భారత విదేశాంగ కార్యదర్శి హర్షవర్ధన్ ష్రింగ్లా తన రెండు రోజుల బంగ్లాదేశ్ పర్యటన ముగించుకున్నారు. వ్యాక్సిన్ కోసం జరుగుతున్న ప్రాథమిక ట్రయల్స్‌లో బంగ్లాకు తగిన ప్రాధాన్యమిస్తామని ష్రింగ్లా హామీ ఇచ్చారు. కరోనా కట్టడి, కొవిడ్ తదనంతర ఆర్థిక వ్యవస్థపై చర్చించినట్లు అధికారులు ప్రకటించినప్పటికీ.. పర్యటన ముఖ్య అజెండా మరొకటి ఉందని పరిశీలకులు అభిప్రాయపడతున్నారు. తీస్తా నది నిర్వహణ కోసం బంగ్లాదేశ్‌కు చైనా సుమారు ఒక బిలియన్ డాలర్ల రుణాన్ని ఇవ్వడం కూడా ఈ పర్యటనకు కారణమని స్పష్టం చేస్తున్నారు.
"ఈ పర్యటనలో అజెండా తీస్తా జల వివాదం కూడా ఉండే అవకాశం ఉంది. ఈ విషయంలో తమకు ఆందోళనలు ఉన్నాయని భారత్ వారికి చెప్పే ఉంటుంది."
-భారత్-బంగ్లా వ్యవహారాల నిపుణులు
ప్రస్తుతం మూడో దశ క్లినికల్ ట్రయల్స్‌లో ఉన్న టీకాను ప్రాధాన్య క్రమంలో బంగ్లాదేశ్‌కు అందిస్తామని పర్యటనలో భాగంగా ష్రింగ్లా ఆ దేశానికి హామీ ఇచ్చారు. భారీ స్థాయిలో వ్యాక్సిన్ ఉత్పత్తికి భారత్ ప్రయత్నాలు చేస్తోందని తెలిపారు.
"వ్యాక్సిన్ అభివృద్ధి అయిన తర్వాత మిత్రులు, భాగస్వామ్య దేశాలు, పొరుగుదేశాలకు తప్పకుండా అందిస్తాం. ఇందులో మరో మాట లేదు. మాకు బంగ్లాదేశ్ ఎప్పటికీ ముఖ్యమైన దేశమే."
-ష్రింగ్లా
మరోవైపు తమ దేశంలో వ్యాక్సిన్ ట్రయల్స్ నిర్వహిస్తే భారత్‌కు సహకరించేందుకు బంగ్లాదేశ్ సిద్ధంగా ఉంటుందని ఆ దేశ విదేశాంగ కార్యదర్శి మసూద్ బిన్ మోమెన్ తెలిపారు.
"వ్యాక్సిన్ కేవలం భారత్ కోసమే తయారు చేయడం లేదని వారు(భారత అధికారులు) చెప్పారు. బంగ్లాదేశ్‌కు కూడా తొలి దశలోనే అందిస్తామని హామీ ఇచ్చారు."
-మసూద్ బిన్ మోమెన్, బంగ్లాదేశ్ విదేశాంగ కార్యదర్శి
ష్రింగ్లా పర్యటనలో కొవిడ్ వ్యాక్సిన్‌పైనే ప్రధానంగా దృష్టిసారించినట్లు కనిపిస్తున్నప్పటికీ.. ఈ ఆకస్మిక పర్యటన ముఖ్య ఉద్దేశం మాత్రం బంగ్లాపై చైనా ప్రభావమేనని తెలుస్తోంది.
తెరపైకి 'తీస్తా'
చైనాకు చెందిన సినోవాక్ బయోటెక్ లిమిటెడ్ అభివృద్ధి చేసిన కరోనా వ్యాక్సిన్ ఫేజ్ 3 క్లినికల్ ట్రయల్స్ బంగ్లాదేశ్‌లో నిర్వహించేందుకు ఆ దేశ వైద్య పరిశోధనా సంస్థ తొలుత అనుమతులు ఇచ్చింది. తర్వాత ఈ అనుమతులను నిలిపివేసింది. అయితే తాజాగా తీస్తా నదీ జలాల నిర్వహణ కోసం బంగ్లాకు సుమారు ఒక బిలియన్ డాలర్ల రుణాన్ని చైనా మంజూరు చేయడం భారత్‌కు కొత్త తలనొప్పిగా మారింది. ఒక దక్షిణాసియా దేశంలో నదీ జలాల నిర్వహణ అంశంలో చైనా తలదూర్చడం ఇదే తొలిసారి.
కుదిరినట్లే కుదిరి..
భారతదేశానికి అత్యంత సన్నిహిత పొరుగుదేశాల్లో బంగ్లాదేశ్ ఒకటి. బంగ్లాతో మంచి సంబంధాలు ఉన్నప్పటికీ తీస్తా నదీ జలాల వివాదం మాత్రం ఇరుదేశాల మధ్య దశాబ్దాలుగా నలిగిపోతోంది. 2011లో అప్పటి ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ బంగ్లాదేశ్ పర్యటనలో భాగంగా తీస్తా నదీ జలాల విషయంలో ఇరుపక్షాల మధ్య ఒప్పందం దాదాపుగా కుదిరిపోయింది. కానీ బంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ వ్యతిరేకించడం వల్ల చివరి నిమిషంలో ఒప్పందం నిలిచిపోయింది.