రమే చెల్లించి, చేతులెత్తేసింది. వొడాఫోన్ ఐడియాలో తన వాటాను కేంద్ర ప్రభుత్వానికిగాని, ప్రభుత్వ గుర్తింపు పొందిన సంస్థకుగాని ఉచితంగా ఇచ్చేస్తానంటూ ఆ సంస్థ ఛైర్మన్ కుమారమంగళం బిర్లా ఈ ఏడాది జులైలో కేంద్ర క్యాబినెట్ కార్యదర్శికి లేఖ రాయడం దాని ఆర్థిక పరిస్థితికి అద్దం పడుతోంది. ఈ నేపథ్యంలో బకాయిల చెల్లింపునకు నాలుగేళ్ల వెసులుబాటు కల్పించడం వొడాఫోన్ ఐడియాకు అతిపెద్ద ఉపశమనం కానుంది!
బకాయిలు తక్షణం చెల్లించాల్సిందేనన్న సుప్రీం తీర్పుతో దేశంలోని ప్రైవేటు టెలికాం కంపెనీలు కుదేలయ్యాయి. కొత్త సాంకేతికతను సమకూర్చుకోవడం, 4జీ నెట్‌వర్క్‌ను మరింత పటిష్ఠపరచడం, 5జీ పరిజ్ఞానాన్ని తీసుకొచ్చేందుకు వేగంగా అడుగులు కదపడం.. ఇలా అన్నింటిపైనా బకాయిల భారం ప్రభావం చూపింది. తాజా వెసులుబాటుతో కంపెనీలు వీటన్నింటిపైనా దృష్టిపెట్టే అవకాశం ఉంది. దేశంలో ఇంకా చాలా ప్రాంతాల్లో 4జీ నెట్‌వర్క్ కూడా నాణ్యంగా లేదు. దీన్ని మెరుగుపరచడానికి, 5జీ నెట్‌వర్క్ ఏర్పాటుకు అవసరమైన మౌలిక వసతుల కల్పనకు ముందడుగు వేయడానికి తాజా నిర్ణయం ఉపకరిస్తుంది. ఎప్పటి నుంచో పరిశ్రమ కోరుతున్న చర్యల దిశగా ప్రభుత్వం అడుగులు వేయడాన్ని ఆహ్వానిస్తున్నామని, తాజా సంస్కరణలు 4జీ, 5జీకే కాకుండా 6జీ సాంకేతికతకు సైతం కార్యాచరణ ప్రణాళికలా ఉంటాయని భావిస్తున్నామని భారత సెల్యులర్ నిర్వాహకుల సంఘం (కాయ్) డైరెక్టర్ జనరల్ ఎస్‌పీ కొచ్చర్, టెలికాం ఉపకరణాల తయారీదారుల సంఘం (టెమా) గౌరవ అధ్యక్షులు ఎన్.కె.గోయల్ వంటివారు విశ్లేషిస్తున్నారు.
పెరగనున్న పోటీ