తెలంగాణ

telangana

ETV Bharat / opinion

టీకా పరీక్షా కేంద్రం విషయంలో ఎందుకింత సాగదీత? - కరోనా వైరస్ టీకా భారతదేశం

ఆసుపత్రులు, వైద్యులు, పడకలు, ఔషధాలు, వైద్య పరికరాల కొరత సర్వత్రా పెను విషాద సృష్టికి కారణమైంది. ఇప్పుడు ప్రాణాధార వ్యాక్సిన్ల నిర్నిరోధ తయారీకీ ఎదురుకానున్న ఇబ్బందికి- తెలంగాణ పరిశ్రమలు, ఐటీ శాఖల మంత్రి కేటీఆర్‌ కేంద్ర సచివులకు రాసిన లేఖ అద్దం పట్టింది. వచ్చే ఆరు నెలల్లో హైదరాబాద్‌ నుంచే వంద కోట్ల డోసుల టీకాలు ఉత్పత్తి కానుండగా, వాటి పరీక్షా కేంద్రం మాత్రం ఎక్కడో 1,871 కిలోమీటర్ల దూరంలో ఉండటం, ప్రతి బ్యాచ్‌ టీకానూ హిమాచల్‌ ప్రదేశ్‌లోని కసౌలీకి పంపించి ధ్రువీకరణ పొందాల్సి రావడం వ్యయప్రయాసలతో పాటు సమయాన్ని వృథా చేస్తుందన్న కేటీఆర్‌ ఆవేదన సబబే.

vaccines
వ్యాక్సిన్లు

By

Published : Jun 23, 2021, 9:11 AM IST

కొవిడ్‌ మహాసంక్షోభం దేశీయంగా వైద్య-ఆరోగ్య, ఔషధ, వైద్య పరికరాల పరిశ్రమల పరిమితుల్ని, సవాళ్లకు దీటుగా ఎదిగే క్రమంలో అవి ఎదుర్కొంటున్న ప్రతిబంధకాల్ని స్పష్టంగా కళ్లకు కట్టింది. మహమ్మారి మరోసారి విరుచుకుపడినా సమర్థంగా కాచుకొనేలా ఆరోగ్య మౌలిక సదుపాయాల్ని 45 రెట్లు పెంచినట్లు కేంద్రం 'సుప్రీం' న్యాయపాలికకే నివేదించినా- ఆసుపత్రులు, వైద్యులు, పడకలు, ఔషధాలు, వైద్య పరికరాల కొరత సర్వే సర్వత్రా పెను విషాద సృష్టికి కారణమైంది.

కేటీఆర్​ ఆవేదన

ఇప్పుడు ప్రాణాధార వ్యాక్సిన్ల నిర్నిరోధ తయారీకీ ఎదురుకానున్న ఇబ్బందికి- తెలంగాణ పరిశ్రమలు, ఐటీ శాఖల మంత్రి కేటీఆర్‌ కేంద్ర సచివులకు రాసిన లేఖ అద్దం పట్టింది. వచ్చే ఆరు నెలల్లో హైదరాబాద్‌ నుంచే వంద కోట్ల డోసుల టీకాలు ఉత్పత్తి కానుండగా, వాటి పరీక్షా కేంద్రం మాత్రం ఎక్కడో 1,871 కిలోమీటర్ల దూరంలో ఉండటం, ప్రతి బ్యాచ్‌ టీకానూ హిమాచల్‌ ప్రదేశ్‌లోని కసౌలీకి పంపించి ధ్రువీకరణ పొందాల్సి రావడం వ్యయప్రయాసలతో పాటు అమూల్య కాలహననానికీ దారి తీస్తోందన్న కేటీఆర్‌ ఆవేదన అర్థవంతం.

ఎందుకు ఆలస్యం?

ఈ పరీక్షల ప్రక్రియకే నెల నుంచి నెలన్నర సమయం పడుతుండటం- కాలంతో పోటీపడుతూ సాగాల్సిన ప్రాణరక్షక టీకాల ఉత్పత్తికి ఇబ్బందికర పరిణామం! ఆ పరీక్షాకేంద్రాన్ని హైదరాబాద్‌లో నెలకొల్పితే అదనంగా 8-10 కోట్ల డోసుల ఉత్పత్తి సాధ్యపడుతుందన్న కేటీఆర్‌- ఇదే విషయమై కేంద్రానికి ఇప్పటికి ముమ్మార్లు లేఖ రాశారు. పరీక్షా కేంద్రానికి జినోమ్‌ వ్యాలీలో భూమితోపాటు సత్వరం మౌలిక సదుపాయాలన్నీ కల్పిస్తామన్న తెలంగాణ వినతిని ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు సైతం కేంద్రం దృష్టికి మొన్న జనవరిలో తీసుకెళ్లారు. ప్రపంచవ్యాప్తంగా వ్యాక్సిన్ల పరీక్ష-ధ్రువీకరణ కేంద్రాలు ఏడే ఉన్నాయని, కొత్తదాని ఏర్పాటుకు అంతర్జాతీయ సంస్థ గుర్తింపు అవసరం పడుతుందన్న కేంద్రం- ఆ విషయంలో ఎందుకు జాగు చేస్తున్నట్లు?

హైదరాబాద్‌ భారతావనికే శిరోభూషణం

ప్రపంచవ్యాప్త వ్యాక్సిన్ల ఉత్పత్తిలో మూడోవంతుకు కేంద్రస్థలిగా, ఏటా 600 కోట్ల డోసులకు మించిన తయారీ సామర్థ్యం గల హైదరాబాద్‌ భారతావనికే శిరోభూషణమనడంలో సందేహం లేదు. కొవాగ్జిన్‌తోపాటు భారత్‌ బయోటెక్‌ మరో మూడు టీకాల్ని అభివృద్ధి చేస్తుంటే, తన 'స్పుత్నిక్‌ వి' తయారీ కోసం రష్యా హైదరాబాద్‌కే చెందిన మూడు సంస్థలతో ఒప్పందం కుదుర్చుకొనడం సామాన్యమైన విషయం కాదు. 200 ఔషధ సంస్థలు, అంతకురెట్టింపుపైగా ఫార్ములా సంస్థలకు నెలవైన తెలంగాణ- కొవిడ్‌పై మానవాళి పోరులో కీలక భూమిక పోషిస్తున్న వేళ ఇది! తెలంగాణలో ప్రతిష్ఠాత్మక జాతీయ ఔషధ నియంత్రణ అకాడమీ, జాతీయ ఫార్మకోపియా కమిషన్‌ ప్రాంతీయ కేంద్రం ఏర్పాటుకు రెండేళ్ల క్రితమే సమ్మతించి, ఇంకా సాగదీస్తున్న కేంద్రం- వ్యాక్సిన్‌ పరీక్షా కేంద్రం విషయంలోనూ అదే సాచివేత ధోరణి కనబరచడం ఆత్మహత్యా సదృశమవుతుంది.

అందివస్తున్న ఆధునిక సాంకేతికత, ఔషధ వైద్య పరికరాల తయారీ రంగంలో విప్లవాత్మక మార్పులకు బాటలు పరచి స్వస్థ సమాజాల ఆవిష్కారానికి కొత్త గవాక్షాలు తెరుస్తున్న తరుణమిది. నిరుడు దాదాపు 4,200 కోట్ల డాలర్లుగా ఉన్న భారత ఔషధ పరిశ్రమ పరిమాణం 2030 నాటికి 13 వేల కోట్ల డాలర్ల సురుచిర ప్రగతి లక్ష్యాన్ని సాధించాలంటే ఏటికేడు 12శాతం వృద్ధిరేటుకు గురిపెట్టాల్సిందేనని 'ఫిక్కీ' నివేదిక చాటుతోంది. ఉత్పాదకతతో ముడివడిన ప్రోత్సాహక (పీఎల్‌ఐ) విధానం ద్వారా 13 కీలక రంగాల్లో కొత్త చురుకు పుట్టించడానికి ప్రయత్నిస్తున్న మోదీ ప్రభుత్వం- ప్రపంచానికి ఔషధశాలగా ఇండియా ఎదుగుదలను లక్షిస్తోంది! ఆదర్శాలు ఆకాంక్షలకు దీటుగా చేతలూ రాణిస్తేనే కదా- ప్రాణాధార ఔషధ పరిశ్రమ వృద్ధి లక్ష్యాల ఉట్టి కొట్టగలిగేది?

ఇదీ చదవండి:వ్యాక్సినేషన్​లో భారత్​ రికార్డు- ఒక్కరోజే 86 లక్షల డోసులు

ABOUT THE AUTHOR

...view details